ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను పిలువనంపించి తీసికొనివచ్చి, నేను పాతిపెట్టిన యీ రాళ్లమీద అతని సింహాసనము ఉంచెదను, అతడు రత్నకంబళిని వాటిమీదనే వేయించును.
అతడువచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగులునకును, చెరకు నిర్ణయమైనవారిని చెరకును, ఖడ్గమునకు నిర్ణయమైనవారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తీయులను హతముచేయును.
ఐగుప్తు దేవతల గుళ్లలో నేను అగ్ని రాజబెట్టుచున్నాను, వాటిని నెబుకద్రెజరు కాల్చి వేయును, ఆ దేవతలను చెరగొనిపోవును, గొఱ్ఱలకాపరి తన వస్త్రమును చుట్టుకొనునట్లు అతడు ఐగుప్తుదేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడనుండి సాగిపోవును.
అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవతా పట్టణములోని సూర్యప్రతిమలను విరుగగొట్టి ఐగుప్తు దేవతల గుళ్లను అగ్నిచేత కాల్చివేయును.
అతనికి శత్రువై అతని ప్రాణమును తీయ జూచుచుండిన నెబుకద్రెజరను బబులోను రాజుచేతికి నేను యూదారాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తురాజైన ఫరోహొఫ్రను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచువారి చేతికి అప్పగించెదను.
ఐగుప్తునుగూర్చిన దేవోక్తి యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరగుచున్నది
నేను ఐగుప్తీయులమీదికి ఐగుప్తీయులను రేపెదను సహోదరులమీదికి సహోదరులు పొరుగువారిమీదికి పొరుగువారు లేచుదురు పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును
ఐగుప్తీయులయొక్క శౌర్యము నశించును వారి ఆలోచనశక్తిని నేను మాన్పివేసెదను కావున వారు విగ్రహములయొద్దకును గొణుగువారియొద్దకును కర్ణపిశాచిగలవారియొద్దకును సోదెగాండ్రయొద్దకును విచారింప వెళ్లుదురు.
నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించెదను బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేలయగును
ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును.
నైలునదీప్రాంతమున దాని తీరముననున్న బీడులును దానియొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొనిపోయి కనబడకపోవును.
జాలరులును దుఃఖించెదరు నైలునదిలో గాలములు వేయువారందరు ప్రలాపించెదరు జలములమీద వలలు వేయువారు కృశించిపోవుదురు
దువ్వెనతో దువ్వబడు జనుపనారపని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములు పడగొట్టబడును
కూలిపని చేయువారందరు మనోవ్యాధి పొందుదురు.
ఫరోయొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచనశక్తి పశుప్రాయమాయెను నేను జ్ఞాని కుమారుడను పూర్వపురాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు?
నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకధిపతియగు యెహోవా ఐగుప్తునుగూర్చి నిర్ణయించినదానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను గదా?
సోయను అధిపతులు అవివేకులైరి నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి
యెహోవా ఐగుప్తుమీద మూర్ఖతగల ఆత్మను కుమ్మరించి యున్నాడు మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసియున్నారు
తలయైనను తోకయైనను కొమ్మయైనను రెల్లయినను ఐగుప్తులో పని సాగింపువారెవరును లేరు
ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీలవంటివారగుదురు. సైన్యములకధిపతియగు యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణకి భయపడుదురు.
యూదాదేశము ఐగుప్తునకు భయంకరమగును తమకువిరోధముగా సైన్యములకధిపతియగు యెహోవా ఉద్దేశించినదానినిబట్టి ఒకడు ప్రస్తాపించినయెడల ఐగుప్తీయులు వణకుదురు.
ఆ దినమున కనానుభాషతో మాటలాడుచు యెహోవా వారమని ప్రమాణముచేయు అయిదు పట్టణములు ఐగుప్తుదేశములో ఉండును, వాటిలో ఒకటి నాశనపురము.
ఆ దినమున ఐగుప్తుదేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక స్తంభమును ఉండును.
అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును.
ఐగుప్తీయులు తెలిసికొనునట్లు యెహోవా తన్ను వెల్లడిపరచుకొనును ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసికొందురు వారు బలి నైవేద్యముల నర్పించి ఆయనను సేవించెదరు యెహోవాకు మ్రొక్కుకొనెదరు తాము చేసికొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు.
యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన నంగీకరించి వారిని స్వస్థపరచును.
ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ మేర్పడును అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచు పోవుచునుందురు ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవించెదరు.
ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు మూడవ జనమై భూమిమీద ఆశీర్వాద కారణముగ నుండును.
సైన్యములకధిపతియగు యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా,మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును.
అరీయేలుకు శ్రమ దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరుగనీయుడి.
నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును.
నేను నీతో యుద్ధముచేయుచు నీచుట్టు శిబిరము వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును.
అప్పుడు నీవు అణపబడి నేలనుండి పలుకుచుందువు నీ మాటలు నేలనుండి యొకడు గుసగుసలాడు నట్లుండును కర్ణపిశాచి స్వరమువలె నీ స్వరము నేలనుండి వచ్చును నీ పలుకు ధూళిలోనుండి గుసగుసలుగా వినబడును.
నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును బాధించువారి సమూహము ఎగిరిపోవు పొట్టువలె నుండును హఠాత్తుగా ఒక్క నిమిషములోనే యిది సంభవించును.
ఉరుముతోను భూకంపముతోను మహా శబ్దముతోను సుడిగాలి తుపానులతోను దహించు అగ్నిజ్వాలలతోను సైన్యములకధిపతియగు యెహోవా దాని శిక్షించును.
అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును దానిమీదను దాని కోటమీదను యుద్ధము చేయువారును దాని బాధపరచువారందరును రాత్రి కన్న స్వప్నము వలె ఉందురు.
ఆకలిగొన్నవాడు కలలో భోజనముచేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును దప్పిగొనినవాడు కలలో పానముచేసి మేల్కొనగా సొమ్మసిల్లినవాని ప్రాణము ఇంకను ఆశగొనియున్నట్లును సీయోను కొండమీద యుద్ధముచేయు జనముల సమూహమంతటికి సంభవించును.
జనులారా, తేరి చూడుడి విస్మయమొందుడి మీ కండ్లను చెడగొట్టుకొనుడి గ్రుడ్డివారగుడి ద్రాక్షారసము లేకయే వారు మత్తులైయున్నారు మద్యపానము చేయకయే తూలుచున్నారు.
యెహోవా మీమీద గాఢనిద్రాత్మను కుమ్మరించియున్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టియున్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుకు వేసియున్నాడు.
దీనినంతటినిగూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యములవలె ఉన్నది ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసినవానికి వానిని అప్పగించును; అతడు అది నావలన కాదు అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును.
మరియునీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలియనివానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియవనును.
ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి.
కాగా నేను మరల ఈ జనులయెడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును.
తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలోపల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ. మమ్ము నెవరు చూచెదరు? మా పని యెవరికి తెలియును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించువారికి శ్రమ.
అయ్యో, మీరెంత మూర్ఖులు? కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసినవారిగూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించినవానిగూర్చి ఇతనికి బుద్ధిలేదనవచ్చునా?
ఇకను కొద్ది కాలమైన తరువాతనే గదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలము వనమని యెంచబడును.
ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు.
యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు అనందించెదరు.
బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు.
కీడుచేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యెమునుబట్టి యితరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించువానిని పట్టుకొనవలెనని ఉరినొడ్డుచు మాయమాటలచేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు.
అందుచేతను అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమునుగూర్చి యీలాగు సెలవిచ్చుచున్నాడు ఇకమీదట యాకోబు సిగ్గుపడడు ఇకమీదట అతని ముఖము తెల్లబారదు.
అతని సంతానపువారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచునప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు యాకోబు పరిశుద్ధదేవుని పరిశుద్ధపరచుదురు ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు.
చంచల బుద్ధిగలవారు వివేకులగుదురు సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు.