మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను
యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడురక్తవర్ణమగును.
యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు.
ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉప ద్రవమును మహానాశనమును కమ్ముదినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ముదినము, మేఘములును గాఢాంధ కారమును కమ్ముదినము.
ఆ దినమున ప్రాకారములుగల పట్టణముల దగ్గరను, ఎత్తయిన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును.
జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను; వారు గ్రుడ్డి వారివలె నడిచెదరు, వారి రక్తము దుమ్మువలె కారును,వారి మాంసము పెంటవలె పారవేయబడును.
యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింప లేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింప బడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వ నాశనము చేయబోవుచున్నాడు.
ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును;గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండ, రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
అయితే నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.
నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదములక్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
హోరేబు కొండమీద ఇశ్రాయేలీయులందరికొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసికొనుడి.
యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.
నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.