యెహోయాకీము
2 రాజులు 23:36
యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమున పదకొండు సంవత్సర ములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివా డైన పెదాయా కుమార్తెయగు జెబూదా.
2 రాజులు 23:37
ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడతనడిచెను.
యిర్మీయా 22:13-19
13

నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ; న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు, జీతమియ్యక తన పొరుగువానిచేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ.

14

వాడు విశాలమైన మేడ గదులుగల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని, విస్తారమైన కిటికీలు చేసికొనుచు, దేవదారు పలకలను దానికి సరంబీవేయుచు, ఇంగిలీకముతో1 రంగువేయుచు నున్నాడే;

15

నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుటచేత రాజవగుదువా? నీ తండ్రి అన్న పానములు కలిగి నీతిన్యాయముల ననుసరించుచు క్షేమముగా ఉండలేదా?

16

అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రదికెను, ఆలాగున చేయుటే నన్ను తెలిసి కొనుట కాదా? యిదే యెహోవా వాక్కు.

17

అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపదాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు.

18

కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమను యూదారాజునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుజనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరీ, అని అతని గూర్చి అంగలార్చరు; అయ్యో నా యేలినవాడా, అయ్యో, శోభావంతుడా; అని అతనికొరకు అంగలార్చరు.

19

అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడురీతిగా పాతిపెట్టబడును.

యిర్మీయా 26:21-23
21

రాజైన యెహోయాకీమును అతని శూరులందరును ప్రధానులందరును అతని మాటలు వినినమీదట రాజు అతని చంపజూచుచుండగా, ఊరియా దాని తెలిసికొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను.

22

అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరిని ఐగుప్తు నకు పంపెను;

23

వారు ఐగుప్తులోనుండి ఊరియాను తీసికొనివచ్చి రాజైన యెహోయాకీమునొద్ద చేర్చగా, ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్యజనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను.

యిర్మీయా 36:1

యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము నాలుగవ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

యిర్మీయా 36:27-32
27

యిర్మీయా నోటిమాటనుబట్టి బారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

28

నీవు మరియొక గ్రంథము తీసికొని యూదారాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నిటిని దానిలో వ్రాయుము.

29

మరియు యూదా రాజైన యెహోయాకీమునుగూర్చి నీవీమాట చెప్పవలెనుయెహోవా సెలవిచ్చునదేమనగాబబులోనురాజు నిశ్చ యముగా వచ్చి యీ దేశమును పాడుచేసి అందులో మనుష్యులైనను జంతువులైనను ఉండకుండ చేయునని ఇందులో నీవేల వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే;

30

అందుచేతను యూదారాజైన యెహోయాకీమునుగూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడుదావీదుయొక్క సింహాసనముమీద ఆసీనుడగుటకు అతనికి ఎవడును లేకపోవును, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలునగును.

31

నేను వారి దోషమునుబట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారినిగూర్చి చెప్పిన కీడంతయు వారిమీదికిని యెరూషలేము నివాసులమీదికిని యూదా జనులమీదికిని రప్పించుచున్నాను; అయినను వారు వినినవారుకారు.

32

యిర్మీయా యింకొక గ్రంథమును తీసికొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకుచేతికి అప్పగింపగా అతడు యిర్మీయా నోటిమాటలను బట్టి యూదారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటిని వ్రాసెను; మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను.