
మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును, సందేహాంశములను పరిష్కరించుటకును, యెహోషాపాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలీయుల పితరుల యిండ్ల పెద్దలలోను కొందరిని నియమించి
నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమునుబట్టి జనులకు తీర్పుతీర్చవలెను.
నీవు న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు; పక్షపాతము చేయకూడదు; లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును.
నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనునట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను.
ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి.
కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.
ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండకోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు.
నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు ; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు.
కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము.
మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి.
రాజు అందరికిని అధిపతియనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి.