యోసేపు పుత్రుల వంశావళి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా
సంఖ్యాకాండము 2:18

ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపుధ్వజము పడమటిదిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు.

సంఖ్యాకాండము 2:19

అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది.

సంఖ్యాకాండము 26:35-37
35

ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి; షూతలహీయులు షూతలహు వంశస్థులు; బేకరీయులు బేకరు వంశస్థులు; తహనీయులు తహను వంశస్థులు,

36

వీరు షూతలహు కుమారులు; ఏరానీయులు ఏరాను వంశస్థులు.

37

వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ముప్పదిరెండువేల ఐదువందలమంది; వీరు యోసేపు పుత్రుల వంశస్థులు.

ఆదికాండము 30:24

మరియు ఆమె--యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.

ఆదికాండము 37:1-36
1

యాకోబు తన తండ్రి పరదేశవాసిగ ఉండిన కనాను దేశములో నివసించెను.

2

యాకోబువంశావళి యిది. యోసేపు పదునేడేండ్లవాడై తన సహోదరులతో కూడ మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రియొద్దకు తెచ్చుచుండువాడు.

3

మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటె ఎక్కువగా అతని ప్రేమించి అతనికొరకు విచిత్రమైన నిలువుటంగీ కుట్టించెను.

4

అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటె ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి, అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి.

5

యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతనిమీద మరి పగపట్టిరి.

6

అతడు వారిని చూచి నేను కనిన యీ కలను మీరు దయచేసి వినుడి.

7

అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి; నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెనని చెప్పెను.

8

అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా? మామీద నీవు అధికారివగుదువా అని అతనితో చెప్పి, అతని కలలనుబట్టియు అతని మాటలనుబట్టియు అతనిమీద మరింత పగపట్టిరి.

9

అతడింకొక కల కని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరియొక కలకంటిని; అందులో సూర్య చంద్రులును పదకొండు నక్షత్రములును నాకు సాష్టాంగపడెనని చెప్పెను.

10

అతడు తన తండ్రితోను తన సహోదరులతోను అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన యీ కల యేమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులును నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దించెను.

11

అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను.

12

అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్లిరి.

13

అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు. నిన్ను వారియొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను.

14

అప్పుడతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలిసికొని నాకు వర్తమానము తెమ్మని అతినితో చెప్పి హెబ్రోను లోయలోనుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను.

15

అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి నీవేమి వెదకుచున్నావని అతని నడిగెను.

16

అందుకతడు నేను నా సహోదరులను వెదుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగెను.

17

అందుకు ఆ మనుష్యుడు ఇక్కడనుండి వారు సాగివెళ్లిరి. వారు దోతానుకు వెళ్లుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కనుగొనెను.

18

అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి.

19

వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు;

20

వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.

21

రూబేను ఆ మాట విని మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండ అతని విడిపించెను.

22

ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని నప్పగించుటకై వారి చేతులలో పడకుండ అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి; అతనికి హాని ఏమియు చేయక అడవిలోనున్న యీ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను.

23

యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొనియుండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి,

24

అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది అందులో నీళ్లులేవు.

25

వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొనిపోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి.

26

అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము?

27

ఈ ఇష్మాయేలీయులకు వానిని అమి్మవేయుదము రండి; వాడు మన సహోదరుడు మన రక్తసంబంధిగదా? వానికి హాని యేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి.

28

మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమి్మవేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.

29

రూబేను ఆ గుంటకు తిరిగివచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని

30

తన సహోదరుల యొద్దకు తిరిగివెళ్లి చిన్నవాడు లేడే; అయ్యో నేనెక్కడికి పోదుననగా

31

వారు యోసేపు అంగీని తీసికొని, ఒకమేకపిల్లను చంపి, దాని రక్తములో ఆ అంగీముంచి

32

ఆ విచిత్రమైన నిలువు టంగీని పంపగా వారు తండ్రియొద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గురుతుపట్టుమని చెప్పిరి

33

అతడు దానిని గురుతుపట్టి ఈ అంగీ నా కుమారునిదే; దుష్ట మృగము వానిని తినివేసెను; యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను.

34

యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా

35

అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి; అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్లెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను.

36

మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసికొనిపోయి, ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమి్మవేసిరి.

ఆదికాండము 39:1-23
1

యాసేపును ఐగుప్తునకు తీసికొని వచ్చినప్పుడు ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజసంరక్షక సేనాధిపతియునైన పోతీఫరను నొక ఐగుప్తీయుడు, అక్కడికి అతని తీసికొనివచ్చిన ఇష్మాయేలీయులయొద్దనతని కొనెను.

2

యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను.

3

యెహోవా అతనికి తోడైయుండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు

4

యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్యచేయువాడాయెను. మరియు అతడు తన యింటిమీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతనిచేతి కప్పగించెను.

5

అతడు తన యింటిమీదను తనకు కలిగినదంతటిమీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని యింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము యింటిలో నేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను.

6

అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతి కప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై యుండెను.

7

అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపుమీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను

8

అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికప్పగించెనుగదా, నా వశమున తన యింటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు; ఈ యింటిలో నాకంటె పైవాడు ఎవడును లేడు.

9

నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను.

10

దిన దినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడుకాడు.

11

అట్లుండగా ఒక నాడు అతడు తన పనిమీద ఇంటిలోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు.

12

అప్పుడామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.

13

అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొనిపోవుట ఆమె చూచినప్పుడు

14

తన యింటి మనుష్యులను పిలిచి చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మనయొద్దకు తెచ్చియున్నాడు. నాతో శయనింపవలెనని వీడు నాయొద్దకు రాగా నేను పెద్దకేక వేసితిని.

15

నేను బిగ్గరగా కేకవేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెనని వారితో చెప్పి

16

అతని యజమానుడు ఇంటికి వచ్చువరకు అతని వస్త్రము తనదగ్గర ఉంచుకొనెను.

17

అప్పుడామె తన భర్తతో ఈ మాటలచొప్పున చెప్పెను నీవు మనయొద్దకు తెచ్చిన ఆ హెబ్రీదాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నాయొద్దకు వచ్చెను.

18

నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెననెను

19

కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి

20

అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను.

21

అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి, అతనియందు కనికరపడి అతనిమీద ఆ చెరసాలయొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుచేసెను.

22

చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరిని యోసేపు చేతికప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు.

23

యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిగూర్చియు విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను.

ఆదికాండము 46:20

యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తుదేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తెయైన ఆసెనతు అతనికి కనెను.

ఆదికాండము 48:1-22
1

ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా,

2

ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతట ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచముమీద కూర్చుండెను.

3

యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి

4

ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్యస్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను.

5

ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ యిద్దరు కుమారులు నా బిడ్డలే; రూబేను షిమ్యోనులవలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై యుందురు.

6

వారి తరువాత నీవు కనిన సంతానము నీదే; వారు తమ సహోదరుల స్వాస్థ్యమునుబట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు.

7

పద్దనరామునుండి నేను వచ్చుచున్నప్పుడు, ఎఫ్రాతాకు ఇంక కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా యెదుట మృతి పొందెను. అక్కడ బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితినని యోసేపుతో చెప్పెను.

8

ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా

9

యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నా కనుగ్రహించెనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసికొని రమ్మనెను.

10

ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యమువలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను. యోసేపువారిని అతనిదగ్గరకు తీసికొనివచ్చినప్పుడు అతడు వారిని ముద్దుపెట్టుకొని కౌగిలించుకొనెను.

11

ఇశ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరచియున్నాడనగా

12

యోసేపు అతని మోకాళ్ల మధ్యనుండి వారిని తీసికొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను.

13

తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతి తట్టున తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేతి తట్టున తన యెడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసికొనివచ్చెను.

14

మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడిచేతిని మనష్షే తలమీద తన యెడమచేతిని ఉంచెను.

15

అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవనియెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు,

16

అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక; భూమియందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను.

17

యోసేపు ఎఫ్రాయిము తలమీద తన తండ్రి కుడిచెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతని కిష్టము కాకపోయెను గనుక అతడు మనష్షే తలమీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తలమీదనుండియెత్తి

18

నా తండ్రీ అట్లు కాదు; ఇతడే పెద్దవాడు, నీ కుడిచెయ్యి యితని తలమీద పెట్టుమని చెప్పెను.

19

అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియును, నా కుమారుడా అది నాకు తెలియును; ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును గాని యితని తమ్ముడు ఇతని కంటె గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను.

20

ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిమువలెను మనష్షేవలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను. ఆలాగు అతడు మనష్షేకంటె ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను.

21

మరియు ఇశ్రాయేలు ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడైయుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరల తీసికొనిపోవును.

22

నేను నీ సహోదరులకంటె నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోను నా వింటితోను అమోరీయుల చేతిలోనుండి తీసికొంటినని యోసేపుతో చెప్పెను.

ఆదికాండము 49:22-26
22

యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మ దాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును.

23

విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణములను వేసి అతని హింసించిరి.

24

యాకోబు కొలుచు పరాక్రమశాలియైనవాని హస్తబలమువలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవునివలనను పైనుండి మింటి దీవెనలతోను

25

క్రింద దాగియున్న అగాధజలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనవలనను అతని బాహుబలము దిట్టపరచబడును

26

నీ తండ్రి దీవెనలు నా పూర్వికుల దీవెనలపైని చిరకాల పర్వతములకంటె హెచ్చుగ ప్రబలమగును. అవి యోసేపు తలమీదను తన సహోదరులనుండి వేరుపరచబడిన వాని నడినెత్తిమీదను ఉండును.

ద్వితీయోపదేశకాండమ 33:17

అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క వేలును ఆలాగున నుందురు.