యెహోవా దూతలారా , ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా , ఆయనను సన్నుతించుడి .
యెహోవా సైన్యములారా , ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా , మీరందరు ఆయనను సన్నుతించుడి .
ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?
ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను.
వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.
వారి కంఠస్వరమువలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా
అంతలో ఆత్మ నన్నెత్తికొనిపోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దమొకటి ఆయన యున్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని .
మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించియున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను.
వారు- వధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.
అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును -సింహాసనాసీనుడైయున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.
ఆకాశమును భూమియు వాటిలో నున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను.