నీవు లేవీయులతో ఇట్లనుము నేను ఇశ్రాయేలీయులచేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారియొద్ద పుచ్చుకొనునప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమభాగములో దశమభాగమును యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలెను.
మీకు వచ్చు ప్రతిష్ఠార్పణము కళ్లపు పంటవలెను ద్రాక్షల తొట్టి ఫలమువలెను ఎంచవలెను.
అట్లు మీరు ఇశ్రాయేలీయులయొద్ద పుచ్చుకొను మీ దశమభాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించుఅర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను.
అటుతరువాత యూదులందరును ధాన్య ద్రాక్షారసతైలములలో పదియవ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి.
నమ్మకముగల మనుష్యులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని సాదోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయాను ఖజానామీద నేను కాపరులగా నియమించితిని; వారి చేతిక్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను; మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పనివారికి నియమింపబడెను.
లేవీయులైన నలుగురు ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై యుండిరి; దేవుని మందిరపు గదులమీదను బొక్కసములమీదను ఆ లేవీయులు ఉంచబడియుండిరి.