కీడు చేయువారు నిర్మూలమగుదురు యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.
దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు
నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును.
కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు
నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి.
యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు.
అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.
అప్పుడు -ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.
ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.
జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును.