వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసెదనని అనుకొనకుండ జాగ్రత్తగా ఉండవలెను.
తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు, ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతలపేరట తమ కూమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు గదా.
నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏవిధమైన వృక్షమును నాటకూడదు, దేవతా స్తంభమును ఏర్పరచకూడదు.
నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైన నిలువబెట్టకూడదు.
నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను.
నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములనుబట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్యపడితిని.