మరియు ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోనను హెష్బోను రాజునొద్దకు దూతలను పంపినీ దేశముగుండ మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతనియొద్ద మనవిచేయగా
సంఖ్యాకాండము 21:21-35
21

ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి మమ్మును నీ దేశములో బడి వెళ్లనిమ్ము.

22

మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము; బావుల నీళ్లు త్రాగము; మేము నీ పొలిమేరలను దాటువరకు రాజమార్గములోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి.

23

అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్యలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను.

24

ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతముచేసి, వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకువరకు, అనగా అమ్మోనీయుల దేశమువరకు స్వాధీనపరచుకొనిరి. అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది.

25

అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటిని పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణములన్నిటిలోను హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోను దిగిరి.

26

హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము; అతడు అంతకుమునుపు మోయాబు రాజుతో యుద్ధముచేసి అర్నోనువరకు వాని దేశమంతయు పట్టుకొనెను.

27

కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సీహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను

28

హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను.

29

మోయాబూ, నీకు శ్రమ కెమోషు జనులారా, మీరు నశించితిరి తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయులరాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను.

30

వాటిమీద గురిపెట్టి కొట్టితివిు దీబోనువరకు హెష్బోను నశించెను నోఫహువరకు దాని పాడు చేసితివిు. అగ్నివలన మేదెబావరకు పాడుచేసితివిు.

31

అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి.

32

మరియు యాజెరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుష్యులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసికొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి.

33

వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా

34

యెహోవా మోషేతో నిట్లనెను అతనికి భయపడకుము; నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని; నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు.

35

కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండ అతని సమస్త జనమును హతముచేసి అతని దేశమును స్వాధీనపరచుకొనిరి.

ద్వితీయోపదేశకాండమ 2:26-34
26

అప్పుడు నేను కెదేమోతు అరణ్యములోనుండి హెష్బోను రాజైన సీహోనునొద్దకు దూతలను పంపి

27

నన్ను నీ దేశముగుండ దాటిపోనిమ్ము, కుడియెడమలకు తిరుగక త్రోవనే నడిచిపోవుదును.

28

నాయొద్ద రూకలు తీసికొని తినుటకు భోజనపదార్థములు నా కిమ్ము; నాయొద్ద రూకలు తీసికొని త్రాగుటకు నీళ్లిమ్ము.

29

శేయీరులో నివసించు ఏశావు సంతానపువారును ఆరులో నివసించు మోయాబీయులును నాకు చేసినట్లు, మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యొర్దాను దాటువరకు కాలి నడకచేతనే నన్ను వెళ్లనిమ్మని సమాధానపు మాటలు పలికించితిని.

30

అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశమార్గమున వెళ్లనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను.

31

అప్పుడు యెహోవా చూడుము; సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలు పెట్టియున్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాని స్వాధీనపరచుకొన మొదలు పెట్టుమని నాతో చెప్పెను.

32

సీహోనును అతని సమస్త జనమును యాహసులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా

33

మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి

34

ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని, ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియులేకుండ నాశనము చేసితివిు.

ద్వితీయోపదేశకాండమ 3:1-17
1

మనము తిరిగి బాషాను మార్గమున వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరును ఎద్రెయీలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి యెదురుగా రాగా

2

యెహోవా నాతో ఇట్లనెను అతనికి భయపడకుము, అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించియున్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలెనని చెప్పెను.

3

అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మనచేతికి అప్పగించెను; అతనికి శేషమేమియు లేకుండ అతనిని హతము చేసితివిు.

4

ఆ కాలమున అతని పురములన్నిటిని పట్టుకొంటిమి. వారి పురములలో మనము పట్టుకొనని పురమొకటియు లేదు. బాషానులో ఓగురాజ్యమగు అర్గోబు ప్రదేశమందంతటనున్న అరువది పురములను పట్టుకొంటిమి.

5

ఆ పురములన్నియు గొప్ప ప్రాకారములు గవునులు గడియలునుగల దుర్గములు. అవియు గాక ప్రాకారములేని పురములనేకములను పట్టుకొంటిమి.

6

మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితివిు; ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితివిు;

7

వారి పశువులనన్నిటిని ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసికొంటిమి.

8

ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండవరకు యొర్దాను అవతలనున్న దేశమును అమోరీయుల యిద్దరు రాజులయొద్దనుండి పట్టుకొంటిమి.

9

సీదోనీయులు హెర్మోనును షిర్యోనని అందురు. అమోరీయులు దానిని శెనీరని అందురు.

10

మైదానమందలి పురములన్నిటిని బాషానునందలి ఓగు రాజ్యపురములైన సల్కా ఎద్రెయీ అనువాటివరకు గిలాదంతటిని బాషానును పట్టుకొంటిమి.

11

రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది గదా? దాని పొడుగు మనుష్యుని మూరతో తొమి్మది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు.

12

అర్నోను లోయలోనున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్నెములో సగమును, మనము అప్పుడు స్వాధీనపరచుకొనిన దేశమును, దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని.

13

ఓగు రాజు దేశమైన బాషాను యావత్తును గిలాదులో మిగిలిన దానిని, అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంతటిని మనష్షే అర్ధగోత్రమున కిచ్చితిని.

14

మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయులయొక్కయు మాయాకాతీయు యొక్కయు సరిహద్దులవరకు అర్గోబు ప్రదేశమంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటివరకు ఆ పేర్లు వాటికున్నవి.

15

మాకీరీయులకు గిలాదు నిచ్చితిని.

16

గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్యవరకును, యబ్బోకు నదివరకును అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకును

17

కిన్నెరెతు మొదలుకొని తూర్పుదిక్కున పిస్గా కొండ చరియల దిగువగా, ఉప్పు సముద్రము అనబడివ అరాబా సముద్రమువరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్యభూమిని రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని.

యెహొషువ 13:8-12
8

రూబేనీయులు గాదీయులు తూర్పుదిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి.

9

అది ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయమధ్యనున్న పట్టణమునుండి దీబోను వరకు మేదెబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు

10

అమోరీయుల రాజునైన సీహోనుయొక్క సమస్తపురములును

11

గిలాదును, గెషూరీయులయొక్కయు మాయకాతీయులయొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కావరకు బాషాను దేశమంతయు

12

రెఫాయీయుల శేషములో అష్తారోతులోను ఎద్రెయీలోను ఏలికయైన ఓగురాజ్యమంతయు మిగిలియున్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను.