
మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కలవంటి రెక్కలుండెను . నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలె అది పాదములు పెట్టుకొని నేల పైన నిలువబడెను . మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికియ్యబడెను .
రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది , అది యొక పార్శ్వముమీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరులెమ్ము , విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి .
అటు పిమ్మట చిరుతపులినిపోలిన మరియొక జంతువును చూచితిని . దాని వీపున పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలుండెను ; దానికి నాలుగు తలలుండెను ; దానికి ఆధిపత్య మియ్యబడెను .
నేను చూడగా ఆమేకపోతు పొట్టేలును కలిసికొని , మిక్కిలి రౌద్రముగలదై దానిమీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టెను . ఆ పొట్టేలు దాని నెదిరింప లేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను ; దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరిచేతను కాకపోయెను .