వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును.
లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని
ఇశ్రాయేలీయులలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందలయేబది మందితో మోషేకు ఎదురుగాలేచి
మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా,
మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను
తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినవానిని తనయొద్దకు చేర్చుకొనును.
ఈలాగు చేయుడి; కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసికొని వాటిలో అగ్నియుంచి రేపు యెహోవా సన్నిధిని వాటిమీద ధూపద్రవ్యము వేయుడి.
అప్పుడు యెహోవాయే మనుష్యుని యేర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పనిలేదు.
మరియు మోషే కోరహుతో ఇట్లనెను లేవి కుమారులారా వినుడి.
తన మందిరసేవచేయుటకు యెహోవా మిమ్మును తనయొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా?
ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారినందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వముకూడ కోరుచున్నారు.
ఇందు నిమిత్తము నీవును నీ సమస్తసమాజమును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేల అనెను.
అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను.
అయితే వారుమేము రాము; ఈ అరణ్యములో మమ్మును చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములోనుండి మమ్మును తీసికొనివచ్చుట చాలనట్టు, మామీద ప్రభుత్వము చేయుటకును నీకధికారము కావలెనా?
అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మును తీసికొని రాలేదు; పొలములు ద్రాక్షతోటలుగల స్వాస్థ్యము మాకియ్యలేదు; ఈ మనుష్యుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి.
అందుకు మోషే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక్క గాడిదనైనను వారియొద్ద నేను తీసికొన లేదు; వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవిచేసెను.
మరియు మోషే కోరహుతొ నీవును నీ సర్వసమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను.
మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసికొని వాటి మీద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండువందల ఏబది ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను.
కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసికొని వాటిలో అగ్ని యుంచి వాటిమీద ధూప ద్రవ్యము వేసినప్పుడు, వారును మోషే అహరోనులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచిరి.
కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును వారికి విరోధముగా పోగుచేయగా యెహోవా మహిమ సర్వసమాజమునకు కనబడెను.
అప్పుడు యెహోవా మీరు ఈ సమాజములోనుండి అవతలికి వెళ్లుడి.
క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా
వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీ యొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా? అని వేడుకొనిరి.
అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
కోరహు దాతాను అబీరాములయొక్క నివాసముల చుట్టుపట్లనుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము.
అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్లగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్లిరి.
అతడు ఈ దుష్టుల గుడారములయొద్దనుండి తొలగిపోవుడి; మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను.
కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాసములయొద్దనుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబీరాములును వారి భార్యలును వారి కుమారులును వారి పసిపిల్లలును తమ గుడారముల ద్వారమున నిలిచిరి.
మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలిసికొందురు.
మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణము వీరు పొందిన యెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగినయెడలను, యెహోవా నన్ను పంపలేదు.
అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను.
అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను.
భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.
వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళములో కూలిరి; భూమి వారిని మింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి.
వారి చుట్టునున్న ఇశ్రాయేలీయులందరు వారి ఘోష విని భూమి మనలను మింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి.
మరియు యెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చివేసెను.
అయ్యోవారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి.