నీ కుమారుని శిక్షించినయెడల అతడు నిన్ను సంతోషపరచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయును
తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు.
ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు.
నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము.
ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగాతినువారితోనైనను సహవాసము చేయకుము.
త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును.
ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు?ఎవరికి మంద దృష్టి?
ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా.
ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.
పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును.
విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు
నీవు నడిసముద్రమున పండుకొనువానివలెనుందువు ఓడకొయ్య చివరను పండుకొనువానివలెనుందువు.
నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరల దాని వెదకుదును అని నీవనుకొందువు.