
నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమునుబట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను
నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్షతోటలను ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు
మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తుదేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి.
మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్లుచున్న దేశము కొండలు లోయలు గల దేశము.
అది ఆకాశవర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతమువరకు ఎల్లప్పుడు దానిమీద ఉండును.
కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను.
ఆ సంతతివారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి. నీవు కనానీయులను ఆ దేశవాసులను జయించి, తమకు మనస్సువచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశజనులను వారి చేతికి అప్పగించితివి.
అప్పుడు వారు ప్రాకారములుగల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని, సకలమైన పదార్థములతో నిండియున్న యిండ్లను త్రవ్విన బావులను ద్రాక్షతోటలను ఒలీవ తోటలను బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరచుకొనిరి. ఆలాగున వారు తిని తృప్తిపొంది మదించి నీ మహోపకారమునుబట్టి బహుగా సంతోషించిరి.
నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు.
దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లులచేత దానిని పదునుచేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దాని నాశీర్వదించుచున్నావు.
సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి.
అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొనియున్నవి.
పచ్చికపట్లు మందలను వస్త్రమువలె ధరించియున్నవి. లోయలు సస్యములతో కప్పబడియున్నవి అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి అన్నియు గానము చేయుచున్నవి.
వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి వారికొరకు నేను విచారించినదియు, పాలు తేనెలు ప్రవహించునదియు, సకల దేశములకు ఆభరణమైనదియునైన దేశములోనికి తోడుకొని పోయెదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసితిని.