ఆయన భూమ్యంతములవరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటిని తెలిసికొనుచున్నాడు.
గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచిచూచినప్పుడు
వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరచినప్పుడు
ఆయన దాని చూచి బయలుపరచెను దానిని స్థాపనచేసి దాని పరిశోధించెను.
ఎవడైన భూమిని ఆయనకు అప్పగింతపెట్టెనా? ఎవడైన సర్వప్రపంచ భారమును ఆయన కప్పగించెనా?
నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడనుంటివి?నీకు వివేకముకలిగియున్నయెడల చెప్పుము.
నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము.
దానిమీద పరిమాణపు కొలవేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము.
ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?
సముద్రము దాని గర్భమునుండి పొర్లిరాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు?
నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా?
దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు
నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?
అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించునట్లును
అది దుష్టులను తనలోనుండకుండ దులిపివేయునట్లును నీ వెప్పుడైన ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా?
ముద్రవలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునొందును విచిత్రమైన పనిగల వస్త్రమువలె సమస్తమును కనబడును.
దుష్టుల వెలుగు వారియొద్దనుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరుగగొట్టబడును.
సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా?మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా?
మరణద్వారములు నీకు తెరవబడెనా? మరణాంధకార ద్వారములను నీవు చూచితివా?
భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైన తెలిసివయెడల చెప్పుము.
వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది?చీకటి అనుదాని ఉనికిపట్టు ఏది?
దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా?ఇదంతయు నీకు తెలిసియున్నది గదా.
నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి.
నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా?
ఆపత్కాలముకొరకును యుద్ధముకొరకును యుద్ధదినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా?
వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి యెక్కడనుండి వచ్చి భూమిమీద నఖ ముఖములను వ్యాపించును?
నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను వర్షము కురిపించుటకును
పాడైన యెడారిని తృప్తిపరచుటకును లేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను
ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు?
వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు?
మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?
జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును.
కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
వాటి వాటి కాలములలో నక్షత్రరాసులను వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా?
ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమిమీదగల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా?
జలరాసులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞఇయ్యగలవా?
మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా?
అంతరింద్రియములలో జ్ఞానముంచినవాడెవడు? హృదయమునకు తెలివినిచ్చినవాడెవడు?
జ్ఞానముచేత మేఘములను వివరింపగలవాడెవడు?
ధూళి బురదయై పారునట్లును మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనునట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు?
ఆడుసింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా?
సింహపుపిల్లలు తమ తమ గుహలలో పండుకొనునప్పుడు తమ గుహలలో పొంచియుండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా?
తిండిలేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొఱ్ఱపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు?
మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను ? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధిక శక్తిచేతను తనకు కలిగియున్న బలా తిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచి పెట్టడు .
మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును.
ఆయన తనచుట్టు తన మెరుపును వ్యాపింపజేయును సముద్రపు అడుగుభాగమును ఆయన కప్పును.
వీటివలన ఆయన ఆయా ప్రజలకు తీర్పుతీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు
ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును
వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి యెక్కడనుండి వచ్చి భూమిమీద నఖ ముఖములను వ్యాపించును?
నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను వర్షము కురిపించుటకును