దేవుడు - మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను.
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
ఎందుకనగా యెహోవా , నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతిపనులబట్టి నేను ఉత్సహించుచున్నాను .
యెహోవా , నీ కార్యములు ఎంత దొడ్డవి ! నీ ఆలోచనలు అతిగంభీరములు ,
యెహోవా , నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది .
యెహోవా క్రియలు గొప్పవి వాటియందు ఇష్టముగలవారందరు వాటిని విచారించుదురు .
ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు.
వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునైయున్నవి;