అయితే ఏడవ మాసమందు రాజ వంశజుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు పదిమంది మనుష్యులను పిలుచుకొని వచ్చి గెదల్యామీద పడగా అతడు మరణమాయెను. మరియు మిస్పాలో అతని యొద్దనున్న యూదులను కల్దీయులను అతడు హతముచేసెను.
అయితే అచ్చటచ్చటనుండు సేనల యధిపతులందరును వారి పటాలపువారును, బబులోనురాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశముమీద అధికారిగా నియమించి, బబులోనునకు చెరగొని పోబడక నిలిచినవారిలో స్త్రీలను పురుషులను పిల్లలను, దేశములోని అతినీరసులైన దరిద్రులను అతనికి అప్పగించెనని వినిరి.