ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరబాటున పాపముచేసినయెడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెలచొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలోనుండి అపరాధపరిహారార్థబలిగా యెహోవాయొద్దకు వాడు తీసికొనిరావలెను.
కావున నీవు ఏర్పరచిన వెలచొప్పున మందలోనుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధపరిహారార్థబలిగా అతడు యాజకునియొద్దకు తీసికొనిరావలెను. అతడు తెలియకయే పొరబాటున చేసిన తప్పునుగూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.