యేసును ఆయన శిష్యులును వెళ్లుచుండగా కొందరు, దయ్యముపట్టిన యొక మూగవాని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడిఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పు కొనిరి.
అప్పుడు దయ్యముపట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన యొకడు ఆయనయొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థ పరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను.
అందుకు ప్రజలందరు విస్మయమొంది ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకొను చుండిరి.
అప్పుడు వారు చెవుడుగల నత్తి వాని ఒకని ఆయనయొద్దకు తోడుకొనివచ్చి, వానిమీద చెయ్యి యుంచుమని ఆయనను వేడుకొనిరి.
సమూహములోనుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి, వాని చెవులలో తన వ్రేళ్లుపెట్టి, ఉమి్మవేసి, వాని నాలుక ముట్టి
ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్ఫతా అని వానితో చెప్పెను; ఆ మాటకు తెరవబడు మని అర్థము.
అంతట వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను.
అప్పుడాయనఇది ఎవనితోను చెప్పవద్దని వారి కాజ్ఞా పించెను; అయితే ఆయన చెప్పవద్దని వారి కాజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధిచేయుచు
ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు; చెవిటి వారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి.