అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు -ప్రభువు ఇట్లనెను -ఇదిగో యొక కాలము వచ్చుచున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను యూదా ఇంటివారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును.
అది నేను ఐగుప్తుదేశములోనుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధనవంటిది కాదు.ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు.
ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా,వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందును వారు నాకు ప్రజలైయుందురు.
వారిలో ఎవడును ప్రభువును తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశముచేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరును నన్ను తెలిసికొందురు.
నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.
నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్నడును యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.