మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి యున్నావు.
ఆకాశమందే గాని భూమియందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు?
నేను అద్దరికి వెళ్లి యొర్దాను అవతలనున్న యీ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా
యెహోవా మిమ్మును బట్టి నామీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను చాలును; ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు.
మరియు యెహోవా మిమ్మును బట్టి నామీద కోపపడి నేను ఈ యొర్దాను దాటకూడదనియు, నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న యీ మంచి దేశములో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేసెను.
మరియు యెహోవా అతనితో ఇట్లనెను నీ సంతానమున కిచ్చెదనని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులార నిన్ను దాని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్లకూడదు.
అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొనిపోరని చెప్పెను.
నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు.
ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్లయొద్ద వారి కన్నుల యెదుట నన్ను పరిశుద్ధపరచక నామీద తిరుగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేషులోనున్న మెరీబా నీళ్లే.
మెరీబా జలములయొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను.
ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను .