
దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.
నా ప్రాణము దేవునికొరకు తృష్ణగొనుచున్నది జీవముగల దేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?
దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును
నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీతట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.
నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునైయున్నాడు.
నీ న్యాయవిధులమీద నాకు ఎడతెగని ఆశకలిగియున్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది.
(కఫ్) నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను
నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమివలె నా ప్రాణము నీకొరకు ఆశపడుచున్నది.
అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను.
ప్రేమాతిశయముచేత నేను మూర్ఛిల్లుచున్నాను ద్రాక్షపండ్ల యడలు పెట్టి నన్ను బలపరచుడి జల్దరు పండ్లు పెట్టి నన్నాదరించుడి
యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడినయెడల ప్రేమాతిశయముచేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియజేయునట్లు నేను మీచేత ప్రమాణము చేయించుకొందును.
ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక.
రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.
గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక.