Hits: 2926
Print
రచయిత: కె విద్యా సాగర్

21:1,2, 21:3, 21:4, 21:5, 21:6,7, 21:8, 21:9, 21:10,11, 21:12, 21:13, 21:14-16, 21:17,18, 21:19,20, 21:22-24, 21:25,26, 21:27-32, 21:33,34

ఆదికాండము‌ 21:1,2 యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయకాలములో శారా గర్భవతియై అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను.

ఈ వచనాలలో దేవుని వాగ్దానం చొప్పున (ఆదికాండము 12: 2) ఆయన చెప్పిన సమయంలో (ఆదికాండము 18:10-14) ఇస్సాకు జన్మించినట్టు మనం చూస్తాం. అబ్రాహాము తన 75వ యేట ఈ వాగ్దానం పొందుకుని కనానుకు బయలుదేరాడు (ఆదికాండము 12:1-4). ఆ 25 సంవత్సరాల తర్వాత ఈ ఇస్సాకు జన్మించాడు, ఇప్పుడు అబ్రాహాము వయస్సు 100 సంవత్సరాలు (5వ వచనం). అంటే అబ్రాహాముకు ఆయన చేసిన వాగ్దానం 25 సంవత్సరాలకు నెరవేరింది. ఒకవేళ ఆయన అబ్రాహాము శారాలకు ముసలితనంలో కాకుండా వయస్సుల్లో ఉన్నప్పుడే ఇస్సాకును అనుగ్రహిస్తే అది అంత అద్భుతంగానూ ఆయనకు అధికమహిమ తెచ్చేదిగానూ ఉండకపోను. అందుకే ఆయన అవకాశం ఉన్నప్పుడు ఆలస్యం చేసి ఏ అవకాశమూ లేని సమయంలో తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. దీనివల్ల ఆయన అధికమహిమను పొందుకోవడమే కాదు, వారికి అధిక ఆనందం కూడా కలుగచేసాడు. కాబట్టి ఆయన ఆలస్యం చేసినా ఆయన మహిమకే మరియు మన మేలుకే చేస్తాడని అనగా సార్వభౌముడైన ఆయన తాను నిర్ణయించిన సమయంలోనే కార్యాలను చేస్తాడని గుర్తించాలి. తన పిల్లలకు ఎప్పుడు ఏది అనుగ్రహిస్తే ఆయనకు అధికమహిమ కలుగుతుందో వారికి మరింత మేలు జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. కొందరు దీనికి విరుద్ధంగా దేవుని ముందే సమయాన్ని పెట్టి ఆ సమయ పరిధిలో తమ ప్రార్థనలను నెరవేర్చాలని కోరుతుంటారు. ఇది మంచిపద్ధతి కాదు. అందుకే మన ప్రార్థనల్లో "నీ చిత్తమైతే" అనే పదప్రయోగం హృదయపూర్వకంగా ప్రయోగించడం శ్రేయష్కరం. ఇది ఆయన నిర్ణయం పట్ల మన విధేయతను సూచిస్తుంది.

అదేవిధంగా విశ్వాసులమైన మనం కూడా వాగ్దానపుత్రులమని వాక్యం చెబుతుంది‌ (గలతీ 4: 28). అంటే అబ్రాహాముకు జన్మించడంలో ఇస్సాకు ప్రమేయం ఏవిధంగా లేదో మనం తిరిగి జన్మించడంలో కూడా మన ప్రమేయమేమీ లేదు. మన ఆ రక్షణ కేవలం దేవుని కృపమూలంగానే అనగా యేసుక్రీస్తుకు ఆయన చేసిన వాగ్దానం మూలంగానే జరిగింది (ఎఫెసీ 2:8, ఎఫెసీ 1:4-63,8, 1 పేతురు 1:4, తీతుకు 3:5). కాబట్టి ఇస్సాకులా వాగ్దాన పుత్రులమైన మనం అతనిలానే విధేయత చూపించాలి. దేవుని పట్ల అతని విధేయత ఎంత గొప్పదో అతని బలి సందర్భంలోనూ మిగిలిన జీవితమంతటిలోనూ మనకు అర్థమౌతుంది.‌ మనం కూడా అలాంటి విధేయత చూపించాలనే ఆయన మనల్ని రక్షించాడు (ఎఫెసీ 2:10). దేవునిపట్ల అలాంటి విధేయత లేనివారు అనగా ఆయన సిద్ధపరిచిన నీతిక్రియల పట్ల ఆసక్తిలేని వారు ఇస్సాకులా వాగ్దానపుత్రులు కారు. అంటే అసలు రక్షించబడినవారే కారు.

ఆదికాండము 21:3 అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరుపెట్టెను.

ఈ వచనంలో అబ్రాహాము తన కుమారుడికి ఇస్సాకు అనే పేరు పెట్టినట్టు మనం చూస్తాం. దేవుడు చెప్పినదాని ప్రకారమే అతను ఈ పేరును పెట్టాడు (ఆదికాండము 17:19). ఇస్సాకు అనే పేరుకు నవ్వు అనే అర్థం వస్తుంది. క్రింద శారా మాటల్లో కూడా అది మనకు అర్థమౌతుంది.

ఆదికాండము 21:4 మరియు దేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినములవాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను.

ఈ వచనంలో అబ్రాహాము ఇస్సాకుకు సున్నతి చేయించడం మనం చూస్తాం.
ఈ సున్నతిని గురించి కారణాన్ని ఇప్పటికే నేను వివరించాను (ఆదికాండము 17:10-14 వ్యాఖ్యానం చూడండి). అక్కడ దేవుడు చెప్పినదినంలోనే అబ్రాహాము ఆ కార్యం జరిగించి ఆయనకు విధేయత చూపిస్తున్నాడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. తాను ఇంతకాలం ఎదురుచూసిన వాగ్దానం నెరవేరిపోయింది కాబట్టి ఇక దేవునితో పనేం ఉందన్నట్టు ఆయన ఆజ్ఞను మరచిపోలేదు. నిజ విశ్వాసుల వైఖరి ఇలానే ఉంటుంది. ప్రార్థించిన కార్యం జరగిపోగానే ఆ కార్యం చేసిన దేవుణ్ణి మరచిపోయే ఆయన పట్ల ఎప్పటి అవిధేయతనే (పాపపు నడతనే) కనపరిచే బ్రష్టులు చాలామంది మనకు ఎదురౌతుంటారు కాబట్టి ఈమాటలు ప్రత్యేకంగా చెబుతున్నాను. మన‌ జీవితంలోని దేవుని మేలులన్నీ ఆయనకు అనగా ఆయన ఆజ్ఞలకు మనం మరింత విధేయత చూపించి ఆయనను మహిమపరచడానికి ఉద్దేశించబడినవే. అందుకే కీర్తనాకారుడు "నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము" (కీర్తనలు 103:2) అంటున్నాడు. భక్తులందరూ అలానే ప్రవర్తించారు.

యోహాను 8:47 దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును.

నిజానికి అబ్రాహాము ఇక్కడ ఇస్సాకు చిన్నపిల్లాడు కదా నొప్పి తట్టుకోలేడు కదా అని సులభంగా ఆ ఆజ్ఞకు అవిధేయత చూపించగలడు. దేవుడు అర్థం చేసుకుంటాడులే అని భావించగలడు కూడా. అంటే ఆజ్ఞకు అవిధేయత చూపించడానికి తగిన కారణాలు అతనికి ఉన్నాయి. అయినా అతను అలా చెయ్యలేదు. ఎందుకంటే పైన ప్రస్తావించినట్టు అతను దేవుని సంబంధి. దేవుని సంబంధులు కారణాలతో పనిలేకుండా ఆయన ఆజ్ఞాపించిన కార్యానికి పూనుకుంటారు‌. "దేవుడు మీకు అంత మేలు చేసినా ఇంకా అవిధేయులుగానే ఎందుకుంటున్నారు" అనే ప్రశ్నకు ఏవో సాకులు చెప్పేవారు కూడా మనకు ఉంటుంటారు కాబట్టి ఈ మాటలు కూడా చెబుతున్నాను.

యెషయా 26:10 దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు.

ఆదికాండము 21:5 అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు.

ఈ వచనంలో అబ్రాహాము తన వందవ యేట ఇస్సాకును కన్నట్టు మనం చూస్తాం. ఇది అతనికి సహజసిద్ధంగా కుమారుడిని కనే వయస్సు కాదు. అతని జీవితంలో ఇది మహా అద్భుతం. గమనించండి; అతను దేవుణ్ణి నమ్మాడు, నమ్మడం మాత్రమే కాదు ఆ నమ్మికకు రుజువుగా నిందారహితుడిగా నడుచుకున్నాడు. అందుకే ఊహించని అద్భుతం చూసాడు, అవధులు లేని ఆనందం అనుభవిస్తున్నాడు. దేవునినుండి మేలులు ఆశించే మనమంతా అతని మాదిరిని అనుసరించాలి.

ఆదికాండము 21:6,7 అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని యెవరు అబ్రాహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా? అనెను.

ఈ వచనాలలో శారా మాటలు మనం చూస్తాం. ఇక్కడ ఈమె కూడా దేవుడు నాకు నవ్వు కలుగచేసాడంటూ దేవుణ్ణే మహిమపరుస్తుంది. ఇస్సాకును కనేసరికి ఆమె వయస్సు 90 సంవత్సరాలు (ఆదికాండము 17:17). అప్పటికే ఆమెకు స్త్రీ ధర్మం (రుతుస్రావం) నిలచిపోయింది. అయినప్పటికీ దేవునిపట్ల తనకున్న విశ్వాసాన్ని బట్టి ఇస్సాకును కనే ఈ శక్తి పొందుకుందని వాక్యం చెబుతుంది (హెబ్రీ 11: 11).

అదేవిధంగా ప్రస్తుతం కొందరు దుష్టతల్లులు పిల్లలకు పాలిస్తే తమ దేహ సౌందర్యం క్షీణిస్తుందని, దేవుడు తమకు నిర్ణయించిన ప్రాధమిక బాధ్యతను విస్మరిస్తున్నారు. పిల్లలకు నెలలు గడవకముందే పోతపాలు (డబ్బాపాలు) అలవాటు చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనతో ఉన్న స్త్రీలు ఈ సందర్భంలో శారా చేసినదానిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఆమె ఆ వయస్సులో పాలిస్తే తన శరీరం ఇంకా బలహీనమౌతుందని ఆలోచించకుండా సంతోషంగా తన బాధ్యతను నిర్వర్తిస్తుంది. అది కూడా ఐదు సంవత్సరాలు ఆ పని చేసింది. దానిగురించి క్రింది వచనంలో చూద్దాం.

ఆదికాండము 21:8 ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.

ఈ వచనంలో ఇస్సాకు పాలు విడిచినప్పుడు అబ్రాహాము గొప్ప విందు చెయ్యడం మనం చూస్తాం. హెబ్రీయుల సంస్కృతి ప్రకారం పిల్లవాడికి 5 సంవత్సరాలు తర్వాత పాలు మానిపించి విందుచేస్తారు. అంటే అప్పటివరకూ తల్లిపాలే అని కాదు కానీ కొంచెం ఆహారం కూడా పెడుతూ ఐదవ యేట మాత్రం సంపూర్ణంగా తల్లిపాలు మానిపిస్తారు.

ఆదికాండము 21:9 అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి -

ఈ వచనంలో హాగరు కుమారుడైన ఇష్మాయేలు ఇస్సాకును పరిహసించడం మనం చూస్తాం. "నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు" (ఆదికాండము 15:13-14) అని దేవుడు అబ్రాహాముకు తెలియచేసిన శ్రమ కాలానికి ఇస్సాకు విషయంలో జరిగిన ఈ సంఘటన ప్రారంభం. అప్పటినుండి ఇస్సాకు, యాకోబులు తాము పరదేశులుగా నివసిస్తున్న కనానులో (అప్పటికి అది వారిది కాదు) ఎన్నో శ్రమలను అనుభవించారు. చివరిగా యోసేపు హయాంలో యాకోబుతో పాటు ఆ సంతానం ఐగుప్తుకు వెళ్ళి, అక్కడ కూడా తమది కాని దేశంలో 215 సంవత్సరాలు శ్రమలు అనుభవించారు. ఇస్సాకు పాలు విడిచినరోజున అతనికి సంభవించిన మొదటి శ్రమనుండి ఇశ్రాయేలీయులు మోషేనాయకత్వంలో ఐగుప్తు నుండి బయటకు‌ వచ్చేవరకూ మధ్య‌ఉన్న కాలమే అబ్రాహాముకు దేవుడు తెలియచేసిన ఆ 400 సంవత్సరాలు. ఈ అంశం గురించి మరింత వివరంగా తెలుసుకునేందుకు ఈ వ్యాసం చదవండి.

ఇశ్రాయేలీయులు, ఐగుప్తులో ఎంతకాలం బానిసలుగా, నివసించారు? 430/400/215?

అదేవిధంగా ఇస్సాకుకు ఇష్మాయేలు నుండి సంభవించిన ఈ శ్రమ విశ్వాసులకు లోకంనుండి సంభవిస్తున్న శ్రమకు సూచనగా ఉంది (గలతీ 4:29). కాబట్టి విశ్వాసులమైన మనం వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు లోకం నుండి‌ సంభవించే శ్రమలన్నీ ఇస్సాకులా మనం వాగ్దానపుత్రులం అనేందుకు రుజువుగా ఉన్నాయని గుర్తించి ఆ శ్రమల్లో కూడా దేవుని యందు ఆనందించడం‌ నేర్చుకోవాలి (1 పేతురు 4: 16, యోహాను 15:19, 16: 33).

ఆదికాండము 21:10-11 ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము‌. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడైయుండడని అబ్రాహాముతో అనెను. అతని కుమారునిబట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను.

ఈ వచనాలలో శారా ఇష్మాయేలు చేసినపనికి అతడినీ అతని తల్లినీ వెళ్ళగొట్టమని అబ్రాహామును ప్రేరేపించడం మనం చూస్తాం. ఈ మాటలను ఆమె ఇస్సాకు విషయంలోని వాగ్దాన నెరవేర్పుకై దేవుని ప్రేరణతోనే పలికింది. అందుకే పౌలు వాటిని లేఖనం చెబుతున్నట్టుగా ప్రస్తావించాడు (గలతీ 4:30).

అదేవిధంగా ఇక్కడ శారా పలికిన మాటలను‌ బట్టి అబ్రాహాము చాలా దుఃఖపడినట్టు మనం చూస్తాం. అది అతనిలోని తండ్రి ప్రేమను మనకు తెలియచేస్తుంది. అయితే ఇలాంటి దుఃఖం కలగడానికి అబ్రాహాము స్వతహాగా తీసుకున్న నిర్ణయమే కారణం.‌ అతను‌‌ గతంలో శారా మాటను బట్టి హాగరును వివాహం చేసుకోవడం వల్లే ఇష్మాయేలు జన్మించాడు. కాబట్టి దేవునికి వేరుగా మనం తీసుకునే నిర్ణయాలు మనకు భవిష్యత్తులో దుఃఖం కలిగించే అవకాశం‌ ఉంది కాబట్టి, మనం తీసుకునే ప్రతీ నిర్ణయం సరైనదో కాదో దేవుని వాక్య ఆధారంగా పరిశీలించుకోవాలి.

ఆదికాండము 21:12 అయితే దేవుడు ఈ చిన్న వానిబట్టియు నీ దాసినిబట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకువలన అయినదియే నీ సంతానమనబడును.

ఈ వచనంలో దేవుడు; ఇష్మాయేలును బట్టి దుఃఖపడుతున్న అబ్రాహాముతో శారా చెప్పినట్టుగా చెయ్యమనడం మనం చూస్తాం. ఇక్కడ దేవుడు తన వాగ్దానాన్ని బట్టి న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం ప్రకారం ఇస్సాకు మాత్రమే అబ్రాహాము సంతానం. కనాను దేశానికి అతను మాత్రమే హక్కుదారుడు కాబట్టి ఇష్మాయేలు ఆ దేశంలో నివసించకూడదు. అలాగని ఆయన ఇష్మాయేలుకు అన్యాయం చెయ్యడం‌ లేదు, ఆ విషయాన్ని మనం క్రింది వచనంలో చూస్తాం.

ఆదికాండము 21:13 అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను.

ఈ వచనంలో దేవుడు ఇష్మాయేలు కూడా అబ్రాహాముకు పుట్టినవాడే కాబట్టి అతనిని కూడా దీవిస్తున్నట్టు మనం చూస్తాం. ఇష్మాయేలు అబ్రాహాముకు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి శారీరకంగా జన్మించాడు. కానీ ఇస్సాకు పుట్టుకలో అబ్రాహాము శారీరక ప్రమేయంతో పాటు దేవుని వాగ్దానం కూడా ఉంది. ఆవిధంగా ఇష్మాయేలూ ఇస్సాకు ఇద్దరూ అబ్రాహాము సంతానమే అయినా వీరిద్దరి పుట్టుకలో ఉన్న ఈ తారతమ్యాన్ని మనం గుర్తించాలి.

అదేవిధంగా ఇక్కడ దేవుడు వాగ్దానం చేసినట్టే ఇష్మాయేలును గొప్పజనంగా చేసాడు (ఆదికాండము 25:12-16). ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా విస్తరించిన అరబ్బులు ఈ ఇష్మాయేలు సంతానమే. వీరినుండే మహమ్మద్ కాలంలో ఇస్లాం మతం ప్రారంభమైంది.

ఆదికాండము 21:14-16 కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవానితో కూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొదక్రింద ఆ చిన్నవాని పడవేసి యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటి వేతదూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను.

ఈ వచనాలలో అబ్రాహాము హాగరునూ ఆమె కుమారుడినీ తన ఇంటినుండి పంపివెయ్యడం, తర్వాత ఆ పిల్లవాడు అరణ్యంలో నీరులేక సొమ్మసిల్లినప్పుడు, ఆమె అతని చావు చూడలేక యెలుగెత్తి ఏడ్వడం మనం చూస్తాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మనం గమనించాలి. శారామాటలను బట్టి అబ్రహాము బాధపడుతున్నప్పుడు దేవుడు ఆ రాత్రే అతనితో మాట్లాడి శారా చెప్పినట్టు చెయ్యమన్నాడు. అబ్రహాము ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తెల్లవారగానే ఆ పని చేస్తున్నాడు. కొద్దిరోజులైనా ఆ పిల్లాడిని తనతో ఉంచుకుందామని ఆలోచించట్లేదు. దీనిని బట్టి అబ్రహాము దేవుని ఆజ్ఞకు ఎంత వేగవంతంగా లోబడుతున్నాడో అర్థమౌతుంది. అది అతనికి బాధను కలిగించేదైనా సరే ఏమాత్రం ఆలస్యం చెయ్యట్లేదు. దేవుని పిల్లలు దేవుని ఆజ్ఞల విషయంలో ఇలాంటి వైఖరినే కలిగుండాలి.

అదేవిధంగా అబ్రాహాము వారిని పంపివేసేటప్పుడు వారు చేరుకోవలసిన ప్రదేశానికి చాలినంత ఆహారం, నీళ్ళు ఇచ్చే పంపాడు. కానీ వారు బెయేర్షెబా అరణ్యంలో దారితప్పి అటూ ఇటూ తిరగడం వల్ల వారికి అబ్రాహాము ఇచ్చిన ఆహారం నీరు అయిపోయింది. అందుకే ఆ పిల్లవాడు సొమ్మసిల్లాడు.

ఇక ఈ సంఘటనపై ఇస్లాం దావా ప్రచారకులు స్పందిస్తూ అసలు అబ్రాహాము తన ఇంటి నుండి పంపివేసింది ఇష్మాయేలును కాదని వాదిస్తుంటారు. ఎందుకంటే కురాన్ లో మహమ్మద్ కల్పించినదాని ప్రకారం ఇస్సాకు కంటే ఇష్మాయేలుకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, దానికి కారణం మహమ్మద్ ఇష్మాయేలు సంతతైన అరబీయుడు కావడమే. కాబట్టి ఇస్లాం దావా ప్రచారకులు అబ్రాహాము తన ఇంటినుండి పంపివేసింది ఇష్మాయేలును కాదని చెప్పడానికి లేఖనాలనుండే కొన్ని మాటలను ఉదహరించి, వాటిని వక్రీకరించి తమ వాదనను రుజువు చేసుకుంటుంటారు. అదెలాగో చూద్దాం.

అబ్రాహాముకు ఇష్మాయేలు జన్మించేసరికి అతను వయస్సు 86 సంవత్సరాలు (ఆదికాండము 16:16). ఇస్సాకు జన్మించేసరికి అబ్రాహాము వయస్సు 100 సంవత్సరాలు (ఆదికాండము 21:5). దీనిప్రకారం అబ్రాహాముకు వందవ యేట ఇస్సాకు జన్మించేసరికి ఇష్మాయేలు వయసు 14 సంవత్సరాలు. మనం ప్రారంభంలో చూసినట్టుగా హెబ్రీయులు తమ పిల్లవాడికి ఐదవ యేట‌ పాలు మానిపించి విందు చేస్తారు కాబట్టి, ఇస్సాకు పాలు విడిచిన విందు సమయానికి ఇష్మాయేలు వయస్సు 19 సంవత్సరాలు. దీనితర్వాతే అబ్రాహాము ఇష్మాయేలును వెళ్ళగొట్టాడు.

అయితే ఆ సందర్భంలో అబ్రాహాము ఆహారం నీళ్ళతిత్తితో పాటు ఇష్మాయేలును కూడా హాగరుకు అప్పగించి, వాటిని ఆమె భుజంపై పెట్టినట్టు రాయబడింది. దీని ఆధారంగానే ఇస్లాం దావా ప్రచారకులు 19 సంవత్సరాల పిల్లాడిని అబ్రాహాము హాగరు చేతికి ఎందుకు అప్పగించాడు? ఆమె భుజంపై ఎలా పెట్టాడు? పైగా అంత యవ్వనస్తుడు తన తల్లికంటే ముందుగా అరణ్యంలో ఎలా సొమ్మసిల్లాడు? 18వ వచనంలో యెహోవా దూత ఆ పిల్లవాడిని లేవనెత్తమని ఎందుకు చెబుతున్నాడు? ఇవన్నీ చిన్నపిల్లాడి వర్తించేలా ఉన్నాయి కాబట్టి, వాస్తవానికి అబ్రాహాము తన‌ ఇంటినుండి పంపివేసింది ఇష్మాయేలును కాదని, చిన్నపిల్లాడైన ఇస్సాకునని, యూదులు ఇష్మాయేలుకు ఘనత దక్కనివ్వకుండా ఈ మార్పులు చేసారని ప్రజలను మభ్యపెడుతుంటారు.

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కొందరు క్రైస్తవబోధకులు‌ కూడా అబ్రాహాము తన ఇంటినుండి‌‌ పంపివేసింది ఇష్మాయేలును కాదని అతనికీ‌ హాగరుకూ పుట్టిన మరో చిన్న కుమారుడినని చెబుతుంటారు.

అయితే ఈ వాదన అంత సమంజసంగా ఉండదు. ఎందుకంటే అబ్రాహాము హాగరులకు ఇష్మాయేలు కాకుండా వేరే కుమారుడు ఉన్నట్టు లేఖన ఆధారం లేదు, అబ్రాహాము వంశావళిలో కూడా ఆవిధంగా మనం చూడలేము (1 దినవృత్తాంతములు 1:26-34). ప్రాముఖ్యంగా‌ వాగ్దానపుత్రుడైన ఇస్సాకుతో ఎవ్వరూ సమ వారసులుగా ఉండకూడదు కాబట్టే దేవుడు, మరియు శారాలు ఇష్మాయేలును అక్కడినుండి వెళ్ళగొట్టమన్నారు (ఆదికాండము 21:10-12, గలతీ 4:30). అబ్రాహాము ఇష్మాయేలును కాకుండా వేరే కుమారుడిని వెళ్ళగొట్టియుంటే ఈమాటలను‌ ఎలా అర్థం చేసుకోవాలి? ఇష్మాయేలు అబ్రాహాము దగ్గరే ఉండి, ఇస్సాకుతో పాటు వారసుడుగా ఉన్నాడనా? అలాగైతే అబ్రాహాము తనకు తర్వాత పుట్టిన పిల్లలను మాత్రం ఇస్సాకు యెదుటనుండి‌ ఎందుకు పంపివేసినట్టు? (ఆదికాండము 25:6). కాబట్టి దావా ప్రచారకుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కొందరు‌ బోధకులు చేస్తున్న ఈ వాదన లేఖనసత్యానికి చాలా దూరంగా ఉంటుంది.

అయితే వీరు కీర్తనలు 83:6 లో ఇష్మాయేలీయులతో పాటుగా మనకు కనిపించే హగ్రీయీలును హాగరు రెండవ కుమారుడి సంతానంగా చెబుతుంటారు. కానీ హగ్రీయీలులు అనగానే హాగరు సంతానమని భావించడానికి లేఖనంలో ఎలాంటి ఆధారం‌ లేదు. పేర్లు కాస్త దగ్గరగా ఉన్నంతమాత్రాన అలా కలిపెయ్యడం హాస్యాస్పదంగా ఉంటుంది. ఒకవేళ హాగరుకు రెండవ కుమారుడు కూడా ఉండి, అతని నుండి హగ్రీయీలులు అనే జాతి విస్తరించినప్పటికీ ఆ కుమారుడు అబ్రాహాముకు పుట్టినవాడు మాత్రం కాదు. ఎందుకంటే అబ్రాహాము వంశావళిలో అబ్రాహాముకు పుట్టిన పిల్లలందరి వంశావళినీ మనం చూస్తాం, కాబట్టి ఆ కుమారుడు హాగరు‌ వెళ్ళగొట్టబడిన తర్వాత వేరే పురుషుడి ద్వారా జన్మించాడేమో?. కాబట్టి ఏవిధంగా చూసినా అబ్రాహాము పంపివేసింది ఇష్మాయేలును కాదు వేరే కుమారుడిని అని చెప్పే అవకాశం లేదు.

ఇక ఇస్లాం దావా ప్రచారకుల ప్రశ్నల దగ్గరకు వస్తే అబ్రాహాము వాటిని హాగరు భుజంపై పెట్టాడు అన్నప్పుడు ఆహారం నీళ్ళతిత్తి గురించి రాయబడిందే తప్ప, ఇష్మాయేలు గురించి కాదు. మనం‌ కూడా కొన్నిసార్లు ఇలాంటి బాషను‌ ఉపయోగిస్తుంటాం. ఒకవేళ ఎవరైనా అక్కడ కలిపి వాడిన ఆ పదాన్ని బట్టి ఆహారం, నీళ్ళతిత్తితో పాటు ఇష్మాయేలును కూడా హాగరు భుజంపైనే పెట్టాడంటే ఒకే భుజంపై పిల్లవాడితో పాటు ఆహారం నీళ్ళ తిత్తిని కూడా ఎలా పెట్టాడో హాగరు ఆ మూడింటినీ ఒకే భుజంపై ఎలా మోసిందో చెప్పాలి మరి. అప్పటి నీళ్ళతిత్తులేమీ మనం ఉపయోగించే ప్లేస్టిక్ బాటిల్స్ అంత చిన్నవిగానే ఉండవు, దూరప్రయాణం చేసేవారు ఎక్కువ నీటిని తీసుకుని వెళ్ళేలా అవి పెద్ద పరిమాణంలోనే ఉంటాయి.

కాబట్టి అక్కడ అబ్రాహాము ఆహారం నీళ్ళతిత్తిని హాగరు భుజంపై పెట్టాడు, ఇష్మాయేలును ఆమెకు (ఆమె చేతికి) అప్పగించాడు. అక్కడ 19 సంవత్సరాల ఇష్మాయేలును కూడా అబ్రాహాము హాగరుకు ఎందుకు అప్పగిస్తున్నాడంటే ఆ పిల్లవాడికి కూడా తన తండ్రిపై ప్రేమ ఉంటుంది. ఈ కారణం చేత అతను అబ్రాహామును విడిచి వెళ్ళడానికి ఒప్పుకోడు, అందుకే అబ్రాహాము అతడిని బలవంతంగా తల్లికి అప్పగించాడు. ఇలాంటి సంఘటనలు మనం కూడా చూస్తుంటాం.

ఇక ఆ అరణ్యంలో నీరు అయిపోయినప్పుడు హాగరు బానే ఉన్నప్పటికీ 19 సంవత్సరాల ఇష్మాయేలు ఎందుకు సొమ్మసిల్లాడంటే ఈ హాగరు అనే స్త్రీ గతంలో ఐగుప్తుదేశంలో దాసిగా జీవించింది (ఆదికాండము 16:1). ఈకారణం చేత ఆమెకు అరణ్యంలో/ఎడారిలో సంచరించే అనుభవం తప్పకుండా ఉంటుంది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కూడా శారా శ్రమపెడితే అరణ్యంలోకే పారిపోయింది. కానీ ఇష్మాయేలు తాను పుట్టినప్పటినుంచి అబ్రాహాముతో ఉంటున్నాడు కాబట్టి అతనికి అరణ్యంలో సంచరించే అనుభవం లేదు. ఈ కారణం చేత అతను నీరు అయిపోయినప్పుడు ఎండను తట్టుకోలేక సొమ్మసిల్లాడు. మనం కూడా క్రొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణానికి తట్టుకోలేకపోవడం సహజం‌ కదా!. నాకు కూడా ఇలాంటి అనుభవం ఉంది.

ఆవిధంగా సొమ్మసిల్లిన కుమారుడినే హాగరు తన శక్తినంతా కూడగట్టుకుని, పొదక్రిందకు చేర్చి ఏడ్వడం ప్రారంభించింది. మనం మనకంటే బలవంతులైన యవ్వనస్తులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారిని‌ మనకున్న శక్తినంతటినీ ఉపయోగించి ఒకచోట పడుకోబెట్టడమో నడిపించడమో చెయ్యమా? దానికి వయస్సుతో సంబంధం లేదు. ఇక 18వ వచనంలో దేవుని దూత ఆ చిన్నవాడిని లేవనెత్తి చేతితో పట్టుకో అన్నప్పుడు కూడా అది శక్తీహీనుడైన నీ కుమారుడిని పట్టుకుని నడిపించు అనే భావంలో చెప్పబడిన మాటే తప్ప ఎత్తుకుని భుజాన వేసుకోమని కాదు. అలా వేసుకున్నట్టు రాయబడనూ లేదు.

ప్రాముఖ్యంగా ఈ సందర్భమంతటిలో ఇష్మాయేలు గురించి చిన్నవాడు, పిల్లవాడు అనే సంబోధన మనకు కనిపిస్తుంది. కానీ హెబ్రీబాషలో ఆ పదాలను పరిశీలిస్తే అక్కడ "ילד" (యెలెద్) అనే పదం ఉపయోగించబడింది. ఈ పదాన్ని యవ్వనస్తులకు కూడా ఉపయోగిస్తారు ఉదాహరణకు ఈ సందర్భం చూడండి.

ఆదికాండము 4:23 లెమెకు తన భార్యలతో ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి నన్ను గాయపరచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక "పడుచువాని" చంపితిని.

ఈ సందర్భంలో లెమెకు ఒక పడుచువాడిని చంపాను అన్నప్పుడు "ילד" (యెలెద్) అనేపదమే వాడబడింది, ఆ పడుచువాడు లెమెకును గాయపరిచాడు అంటే తప్పకుండా అతను పిల్లవాడు కాదు, యవ్వనస్తుడే (పడుచువాడు). కాబట్టి ఇష్మాయేలు కూడా చిన్నవాడు, పిల్లవాడు అని సాధారణంగా సంబోధించబడినప్పటికీ అతను 19 సంవత్సరాల యవ్వనస్థుడు అనడంలో హీబ్రూ బాషపరంగా మనకు కచ్చితమైన ఆధారం ఉంది. ఆ కాలంలో యవ్వనస్థులను కూడా చిన్నవారు అని సంబోధించడం సాధారణం.

చివరిగా కొందరు అబ్రాహాము చనిపోయినప్పుడు ఇస్సాకుతో ఇష్మాయేలు కూడా ఉన్న సందర్భాన్ని చూపించి (ఆదికాండము 25:8,9) దానిప్రకారం ఇష్మాయేలు ఎక్కడికీ వెళ్ళలేదని, ఇస్సాకుతో పాటు అబ్రాహాము దగ్గరే ఉన్నాడని వాదిస్తుంటారు. కానీ అబ్రాహాము ఇష్మాయేలును హాగరుతో పాటు వెళ్ళగొట్టాడని, అతను వేరేచోట నివాసం ఏర్పరచుకున్నాడని ఇప్పటికే మనం చూసాం. ఇష్మాయేలు అబ్రాహాము దగ్గరనుండి వెళ్ళగొట్టబడినప్పటికీ అతను కూడా అబ్రాహాము కుమారుడే కాబట్టి తన తండ్రి చనిపోయాడనే వార్త విన్నప్పుడు అక్కడికి వస్తాడు. ఇస్సాకు అతనిని రమ్మని కబురుచేస్తాడు. ఎందుకంటే తర్వాత కాలంలో కూడా ఇస్సాకు కుటుంబానికీ ఇష్మాయేలు కుటుంబానికీ మధ్య మంచి సంప్రదింపులు ఉన్నట్టు మనం చూస్తాం. అందుకే ఇస్సాకు పెద్దకుమారుడైన ఏశావు ఈ ఇష్మాయేలు కుమార్తెను వివాహం కూడా చేసుకున్నాడు (ఆదికాండము 28:9). కాబట్టి అబ్రాహామును సమాధి‌ చేసే సమయంలో ఇష్మాయేలు కూడా ఉన్నంతమాత్రాన అతను తన తండ్రితోనే ఉన్నాడని చెప్పడం సాధ్యపడదు.

ఆదికాండము 21:17,18 దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశమునుండి హాగరును పిలిచిహాగరూ నీకేమివచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని యున్నాడు నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.

ఈ వచనాలలో ఇష్మాయేలు మొరను విన్న దేవుని దూత హాగరుతో మాట్లాడి ఆమెను ధైర్యపరచడం మనం చూస్తాం. అతను అలా దేవునికి మొరపెట్టడానికి అబ్రాహాము పెంపకమే కారణం (ఆదికాండము 18:19). కాబట్టి మనం కూడా మన పిల్లలు తమ కష్టసమయంలో దేవుడు వినేలా మొర్రపెట్టడాన్ని నేర్పించాలి. ఆయన గుణలక్షణాలను వారికి పదేపదే ప్రకటిస్తూ వారిని ఆయన విధులచొప్పున నడిపిస్తున్నప్పుడే అది సాధ్యం. అందుకే "నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.
నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను" (ద్వితీయోపదేశకాండము 6:6,7) అని ఆజ్ఞాపించబడింది.

అలానే ఇక్కడ మాట్లాడుతున్న దేవునిదూత గతంలో ఆమెతో మాట్లాడిన యెహోవా దూత ఒకరే (ఆదికాండము 16:6-13). ఈ దూత గురించి వివరంగా తెలుసుకునేందుకు ఈ వ్యాసం చదవండి.

యెహోవా దూత యేసుక్రీస్తు

ఆదికాండము 21:19-21 మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను.

ఈ వచనాలలో దేవుడు సొమ్మసిల్లిన ఆ చిన్నవాడిని బ్రతికించి అతనికి తోడైయున్నట్టు, హాగరు అతనికి వివాహం కూడా చేసినట్టు మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఇష్మాయేలుకు ఎలాంటి అన్యాయం జరగనివ్వలేదు. అబ్రాహామును బట్టి అతనిపై కనికరం చూపి, గొప్ప జనంగా విస్తరింపచేసాడు.

ఆదికాండము 21:22-24 ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడి నీవు చేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక. నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక, నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివైయున్న యీ దేశమునకు చేసెదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను. అందుకు అబ్రాహాము ప్రమాణము చేసెదననెను.

ఈ వచనాలలో గెరారు రాజైన అబీమెలెకు అబ్రాహాముకు దేవుడు తోడైయున్నదానిని బట్టి భవిష్యత్తులో అతనికీ తన రాజ్యానికీ ఎలాంటి విరోధం కలగకుండా సమాధాన నిబంధన చేసుకోవడానికి వచ్చినట్టు మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు తోడైయున్నవారితో విరోధం‌ కలిగితే అది తనకే నష్టమని అతను గ్రహించాడు. ఈ అబీమెలెకు గతంలో అబ్రాహాము తన భార్యయైన శారాను తన చెల్లెలని చెప్పినందువల్ల ఆమెపై ఆశపడి తన ఇంటచేర్చుకున్నాడు, తర్వాత దేవుని గద్దింపు మేరకు శారాను విడిచిపెట్టి వారిద్దరినీ తన రాజ్యంలో నివసించడానికి అంగీకరించాడు (ఆదికాండము 20వ అధ్యాయము).

ఆదికాండము 21:25,26 అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసికొనిన నీళ్ల బావివిషయమై అబ్రాహాము అబీమెలెకును ఆక్షేపింపగా అబీమెలెకుఈ పని యెవరు చేసిరో నేనెరుగను. నీవును నాతో చెప్పలేదు; నేను నేడే గాని యీ సంగతి వినలేదని చెప్పగా-

ఈ వచనాలలో తనతో నిబంధన చేసుకోవడానికి వచ్చిన అబీమెలెకుతో అబ్రాహాము సమ్మతించి, దానికంటే ముందు అతని దాసులు తనకు చేసిన అన్యాయం గురించి ప్రస్తావించడం మనం చూస్తాం.‌ కాబట్టి‌ మనం కూడా మనతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నవారితో వారివల్ల మనకు కలిగిన/కలుగుతున్న సమస్యలేంటో తెలియచెయ్యాలి. అప్పుడే ఆ సమస్యలు వారి ఉద్దేశపూర్వకంగా/అనుమతితోనే‌ కలుగుతున్నాయో/కలిగాయో లేక వారికి కూడా ఆ విషయం తెలియదో (పొరపాటున జరిగిందో) మనకు అర్థమౌతుంది. ఇక్కడ అబీమెలెకు మాటల్లో మనం అదే గమనిస్తాం.

మనవల్ల వారికి కలుగుతున్న కష్టసుఖాలను దాచుకోకుండా వివరించగలిగే మరియు తమవల్ల మనకు కష్టం‌ కలిగిందని తెలుసుకున్నప్పుడు దానిని సరిచేసుకునే మనస్తత్వం కలిగినవారితో సంబంధాలు ఎప్పటికీ స్థిరంగా కొనసాగుతాయి.  ఈ లక్షణాలు లేనివారితో మనమెంత సమాధానంగా ఉండడానికి ప్రయత్నించినా అది ఎంతోకాలం నిలువదు. ఈ విషయంలో విశ్వాసులైన ప్రతీ ఒక్కరూ స్వపరీక్ష చేసుకోవాలి.

ఆదికాండము 21:27-32 అబ్రాహాము గొఱ్ఱెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసికొనిరి. తరువాత అబ్రాహాము తన గొఱ్ఱెల మందలో నుండి యేడు పెంటిపిల్లలను వేరుగా నుంచెను గనుక అబీమెలెకు అబ్రాహాముతోనీవు వేరుగా ఉంచిన యీ యేడు గొఱ్ఱెపిల్లలు ఎందుకని యడిగెను. అందు కతడు నేనే యీ బావిని త్రవ్వించినందుకు నా సాక్ష్యార్థముగా ఈ యేడు గొఱ్ఱె పిల్లలను నీవు నాచేత పుచ్చుకొనవలెనని చెప్పెను. అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణము చేసికొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబాలో వారు ఆలాగు ఒక నిబంధన చేసికొనిన తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతియైన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్లెను.

ఈ వచనాలలో అబ్రాహాము అబీమెలెకులు సమాధాన నిబంధన చేసుకోవడం మనం చూస్తాం, ఆ కాలంలో నిబంధన చేసుకునే ఇద్దరూ దానికి సాక్ష్యంగా ఇలాంటి కానుకలు తీసుకోవడం ఆనవాయితీగా ఉండేది. అదేవిధంగా ఆ ప్రమాణం చేసుకునే క్రమంలో అబ్రాహాము చాలా వివేకంగా ప్రవర్తిస్తున్నాడు అందుకే ఆ బావి విషయంలో ఏడు పెంటి పిల్లలను వేరుగా ఉంచుతున్నాడు. కాబట్టి మనం కూడా సాధ్యమైనంతవరకూ సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండాలి (రోమా 12:18) అలానే ఆ క్రమంలో మనకు నష్టం కలుగకుండా అవసరమైన జాగ్రతలు తీసుకోవాలి.

ఆదికాండము 21:33,34 అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమునాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థనచేసెను. అబ్రాహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను.

ఈ వచనాలలో అబ్రాహాము పిచుల వృక్షం నాటి దేవునికి ప్రార్థన చేస్తున్నట్టు, అతను పిలిష్తీయుల దేశంలో చాలాకాలం జీవించినట్టు మనం చూస్తాం. అబ్రాహాము దేవుని ఆజ్ఞను బట్టి కనాను దేశమంతటా సంచరిస్తున్నాడు కాబట్టి, తాను ప్రార్థన చేసిన ప్రదేశాన్ని గుర్తుపెట్టుకునే విధంగా/సాక్ష్యంగా ఆ వృక్షాన్ని నాటాడు. అదేవిధంగా ఇక్కడ మనకు నిత్య దేవుడు అనేపదం కనిపిస్తుంది. నిత్యుడు అంటే శాశ్వతమైనవాడు, ఆది అంతం లేనివాడు అని అర్థం. ఈవిధంగా మన దేవుడు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా త్రిత్వమైయున్న దేవుడు నిత్యుడని లేఖనాలు అనేక సందర్భాలలో మనకు సాక్ష్యమిస్తున్నాయి (యెషయా 9:6, 40: 28, హెబ్రీ 9:14). ఈ విషయం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మన తెలుగులో కూడా కొన్ని అవాంతర శాఖలు బయల్దేరి యేసుక్రీస్తు నిత్యుడు కాడని, పరలోకంలో‌ ముందుగా సృష్టించబడినవాడని బోధిస్తున్నారు. దానిగురించి వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

యేసుక్రీస్తు నిత్యుడు కాడా? పరలోకంలో పుట్టినవాడా?