
యెహోవా , నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకుత్తరమిమ్ము
నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము . నా దేవా, నిన్ను నమ్ముకొనియున్న నీ సేవకుని రక్షింపుము .
ప్రభువా , దినమెల్ల నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నన్ను కరుణింపుము
ప్రభువా , నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము .
ప్రభువా , నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱపెట్టువారందరియెడల కృపాతిశయముగలవాడవు .
యెహోవా , నా ప్రార్థనకు చెవి యొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపుము ,
నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొఱ్ఱపెట్టెదను .
ప్రభువా , నీవు మహాత్మ్యముగలవాడవు ఆశ్చర్యకార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు.
ప్రభువా , దేవతలలో నీవంటివాడు లేడు నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు .
నీవు సృజించిన అన్యజనులందరును వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును ఘనపరచుదురు
యెహోవా , నేను నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము . నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.
నా పూర్ణహృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపరచెదను .
ప్రభువా , నా దేవా , నాయెడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధమునుండి నా ప్రాణమును తప్పించియున్నావు .
దేవా , గర్విష్ఠులు నా మీదికి లేచియున్నారు బలాత్కారులు గుంపుకూడి నా ప్రాణము తీయజూచుచున్నారు వారు నిన్ను లక్ష్యపెట్టనివారైయున్నారు .
ప్రభువా , నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు ధీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు
నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము నీ సేవకురాలి కుమారుని రక్షింపుము .
యెహోవా , నీవు నాకు సహాయుడవై నన్నాదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము .
ప్రభువా , తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే .
పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు
నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా , తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు .
నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలెనున్నవి రాత్రియందలి యొక జామువలెనున్నవి .
వరదచేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు . ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు
ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును .
నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము .
మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొనియున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడుచున్నవి.
నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితివిు. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందుము .
మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము .
నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును ? నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియును ?
మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము .
యెహోవా , తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము .
ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము .
నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది మేము కీడనుభవించిన యేండ్లకొలది మమ్మును సంతోషపరచుము .
నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము.
మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక మా చేతిపనిని మాకు స్థిరపరచుము మా చేతిపనిని స్థిరపరచుము.
యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను నన్ను తరుమువారిచేతిలోనుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా
వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండ నన్ను తప్పించుము.
యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన యెడల
నాచేత పాపము జరిగినయెడల నాతో సమాధానముగా నుండినవానికి నేను కీడుచేసినయెడల
శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని నేను సంరక్షించితిని గదా.(సెలా.)
యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా.
జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనునప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము.
యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతనుబట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము.
హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా,
దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగలవారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై యున్నాడు.
న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు.
ఒకడును మళ్లనియెడల, ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచియున్నాడు
వానికొరకు మరణసాధనములను సిద్ధపరచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు
పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించినవాడై అబద్దమును కనియున్నాడు.
వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానేపడిపోయెను.
వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును.
యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను.