చూచినవాటిని
ప్రకటన 1:11

నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని.

ప్రకటన 1:12-20
12

ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.

13

తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.

14

ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను;

15

ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.

16

ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొనియుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.

17

నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదములయొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెను- భయపడకుము;

18

నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.

19

కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని,

20

అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు.

ఉన్నవాటిని
ప్రకటన 2:1-3
1

ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా

2

నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొనువారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు,

3

నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును.

కలుగబోవువాటిని
ప్రకటన 4:1-22
1

ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు - ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెదననెను

2

వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడియుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీసుడైయుండెను,

3

ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను.

4

సింహాసనముచుట్టు ఇరువదినాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.

5

ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడు ఆత్మలు.

6

మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను.

7

మొదటి జీవి సింహమువంటిది; రెండవ జీవి దూడవంటిది;మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది.

8

ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి- భూత వర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును.

9

ఆ సింహాసనము నందు ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా

10

ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైయుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయుచు

11

ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి.