రూబేనీయులును గాదీయులును మనష్షే అర్థ గోత్రపువారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే.
రూబేనీయులును గాదీయులును యెహోవాయే దేవుడనుటకు ఇది మనమధ్యను సాక్షియగునని దానికి ఏద అను పేరు పెట్టిరి.
జనులందరితో ఇట్లనెను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నియు ఈ రాతికి వినబడెను గనుక అది మనమీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన యెడల అది మీమీద సాక్షిగా ఉండును.
లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పెను. కాబట్టి దానికి గలేదను పేరుపెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పెను గనుక దానికి మిస్పా అను పేరు పెట్టబడెను.
హానిచేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి యీ స్తంభమును సాక్షి.
అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి -యింతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను.
మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను.
అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్టితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొఱ్ఱ మేకలలోను తొలిచూలు వాటిని తీసికొని రావలెను.
నేను మికాజ్ఞాపించు సమస్తమును, అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమభాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసికొని రావలెను.
నీ ధాన్యములోనేమి నీ ద్రాక్షారసములోనేమి నీ నూనెలోనేమి దశమభాగమును, నీ గోవులలోనిదేమి నీ గొఱ్ఱ మేకల మందలోని దేమి తొలిచూలు పిల్లలను నీవు మ్రొక్కుకొను మ్రొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్చార్పణమును ప్రతిష్ఠార్పణమును నీ యింట తినక
నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ యింటనుండు లేవీయులు, కలిసికొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు.
నీకు నియమింపబడిన ప్రతిష్టితములను మ్రొక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు నీవు తీసికొని పోవలెను.
నీ దహనబలులను వాటి రక్తమాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠము మీద అర్పింపవలెను. నీ బలుల రక్తమును నీ దేవుడైన యెహోవా బలిపీఠముమీద పోయవలెను; వాటి మాంసము నీవు తినవలెను.