
కాలము ఉపాయముగా గడపవలెనని అబద్ధమును మోసపు మాటలను నాయెదుట పలుక నుద్దేశించియున్నారు. మీరు కలను చెప్ప లేకపోయిన యెడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలిసికొందును .
అందుకు కల్దీయులు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరి -భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్ప జాలడు , ఏ చక్రవర్తియు అధికారియు శకునగానియొద్దను గారడీవిద్య గలవానియొద్దను కల్దీయునియొద్దను ఇట్టి సంగతి విచారింప లేదు .
రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది , దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్ప జాలరు ; దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు గదా .
నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలెనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల యధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను .
రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు , హనన్యా , మిషాయేలు , అజర్యా వంటివారెవరును కనబడ లేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి .