దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.
దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా
ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.
పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.
వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నది లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.
అతడు తన అంతఃపురములోనుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు శూరుడు పరుగెత్త నుల్లసించునట్లు తన పథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు.
దేవుడు - పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు,
భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను.
దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.
భూమిమీద వెలుగిచ్చుటకును
పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను.
ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.