
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను
–మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను.
అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెర తో కప్పవలెను.
నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసినవాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను.
సాక్ష్యపు మందసము నెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను.
ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము నెదుట దహన బలిపీఠమును ఉంచవలెను;
ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను.
తెరల చుట్టు ఆవరణమును నిలువబెట్టి ఆవరణ ద్వారముయొక్క తెరను తగిలింపవలెను.
మరియు నీవు అభిషేక తైలమును తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును.
దహన బలిపీఠమునకు అభిషేకముచేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతిపరిశుద్ధ మగును.
ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలెను.
మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్దకు తోడుకొనివచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి
అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకముచేసి అతని ప్రతిష్ఠింపవలెను.
మరియు నీవు అతని కుమారులను తోడుకొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి
వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను.
మోషే ఆ ప్రకారము చేసెను; యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, ఆలాగుననే చేసెను.
రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను.
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండె బద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి
మందిరము మీద గుడారమును పరచి దానిపైని గుడారపు కప్పును వేసెను.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసికొని మందసము లో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను.
మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరముయొక్క ఉత్తరదిక్కున, అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి
యెహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల యెదుట దీపవృక్షమును ఉంచి
యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర యెదుట బంగారు ధూపవేదికను ఉంచి
దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహన బలిపీఠమును ఉంచి
దానిమీద దహనబలి నర్పించి నైవేద్యమును సమర్పించెను.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళణకొరకు దానిలో నీళ్లు పోసెను.
దానియొద్ద మోషేయు అహరోనును అతని కుమారులును తమ చేతులును కాళ్లును కడుగుకొనిరి.
వారు ప్రత్యక్షపు గుడారము లోనికి వెళ్లునప్పుడున బలిపీఠమునకు సమీపించునప్పుడును కడుగుకొనిరి.
మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టు ఆవరణమును ఏర్పరచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. ఆలాగున మోషే పని సంపూర్తి చేసెను.
అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను.
ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారము లోనికి వెళ్ల లేకుండెను.
మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్లునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమై పోయిరి.
ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్లని యెడల అది వెళ్లు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి.
ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను. రాత్రివేళ అగ్ని దానిమీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను.
గిబియోనులోని ఉన్నతస్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము
గిబియోను ముఖ్యమైన ఉన్నతస్థలమై యుండెను గనుక బలుల నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠముమీద వెయ్యి దహనబలులను అర్పించెను.
గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు దేని నిచ్చుట నీకిష్టమోదాని నడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా
సొలొమోను ఈలాగు మనవి చేసెను నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతనియెడల పరిపూర్ణ కటాక్షమగుపరచి, యీ దినముననున్నట్లుగా అతని సింహాసనముమీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతనియందు మహాకృపను చూపియున్నావు.
నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు;
నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను; వారు విస్తరించియున్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాలదేశమును తనకీ చేయుటయు అసాధ్యము.
ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయచేయుము.
సొలొమోను చేసిన యీ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక
దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక, న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి.
నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను; బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను; పూర్వికులలో నీవంటివాడు ఒకడును లేడు, ఇకమీదట నీవంటివాడొకడును ఉండడు.
మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగక పోయినను నేను వాటిని కూడ నీకిచ్చుచున్నాను; అందువలన నీ దినములన్నిటను రాజులలో నీవంటివాడొకడైనను నుండడు.
మరియు నీ తండ్రియైన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన యెడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను.
అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలిసికొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధనగల మందసము ఎదుట నిలువబడి దహనబలులను సమాధానబలులను అర్పించి తన సేవకులందరికిని విందు చేయించెను.
సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలీయుల పితరుల యిండ్లకు పెద్దలైనవారి కందరికిని, అనగా ఇశ్రాయేలీయులకందరికిని ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరును
పిమ్మట సొలొమోను గిబియోనులోనుండు సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠమును విడచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీయులను ఏలుచుండెను.