ప్రతి
హెబ్రీయులకు 10:11

మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును.

నిర్గమకాండము 28:1-14
1

మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలోనుండి నీ యొద్దకు పిలిపింపుము.

2

అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను.

3

అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికి ఆజ్ఞ ఇమ్ము.

4

పతకము ఏఫోదు నిలువుటంగీ విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడైయుండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.

5

వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననారను తీసికొని

6

బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల ఏఫోదును పేనిన సన్ననారతోను చిత్రకారునిపనిగా చేయవలెను.

7

రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజఖండములు దానికుండవలెను; అట్లు అది సమకూర్పబడియుండును.

8

మరియు ఏఫోదు మీదనుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను.

9

మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమముచొప్పున

10

ఒక రత్నముమీద వారి పేళ్లలో ఆరును, రెండవరత్నము మీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను.

11

ముద్రమీద చెక్కబడిన వాటివలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నములమీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను.

12

అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజములమీద ఉంచవలెను అట్లు జ్ఞాపకముకొరకు అహరోను తన రెండు భుజములమీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును.

13

మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలెను;

14

సూత్రములవలె అల్లికపనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను.

నిర్గమకాండము 29:1-37
1

వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా

2

ఒక కోడెదూడను కళంకములేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసికొనుము.

3

గోధుమపిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసికొనిరావలెను.

4

మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి

5

ఆ వస్త్రములను తీసికొని చొక్కాయిని ఏఫోదు నిలువుటంగిని ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి, ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి

6

అతని తలమీద పాగాను పెట్టి ఆ పాగామీద పరిశుద్ధ కిరీటముంచి

7

అభిషేక తైలమును తీసికొని అతని తలమీద పోసి అతని నభిషేకింపవలెను.

8

మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను.

9

అహరోనుకును అతని కుమారులకును దట్టినికట్టి వారికి కుళ్లాయిలను వేయింపవలెను; నిత్యమైన కట్టడనుబట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను ఆలాగున ప్రతిష్ఠింపవలెను.

10

మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను అహరోనును అతని కుమారులును కోడె తలమీద తమ చేతుల నుంచగా

11

ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను.

12

ఆ కోడె రక్తములో కొంచెము తీసికొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ములమీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపుటడుగున పోయవలెను.

13

మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వంతటిని కాలేజముమీది వపను రెండు మూత్రగ్రంథులను వాటిమీది క్రొవ్వును నీవు తీసి బలిపీఠముమీద దహింపవలెను.

14

ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది పాపపరిహారార్థమైన బలి.

15

నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాని తీసికొనవలెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా

16

నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠముచుట్టు దాని ప్రోక్షింపవలెను.

17

అంతట నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయవములతోను తలతోను చేర్చి

18

బలిపీఠముమీద ఆ పొట్టేలంతయు దహింపవలెను; అది యెహోవాకు దహనబలి, యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.

19

మరియు నీవు రెండవ పొట్టేలును తీసికొనవలెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా

20

ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి, అహరోను కుడిచెవి కొనమీదను అతని కుమారుల కుడి చెవుల కొనమీదను, వారి కుడిచేతి బొట్టన వ్రేళ్లమీదను,వారి కుడికాలి బొట్టనవ్రేళ్లమీదను చమిరి బలిపీఠముమీద చుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.

21

మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోనుమీదను, అతని వస్త్రములమీదను, అతనితోనున్న అతని కుమారులమీదను, అతని కుమారుల వస్త్రములమీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములును అతనితోనున్న అతని కుమారులును అతని కుమారుల వస్త్రములును ప్రతిష్ఠితములగును.

22

మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును కాలేజముమీది వపను రెండు మూత్రగ్రంథులను వాటిమీది క్రొవ్వును కుడి జబ్బను

23

ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన యొక భక్ష్యమును యెహోవా యెదుటనున్న పొంగనివాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసికొని

24

అహరోను చేతులలోను అతని కుమారుల చేతులలోను వాటినన్నిటిని ఉంచి, అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.

25

తరువాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసికొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠముమీద దహింపవలెను. అది యెహోవాకు హోమము.

26

మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలునుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను; అది నీ వంతగును.

27

ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోనుదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను.

28

అది ప్రతిష్ఠార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలీయులనుండి అహరోనుకును అతని కుమారులకు నగును. అది ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలులలోనుండి తాము చేసిన ప్రతిష్ఠార్పణ, అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్ఠార్పణగా నుండును.

29

మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములును అతని తరువాత అతని కుమారులవగును; వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను.

30

అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధస్థలములో సేవచేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడు ఏడు దినములు వాటిని వేసికొనవలెను.

31

మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసికొని పరిశుద్ధస్థలములో దాని మాంసమును వండవలెను.

32

అహరోనును అతని కుమారులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారముదగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను.

33

వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటివలన ప్రాయశ్చిత్తము చేయబడెనో వాటిని వారు తినవలెను; అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు.

34

ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలో నేమి కొంచెమైనను ఉదయమువరకు మిగిలి యుండిన యెడల మిగిలినది అగ్నిచేత దహింపవలెను; అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తినవలదు.

35

నేను నీ కాజ్ఞాపించిన వాటన్నిటినిబట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. ఏడు దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను.

36

ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన దానికి పాపపరిహారార్థబలి నర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను.

37

ఏడుదినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తముచేసి దాని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతిపరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును.

లేవీయకాండము 8:2

–నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేకతైలమును పాపపరిహారార్థబలిరూపమైన కోడెను రెండు పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసికొని

నియమింపబడును
హెబ్రీయులకు 8:3

ప్రతి ప్రధానయాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైన ఉండుట అవశ్యము.

మనుష్యులనిమిత్తము
హెబ్రీయులకు 2:17

కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.

సంఖ్యాకాండము 16:46-48
46

అప్పుడు మోషే–నీవు ధూపార్తిని తీసికొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపమువేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము; కోపము యెహోవా సన్నిధినుండి బయలుదేరెను; తెగులు మొదలుపెట్టెనని అహరోనుతో చెప్పగా

47

మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసికొని సమాజముమధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి యుండెను; కాగా అతడు ధూపమువేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.

48

అతడు చచ్చినవారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను.

సంఖ్యాకాండము 18:1-3
1

యెహోవా అహరోనుతో ఇట్లనెను–నీవును నీ కుమారులును నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధస్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు; నీవును నీ కుమారులును మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు

2

మరియు నీ తండ్రి గోత్రమును, అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసికొని రావలెను; వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులును సాక్ష్యపు గుడారము ఎదుట సేవచేయవలెను

3

వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములయొద్దకైనను బలిపీఠము నొద్దకైనను సమీపింపవలదు.

అర్పణలను బలులను
హెబ్రీయులకు 8:3

ప్రతి ప్రధానయాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైన ఉండుట అవశ్యము.

హెబ్రీయులకు 9:9

ఆ గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమునుబట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి.

హెబ్రీయులకు 10:11

మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును.

హెబ్రీయులకు 11:4

విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతిమంతుడని సాక్ష్యముపొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు.

లేవీయకాండము 9:7

మరియు మోషే అహరోనుతో ఇట్లనెను–నీవు బలిపీఠమునొద్దకు వెళ్లి పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి ప్రజల కొరకు అర్పణము చేసి, యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము.

లేవీయకాండము 9:15-21
15

అతడు ప్రజల అర్పణమును తీసికొని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థబలియగు మేకను తీసికొని వధించి మొదటి దానివలె దీనిని పాపపరిహారార్థబలిగా అర్పించెను.

16

అప్పుడతడు దహనబలి పశువును తీసికొని విధి చొప్పున దాని నర్పించెను.

17

అప్పుడతడు నైవేద్యమును తెచ్చి దానిలోనుండి చేరెడు తీసి ప్రాతఃకాలమందు చేసిన దహనబలిగాక బలిపీఠముమీద తీసినదానిని దహించెను.

18

మరియు మోషే ప్రజలు అర్పించు సమాధానబలిరూపమైన కోడెదూడను పొట్టేలును వధించెను. అహరోను కుమారులు దాని రక్తమును అతనికి అప్పగింపగా అతడు బలిపీఠము చుట్టు దానిని ప్రోక్షించెను.

19

మరియు వారు ఆ దూడ క్రొవ్వును మేకక్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును మూత్ర గ్రంథులను కాలేజముమీది వపను అప్పగించిరి.

20

బోరలమీద క్రొవ్వును ఉంచిరి. అతడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహించెను.

21

బోరలను కుడి జబ్బను యెహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అహరోను అల్లాడించెను అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.