
హజాయేలు నా యేలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతని నడుగగా ఎలీషా యీలాగు ప్రత్యుత్తరమిచ్చెను ఇశ్రాయేలువారి గట్టి స్థలములను నీవు కాల్చి వేయుదువు; వారి యౌవనస్థులను కత్తిచేత హతము చేయుదువు; వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు; వారి గర్భిణుల కడుపులను చింపి వేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నే నెరిగియుండుటచేత కన్నీళ్లు రాల్చుచున్నాను.
అందుకు హజాయేలు కుక్కవంటివాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా నీవు సిరియా మీద రాజవగుదువని యెహోవా నాకు బయలుపరచి యున్నాడనెను.
అతడు ఎలీషాను విడిచి వెళ్లి తన యజమానుని యొద్దకు రాగా అతడు ఎలీషా నీతో చెప్పిన దేమని అడుగగా అతడు నిజముగా నీవు బాగుపడుదువని అతడు చెప్పెననెను.
అయితే మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసికొని నీటిలో ముంచి రాజు ముఖము మీద పరచగా అతడు చచ్చెను; అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను.
ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలువారిని తగ్గించ నారంభించెను.
హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?
తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.