నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే బాల్యమునుండి నా ఆశ్రయము నీవే.
దేవునియందు భయభక్తులుగలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను.
మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే , జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదానివలె అగుననియు ,
సింహముయొక్క బలమునుండియు , ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను . అందుకు సౌలు -పొమ్ము ; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదు తో అనెను .
దావీదు బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోను బయనాతోను ఇట్లనెను
యెహోవా తన్ను సౌలు చేతిలోనుండియు, తన శత్రువులందరి చేతిలోనుండియు తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను.
యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు.
నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును.నా కేడెము నా రక్షణశృంగము నా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు బలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే.
కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టితిని నా శత్రువుల చేతిలోనుండి ఆయన నన్ను రక్షించెను.
మృత్యువుయొక్క అలలు నన్ను చుట్టుకొనగను వరదపొర్లువలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదరించగను
పాతాళపాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరించగను
నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవుని ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొఱ్ఱ ఆయన చెవులలో చొచ్చెను.
అప్పుడు భూమి కంపించి అదిరెను పరమండలపు పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను.
ఆయన నాసికారంధ్రములలోనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను నిప్పు కణములను రాజబెట్టెను.
మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను.
కెరూబు మీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను.గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
గుడారమువలె అంధకారము తనచుట్టు వ్యాపింపజేసెను.నీటిమబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను.
ఆయన సన్నిధికాంతిలోనుండి నిప్పుకణములు పుట్టెను.
యెహోవా ఆకాశమందు గర్జించెను సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను.
తనబాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగావిడువగా ఆయన గద్దింపునకు ప్రవాహములఅడుగుభాగములు కనబడెను
భూమి పునాదులు బయలుపడెను.
ఉన్నతస్థలములనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను.
బలవంతులగు పగవారు, నన్ను ద్వేషించువారు, నాకంటె బలిష్ఠులైయుండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను.
ఆపత్కాలమందు వారు నామీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను.
నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను.
నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమునుబట్టియే నాకు ప్రతిఫలమిచ్చెను.
యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడచినవాడను కాను.
ఆయన న్యాయవిధులనన్నిటిని నేను లక్ష్యపెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడనుకాను.
దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని.
కావున నేను నిర్దోషినైయుండుట యెహోవా చూచెను తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.
దయగలవారియెడల నీవు దయ చూపించుదువు యథార్థవంతులయెడల నీవు యథార్థవంతుడవుగానుందువు.
సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు.
శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు
యెహోవా, నీవు నాకు దీపమైయున్నావు యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును.
నీ సహాయముచేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయమువలన నేను ప్రాకారములను దాటుదును.
దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము ఆయన శరణుజొచ్చువారికందరికి ఆయన కేడెము.
యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?
దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును.
ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేయును ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపును.
నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును.
నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్పచేయును.
నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు.
నా శత్రువులను తరిమి నాశనము చేయుదును వారిని నశింపజేయువరకు నేను తిరుగను.
నేను వారిని మింగివేయుదును వారిని తుత్తినియలుగా కొట్టుదును వారు నా పాదముల క్రింద పడి లేవలేకయుందురు.
యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు నామీదికి లేచినవారిని నీవు అణచివేయుదువు.
నా శత్రువులను వెనుకకు మళ్లచేయుదువు నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేయుదును.
వారు ఎదురు చూతురు గాని రక్షించువాడు ఒకడును లేకపోవును వారు యెహోవాకొరకు కనిపెట్టుకొనినను ఆయన వారికి ప్రత్యుత్తరమియ్యకుండును.
నేల ధూళివలె వారిని నలుగగొట్టెదను పొడిగా వారిని కొట్టెదను వీధిలోని పెంటవలె నేను వారిని పారపోసి అణగద్రొక్కెదను.
నా ప్రజల కలహములలో పడకుండ నీవు నన్ను విడిపించితివి జనులకు అధికారిగా నన్ను నిలిపితివి నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు.
అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు వారు నన్నుగూర్చి వినిన మాత్రముచేత నాకు విధేయులగుదురు
అన్యులు దుర్బలులై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు.
యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక
ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు ఆయన నా నిమిత్తము పగతీర్చు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే.
ఆయనే నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపించును నామీదికి లేచినవారికంటె ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.
అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామకీర్తన గానముచేసెదను.
నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు.
మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను.
వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతివాడు, యెమీయేలు షెమీరామోతు యెహీయేలు మత్తిత్యా ఏలీయాబు బెనాయా ఓబేదెదోము యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి, ఆసాపు తాళములను వాయించువాడు.
బెనాయా యహజీయేలు అను యాజకులు ఎప్పుడును దేవుని నిబంధన మందసము ఎదుట బూరలు ఊదువారు.
ఆ దినమందు యెహోవాను స్తుతిచేయు విచారణను ఏర్పరచి, దావీదు ఆసాపుచేతికిని వాని బంధువులచేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.ఆయన నామమును ప్రకటనచేయుడి ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి.
ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన అద్భుత క్రియలన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి.
ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు గాక.
యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము వెదకుడి.
ఆయన దాసులగు ఇశ్రాయేలు వంశస్థులారా ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతివారలారా
ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసికొనుడి ఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసికొనుడి.
ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి.
మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్పసంఖ్యగల జనులుగాను కనాను దేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాని నీకిచ్చెదనని
ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను
ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి.
వేయితరములవరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను.
యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్యనిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరచియున్నాడు.
వారు జనమునుండి జనమునకును రాజ్యమునుండిరాజ్యమునకును తిరుగులాడుచుండగా
నేను అభిషేకించినవారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడుచేయవద్దనియు సెలవిచ్చి
ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్యలేదు వారి నిమిత్తము రాజులను గద్దించెను.
సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి.
అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి.
యెహోవా మహా ఘనత వహించినవాడు ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు.
జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవైశాల్యమును సృజించినవాడు.
ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి.
జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమాబలమును యెహోవాకు చెల్లించుడి.
యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయనయెదుట సాగిలపడుడి.
భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి అప్పుడు భూలోకము కదలకుండును అప్పుడది స్థిరపరచబడును.
యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక
సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక పొలములును వాటియందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు.
భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సయించును.
యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి.
దేవా మా రక్షకా, మమ్మును రక్షించుము మమ్మును చేర్చుకొనుము.
మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశములోనుండి మమ్మును విడిపింపుము. అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరు ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి.