గిబి యోను
యెహొషువ 9:17

ఇశ్రాయేలీయులు సాగి మూడవనాడు వారి పట్టణములకు వచ్చిరి; వారి పట్టణములు గిబియోను కెఫీరా బెయేరోతు కిర్యత్యారీము అనునవి.

యెహొషువ 10:2

ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది; అది హాయికంటె గొప్పది, అక్కడి జనులందరు శూరులు. అంతట యెరూషలేము రాజైన అదోనీసెదెకు గిబియోనీయులు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను సంధిచేసియున్నారు. మీరు నాయొద్దకు వచ్చి నాకు సహాయము చేసినయెడల మనము వారి పట్టణమును నాశనము చేయుదమని

2 సమూయేలు 21:1

దావీదు కాలమున మూడు సంవత్సరములు విడువకుండ కరవు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను సౌలు గిబియోనీయులను హతముచేసెను గనుక అతనిని బట్టియు, నరహంతకులగు అతని యింటివారినిబట్టియు శిక్షగా ఈ కరవు కలిగెను.

2 సమూయేలు 21:2

గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించినవారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరి గాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారియందు ఆసక్తిగలవాడై వారిని హతము చేయ చూచుచుండెను.

యెరికో
యెహొషువ 6:1-27
1

ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయముచేత ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను యెరికోపట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను.

2

అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను చూడుము; నేను యెరికోను దాని రాజును పరాక్రమముగల శూరులను నీచేతికి అప్పగించుచున్నాను.

3

మీరందరు యుద్ధసన్నద్ధులై పట్టణమును ఆవరించి యొకమారు దానిచుట్టు తిరుగవలెను.

4

ఆలాగు ఆరు దినములు చేయుచు రావలెను. ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణముచుట్టు తిరుగుచుండగా ఆ యాజకులు బూరల నూదవలెను.

5

మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరలధ్వని వినునప్పుడు జనులందరు ఆర్భాటముగా కేకలు వేయవలెను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ యెదుటికి చక్కగా ఎక్కుదురు అనెను.

6

నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసమును ఎత్తికొని మోయుడి; ఏడుగురు యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని నడువవలెనని వారితో చెప్పెను.

7

మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు, యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను.

8

యెహోషువ ప్రజల కాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు, ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారివెంట నడిచెను.

9

యోధులు బూరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలను ఊదుచుండిరి.

10

మరియు యెహోషువ మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినమువరకు మీరు కేకలువేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటనుండి యే ధ్వనియు రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను.

11

అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని యొకమారు దానిచుట్టు తిరిగిన తరువాత వారు పాళెములో చొచ్చి రాత్రి పాళెములో గడిపిరి.

12

ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తికొని మోసిరి.

13

ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని, నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి, యోధులు వారికి ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడివచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలు ఊదుచు వచ్చిరి.

14

అట్లు రెండవదినమున వారొకమారు పట్టణము చుట్టు తిరిగి పాళెమునకు మరల వచ్చిరి. ఆరుదినములు వారు ఆలాగు చేయుచువచ్చిరి.

15

ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి యేడుమారులు ఆ ప్రకారముగానే పట్టణముచుట్టు తిరిగిరి; ఆ దినమున మాత్రమే వారు ఏడు మారులు పట్టణముచుట్టు తిరిగిరి

16

ఏడవమారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను కేకలువేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు.

17

ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ యింటనున్న వారందరును మాత్రమే బ్రదుకుదురు.

18

శపింపబడినదానిలో కొంచెమైనను మీరు తీసికొనిన యెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు.

19

వెండియు బంగారును ఇత్తడిపాత్రలును ఇనుపపాత్రలును యెహోవాకు ప్రతిష్ఠితములగును; వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను.

20

యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను; ప్రజలందరు తమ యెదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి.

21

వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరిని యెద్దులను గొఱ్ఱలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి.

22

అయితే యెహోషువ ఆ వేశ్యయింటికి వెళ్లి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగినవారినందరిని అక్కడనుండి తోడుకొని రండని దేశమును వేగుచూచిన యిద్దరు మనుష్యులతో చెప్పగా

23

వేగులవారైన ఆ మనుష్యులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగినవారినందరిని వెలుపలికి తోడుకొని వచ్చిరి; ఆమె యింటివారినందరిని వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాళెమువెలుపట వారిని నివసింపజేసిరి.

24

అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి; వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుపపాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారములో నుంచిరి.

25

రాహాబను వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి యుండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి యింటివారిని ఆమెకు కలిగినవారినందరిని బ్రదుకనిచ్చెను. ఆమె నేటివరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది.

26

ఆ కాలమున యెహోషువ జనులచేత శపథము చేయించి వారికీలాగు ఆజ్ఞాపించెను ఎవడు యెరికో పట్టణమును కట్టించపూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును; వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠకుమారుడు చచ్చును; దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ఠకుమారుడు చచ్చును;

27

యెహోవా యెహోషువకు తోడై యుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను.

యెహొషువ 8:1-35
1

మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను భయపడకుము, జడియకుము, యుద్ధసన్నధ్ధులైన వారినందరిని తోడుకొని హాయిమీదికి పొమ్ము. చూడుము; నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికప్పగించుచున్నాను.

2

నీవు యెరికోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసెదవు; అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటు గాండ్లనుంచుము.

3

యెహోషువయు యోధులందరును హాయిమీదికి పోవలెననియుండగా, యెహోషువ పరాక్రమముగల ముప్పదివేల శూరులను ఏర్పరచి రాత్రివేళ వారిని పంపి

4

వారి కాజ్ఞాపించినదేమనగా ఈ పట్టణమునకు పడమటివైపున మీరు దాని పట్టుకొన చూచుచు పొంచియుండవలెను పట్టణమునకు బహుదూరమునకు వెళ్లక మీరందరు సిద్ధపడియుండుడి.

5

నేనును నాతోకూడనున్న జనులందరును పట్టణమునకు సమీపించెదము, వారు మునుపటివలె మమ్మును ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారియెదుట నిలువక పారిపోదుము.

6

మునుపటివలె వీరు మనయెదుట నిలువలేక పారిపోదురని వారనుకొని, మేము పట్టణమునొద్దనుండి వారిని తొలగి రాజేయువరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చెదరు; మేము వారియెదుట నిలువక పారిపోయినప్పుడు మీరు పొంచియుండుట మాని

7

లేచి పట్టణమును పట్టుకొనుడి; మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాని నప్పగించును.

8

మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్టవలెను.

9

ఇదిగో నేను మీ కాజ్ఞాపించియున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనులమధ్య బసచేసెను.

10

ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరచి, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును జనులకుముందుగా హాయిమీదికి పోయిరి.

11

అతని యొద్దనున్న యోధులందరు పోయి సమీపించి ఆ పట్టణము నెదుటికి వచ్చి హాయికి ఉత్తరదిక్కున దిగిరి.

12

వారికిని హాయికిని మధ్యను లోయయుండగా అతడు ఇంచుమించు అయిదు వేలమంది మనుష్యులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచియుండుటకు ఉంచెను.

13

వారు ఆ జనులను, అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగమున నున్నవారిని, ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగి పోయెను.

14

హాయి రాజు దాని చూచినప్పుడు అతడును అతని జనులందరును పట్టణస్థులందరును త్వరపడి పెందలకడలేచి మైదానమునెదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని, తాము అంతకుముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధముచేయుటకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచియున్న వారు పట్టణమునకు పడమటివైపుననుండిన సంగతి అతడు తెలిసికొనలేదు.

15

యెహోషువయు ఇశ్రాయేలీయులందరును వారి యెదుట నిలువలేక ఓడిపోయినవారైనట్టు అరణ్యమార్గముతట్టు పారిపోయినప్పుడు

16

వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరు కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి.

17

ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొకడును హాయిలోనేగాని బేతేలులోనేగాని మిగిలియుండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలీయులను తరుమబోయి యుండిరి.

18

అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను నీవు చేతపట్టుకొనిన యీటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతి కప్పగింతును, అంతట యెహోషువ తన చేతనున్న యీటెను ఆ పట్టణమువైపు చాపెను.

19

అతడు తన చెయ్యి చాపగా పొంచియున్నవారు మాటులోనుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణములో చొచ్చి దాని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి.

20

హాయివారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణముయొక్క పొగ ఆకాశమున కెక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి గనుక ఈ తట్టయినను ఆ తట్టయినను పారిపోవుటకు వారికి వీలులేక పోయెను.

21

పొంచియున్నవారు పట్టణమును పట్టుకొనియుండుటయు పట్టణపు పొగ యెక్కుచుండుటయు యెహోషువయు ఇశ్రాయేలీయులందరును చూచినప్పుడు వారు తిరిగి హాయివారిని హతము చేసిరి.

22

తక్కిన వారును పట్టణములోనుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయివారు ఇశ్రాయేలీయుల నడుమ చిక్కుబడిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేసిరి. వారిలో ఒకడును మిగులలేదు; ఒకడును తప్పించుకొనలేదు.

23

వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువయొద్దకు తీసికొనివచ్చిరి.

24

బీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా, కత్తివాత కూలక మిగిలినవాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రాయేలీయులందరు హాయియొద్దకు తిరిగివచ్చి దానిని కత్తి వాతను నిర్మూలము చేసిరి.

25

ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరు పండ్రెండు వేలమంది.

26

యెహోషువ హాయి నివాసులనందరిని నిర్మూలము చేయువరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు.

27

యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాటచొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమకొరకు కొల్లగా దోచుకొనిరి.

28

అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవలెనని దాని కాల్చివేసెను; నేటి వరకు అది అట్లే యున్నది.

29

యెహోషువ హాయిరాజును సాయంకాలమువరకు మ్రానుమీద వ్రేలాడ దీసెను. ప్రొద్దు గ్రుంకుచున్నప్పుడు సెలవియ్యగా జనులు వాని శవమును మ్రానుమీదనుండి దించి ఆ పురద్వారము నెదుట దాని పడవేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేసిరి. అది నేటివరకు ఉన్నది.

30

మోషే ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన ప్రకారము

31

యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండమీద కట్టించెను. దానిమీద వారు యెహోవాకు దహనబలులను సమాధాన బలులను అర్పించిరి.

32

మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రగ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్లమీద వ్రాయించెను.

33

అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరుగవలెనని, పరదేశులేమి వారిలో పుట్టినవారేమి ఇశ్రాయేలీయులందరును వారి పెద్దలును వారి నాయకులును వారి న్యాయాధిపతులును యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగముమంది గెరిజీము కొండయెదుటను సగము మంది ఏబాలు కొండయెదుటను నిలువగా యెహోషువ

34

ఆ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటిని, అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలును పిల్లలును వారి మధ్యనుండు పరదేశులును వినుచుండగా

35

యెహోషువ సర్వసమాజము నెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాటయొక్కటియు లేదు.