నేను మిమ్మును కొని పోవుచున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత
సంఖ్యాకాండము 15:2

నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీ కిచ్చుచున్న దేశనివాసములలో మీరు ప్రవేశించిన తరువాత

ద్వితీయోపదేశకాండమ 26:1-15
1

నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించుచున్నప్పుడు

2

నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలోనుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసికొని గంపలో ఉంచి, నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొను స్థలమునకు వెళ్లి

3

ఆ దినములలోనుండు యాజకునియొద్దకు పోయి యెహోవా మన పితరుల కిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చియున్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను.

4

యాజకుడు ఆ గంపను నీ చేతిలోనుండి తీసికొని నీ దేవుడైన యెహోవా బలిపీఠమునెదుట ఉంచగా

5

నీవునా తండ్రి నశించుచున్న అరామీదేశస్థుడు; అతడు ఐగుప్తునకు వెళ్లెను. కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసియై, గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియునగు జనమాయెను.

6

ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరచి మనమీద కఠిన దాస్యము మోపగా

7

మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టినప్పుడు యెహోవా మన మొఱ్ఱను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను.

8

అప్పుడు యెహోవా బాహుబలమువలనను చాపిన చేతి వలనను మహాభయమువలనను సూచక క్రియలవలనను మహత్కార్యములవలనను ఐగుప్తులోనుండి మనలను రప్పించి

9

యీ స్థలమునకు మనలను చేర్చి, పాలు తేనెలు ప్రవహించు దేశమైయున్న యీ దేశమును మనకిచ్చెను.

10

కాబట్టి యెహోవా, నీవే నాకిచ్చిన భూమియొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చియున్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి

11

నీ దేవుడైన యెహోవా సన్నిధిని దానిపెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారముచేసి, నీకును నీ యింటివారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులును నీ దేశములో ఉన్న పరదేశులును సంతోషింపవలెను.

12

పదియవ భాగమిచ్చు సంవత్సరమున, అనగా మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో పదియవ వంతును చెల్లించి, అది లేవీయులకును పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తిపొందిన తరువాత

13

నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటిచొప్పున నా యింటనుండి ప్రతిష్టితమైనదానిని తీసివేసి, లేవీయులకును పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును నేనిచ్చియున్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మరచిపోలేదు.

14

నేను దుఃఖములోనుండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనై యుండగా దానిలో దేనిని తీసివేయలేదు, చనిపోయినవారి విషయమై దానిలో ఏదియు నేనియ్యలేదు, నా దేవుడైన యెహోవా మాట విని నీవు నా కాజ్ఞాపించినట్లు సమస్తము జరిపియున్నాను.

15

నీ పరిశుద్ధాలయమగు ఆకాశములోనుండి చూచి, నీ జనులైన ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చియున్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను.