(వావ్) యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము నీ మాటచొప్పున నీ రక్షణ రానిమ్ము.
దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము
నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము.
నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది.
యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టు చున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు.
నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతికార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు . మా దేవా , చెవి యొగ్గి ఆలకింపుము ; నీ కన్నులు తెరచి , నీ పేరు పెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును , నీ పేరు పెట్టబడిన యీ పట్టణమును దృష్టించి చూడుము .
నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి.
నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు.
యెహోవా, నీ రక్షణకొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము.
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా,వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందును వారు నాకు ప్రజలైయుందురు.
వారిలో ఎవడును ప్రభువును తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశముచేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరును నన్ను తెలిసికొందురు.
నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.