పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును
యెషయా 14:19-22
19

నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్పబడినవాడవైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివి బిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలెనున్నావు

20

నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితోకూడ కలిసియుండవు దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు.

21

వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమునుబట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి.

22

సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఇదే నేను వారిమీదికి లేచి బబులోనునుండి నామమును శేషమును కుమారుని మనుమని కొట్టివేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యెషయా 47:9-14
9

ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును . నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసికొనినను ఆ యపాయములు నీమీదికి సంపూర్తిగా వచ్చును .

10

నీ చెడుతనమును నీవు ఆధారము చేసికొని యెవడును నన్ను చూడడని అనుకొంటివి నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవనుకొనునట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను .

11

కీడు నీమీదికి వచ్చును నీవు మంత్రించి దాని పోగొట్ట జాలవు ఆ కీడు నీమీద పడును దానిని నీవు నివారించ లేవు నీకు తెలి యని నాశనము నీమీదికి ఆకస్మికముగా వచ్చును .

12

నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనము లగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతు వేమో

13

నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము.

14

వారు కొయ్యకాలు వలెనైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది జ్వాలయొక్క బలమునుండి తమ్ముతాము తప్పించుకొన లేక యున్నారు అది కాచుకొనుటకు నిప్పు కాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు.

యిర్మీయా 50:27

దాని యెడ్లన్నిటిని వధించుడి అవి వధకు పోవలెను అయ్యో, వారికి శ్రమ వారి దినము ఆసన్నమాయెను వారి దండనకాలము వచ్చెను.

యిర్మీయా 50:35-42
35

యెహోవా మాట యిదే కల్దీయులును బబులోను నివాసులును దాని అధిపతులును జ్ఞానులును కత్తిపాలగుదురు

36

ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగువరకు ఖడ్గము వారిమీద పడును

37

ఖడ్గము వారి గుఱ్ఱములమీద పడును వారి రథముల మీద పడును ఖడ్గము వారిమీదికి దిగుటచేత దానిలోనున్న పరదేశులు స్త్రీలవంటివారగుదురు అది దాని నిధులమీద పడగా అవి దోచుకొనబడును.

38

నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములుగల దేశము జనులు భీకరప్రతిమలనుబట్టి పిచ్చిచేష్టలు చేయుదురు.

39

అందుచేతను అడవిపిల్లులును నక్కలును అక్కడ నివసించును నిప్పుకోళ్లును దానిలో నివాసముచేయును ఇకమీదట అది ఎన్నడును నివాసస్థలము కాకపోవును తరతరములు దానిలో ఎవరును కాపురముండరు.

40

యెహోవా వాక్కు ఇదే సొదొమను గొమొఱ్ఱాను వాటి సమీపపట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడును అక్కడ కాపురముండకపోవును ఏ నరుడును దానిలో బసచేయడు.

41

జనులు ఉత్తరదిక్కునుండి వచ్చుచున్నారు మహాజనమును అనేక రాజులును భూదిగంతములనుండి రేపబడెదరు.

42

వారు వింటిని ఈటెను పట్టుకొని వచ్చెదరు వారు క్రూరులు జాలిపడనివారు వారి స్వరము సముద్రఘోషవలె ఉన్నది వారు గుఱ్ఱములను ఎక్కువారు బబులోను కుమారీ, ఒకడు యుద్ధపంక్తులు తీర్చు రీతిగా వారందరు నీమీద పంక్తులు తీర్చుచున్నారు.

యిర్మీయా 51:3

విలుకానిమీదికి విలుకాడు విల్లు త్రొక్కవలెను కవచము వేసికొనువానిమీదికిని విల్లు త్రొక్కవలెను కల్దీయులదేశములో జనులు హతులై పడునట్లును దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును