సర్వభూమిని నశింపజేయు నాశనపర్వతమా, నేను నీకు విరోధిని ఇదే యెహోవా వాక్కు. నేను నీమీదికి నా చేయి చాపి శిలలపైనుండి నిన్ను క్రిందికి దొరలించుదును చిచ్చుపెట్టిన కొండవలె ఉండజేయుదును.
మూలకుగాని పునాదికిగాని నీలోనుండి యెవరును రాళ్లు తీసికొనరు నీవు చిరకాలము పాడైయుందువు ఇదే యెహోవా వాక్కు.
భూమి కంపించుచున్నది నొప్పిచేత అది గిజగిజ లాడుచున్నది ఒక్క నివాసియు లేకుండ బబులోను దేశమును పాడుగా చేయవలెనని బబులోనునుగూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమాయెను.
బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును నక్కలకు నివాసస్థలమగును అది పాడై యెగతాళికి కారణముగా ఉండును.
ఉత్తరదిక్కునుండి దానిమీదికి ఒక జనము వచ్చుచున్నది ఏ నివాసియు లేకుండ అది దాని దేశమును పాడుచేయును మనుష్యులేమి పశువులేమి అందరును పారిపోవుదురు అందరును తర్లిపోవుదురు.
యెహోవా రౌద్రమునుబట్టి అది నిర్జనమగును అది కేవలము పాడైపోవును బబులోను మార్గమున పోవువారందరు ఆశ్చర్యపడి దాని తెగుళ్లన్నియు చూచి--ఆహా నీకీగతి పట్టినదా? అందురు
అందుచేతను అడవిపిల్లులును నక్కలును అక్కడ నివసించును నిప్పుకోళ్లును దానిలో నివాసముచేయును ఇకమీదట అది ఎన్నడును నివాసస్థలము కాకపోవును తరతరములు దానిలో ఎవరును కాపురముండరు.
యెహోవా వాక్కు ఇదే సొదొమను గొమొఱ్ఱాను వాటి సమీపపట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడును అక్కడ కాపురముండకపోవును ఏ నరుడును దానిలో బసచేయడు.
పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనందించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు.
తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి -ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.
నీ వర్తకులు భూమిమీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి; కావున వైణికులయొక్కయు, గాయకులయొక్కయు, పిల్లనగ్రోవి ఊదువారియొక్కయు బూరలు ఊదువారియొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటిధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు,
దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను.
ఈ దేశముమీదికిని దీని నివాసుల మీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను.
యెహోవా వాక్కు ఇదేడెబ్బది సంవత్సరములు గడచిన తరువాత వారి దోషములనుబట్టి నేను బబులోనురాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును; ఆ దేశము ఎప్పుడు పాడుగనుండునట్లు నియమింతును.
నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు నీ పట్టణములు మరల కట్ట బడకుండ ఎల్లప్పుడును పాడుగా ఉండజేయుదును .