
మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికిని కర్తయైయున్నను బాలుడైయున్నంతకాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు.
తండ్రిచేత నిర్ణయింపబడిన దినము వచ్చువరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహనిర్వాహకులయొక్కయు అధీనములో ఉండును.
అటువలె మనమును బాలురమై యున్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై యుంటిమి;
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి,
మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.
మరియుమీరు కుమారులై యున్నందున నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను.
కావున నా సహోదరులారా , మనము దేవునికొరకు ఫలమును ఫలించునట్లు మృతు లలోనుండి లేపబడిన క్రీస్తు అనువేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి .
ఆ లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడెను గనుక ఆ యాజకులవలన సంపూర్ణ సిద్ధికలిగినయెడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి?
ఇదియుగాక యాజకులు మార్చబడినయెడల అవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును.
ఎవనిగూర్చి యీ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోనివాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్యచేయలేదు.
మన ప్రభువు యూదా సంతానమందు జన్మించెననుట స్పష్టమే; ఆ గోత్రవిషయములో యాజకులను గూర్చి మోషే యేమియు చెప్పలేదు.
మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింపబడి,
మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది.
ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవైయున్నావు అని ఆయనవిషయమై సాక్ష్యము చెప్పబడెను.
ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్‌ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడియున్నది;
అంత కంటె శ్రేష్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను. దీనిద్వారా, దేవునియొద్దకు మనము చేరుచున్నాము.
ప్రతి ప్రధానయాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైన ఉండుట అవశ్యము.
ధర్మశాస్త్రప్రకారము అర్పణలు అర్పించువారున్నారు గనుక ఈయన భూమిమీద ఉన్నయెడల యాజకుడైయుండడు.
మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు.
ఈయనయైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేష్ఠమైన సేవకత్వము పొందియున్నాడు.
ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవదానికి అవకాశముండనేరదు.
అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు -ప్రభువు ఇట్లనెను -ఇదిగో యొక కాలము వచ్చుచున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను యూదా ఇంటివారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును.
అది నేను ఐగుప్తుదేశములోనుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధనవంటిది కాదు.ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు.
ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా,వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందును వారు నాకు ప్రజలైయుందురు.
వారిలో ఎవడును ప్రభువును తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశముచేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరును నన్ను తెలిసికొందురు.
నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
ఆయన క్రొత్తనిబంధన అని చెప్పుటచేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది.
ఈ విషయమై పరిశుద్ధాత్మకూడ మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు.
ఏలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదేనా ధర్మవిధులను వారి హృదయమునందుంచి వారి మనస్సుమీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత
వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు.
వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరిహారార్థబలి యికను ఎన్నడును ఉండదు.