ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మయకాయందు బిక్రిని ముట్టడివేసి పట్టణపు ప్రాకారము ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరు ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి.
అప్పుడు యుక్తిగల యొక స్త్రీ ప్రాకారము ఎక్కి ఓహో ఆలకించుడి, ఆలకించుడి, నేను అతనితో మాటలాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోవాబు ఆమెదగ్గరకు వచ్చెను.
అంతట ఆమె యోవాబువు నీవేనా అని అతని నడుగగా అతడునేనే అనెను. అందుకామె నీ దాసురాలనగు నేను నీతో మాటలాడుదునా అని అడుగగా అతడుమాటలాడ వచ్చుననెను.
అంతట ఆమెపూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి విచారింపవలెనని చెప్పుట కద్దు; ఆలాగున చేసి కార్యములు ముగించుచు వచ్చిరి.
నేను ఇశ్రాయేలునందు నిమ్మళస్థులలోను యధార్థవంతులలోను చేరికయైనదానను; ఇశ్రాయేలీయుల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలెనని నీవు ఉద్దేశించుచున్నావు; యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయుదువని చెప్పగా
యోవాబు నిర్మూలము చేయను, లయ పరచను, ఆలాగున చేయనే చేయను, సంగతి అది కానే కాదు.
బిక్రి కుమారుడగు షెబ అను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదుమీద ద్రోహము చేసియున్నాడు; మీరు వానిని మాత్రము అప్పగించుడి; తోడనే నేను ఈ పట్టణము విడిచిపోవుదునని చెప్పగా ఆమె యోవాబుతోచిత్తము, వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడునని చెప్పిపోయి
తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికి తెలియజేయగా, వారు బిక్రి కుమారుడగు షెబయొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరును ఆ పట్టణమును విడిచి యెవరి గుడారములకు వారు పోయిరి; యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చెను.
అటుతరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్య మంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను .
అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి యుండగా గాడిదయొక్క తల ఎనుబది రూపాయలకును , అర పావు పావురపు రెట్ట అయిదు రూపాయలకును అమ్మబడెను; వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి.
అంతట ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజవైన నా యేలినవాడా , సహాయము చేయుమని కేకలు వేయుట విని
యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్లములోనుండియైనను ద్రాక్షగానుగలోనుండియైనను దేనినైనను ఇచ్చి సహాయముచేయ వల్లపడదని చెప్పి
నీ విచారమునకు కారణమేమని యడుగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము, అని చెప్పినప్పుడు
మేము నా బిడ్డను వంటచేసికొని తింటివిు. అయితే మరునాటియందు నేను దాని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను.
రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని యింక ప్రాకారముమీద నడిచి పోవుచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను.
తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషాయొక్క తల యీ దినమున అతనిపైన నిలిచియున్నయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను.
అయితే ఎలీషా తన యింట కూర్చునియుండగా పెద్దలును అతనితోకూడ కూర్చుండి యున్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంపబడినవాడు ఎలీషాదగ్గరకు రాకమునుపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టి యుండి, ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండ తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి;వాని యజమానుని కాళ్లచప్పుడు వానివెనుక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా
ఆ దూత అతనియొద్దకు వచ్చెను. అంతట రాజు ఈ కీడు యెహోవా వలననైనది, నేను ఇక ఎందుకు యెహోవాకొరకు కనిపెట్టి యుండవలెననెను.
అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చునదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును.
అందుకు ఎవరిచేతి మీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఆలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు నీవు కన్నులార దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను.
అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను?
పట్టణములోనికి పోవుదమనుకొంటిమా పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము; ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము; పదండి, సిరియనుల దండుపేట లోనికి, పోవుదము రండి, వారు మనలను బ్రదుకనిచ్చిన బ్రదుకుదుము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని
సందెచీకటియందు సిరియనుల దండు పేటలోనికి పోవలెనని లేచి, సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరును కనబడక పోయిరి.
యెహోవా రథముల ధ్వనియు గుఱ్ఱముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడునట్లు చేయగా వారు మనమీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చి యున్నాడని సిరియనులు ఒకరితో నొకరు చెప్పుకొని
లేచి తమ గుడారములలోనైనను గుఱ్ఱములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో నున్నవాటిలోనైనను ఏమియు తీసికొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని, సందె చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయియుండిరి.
కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి యొక గుడారము జొచ్చి భోజనపానములుచేసి, అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తికొని పోయి దాచిపెట్టి, తిరిగి వచ్చి మరియొక గుడారము జొచ్చి అచ్చటనుండి సొమ్ము ఎత్తికొని పోయి దాచిపెట్టిరి.
వారు మనము చేయునది మంచి పనికాదు, నేటిదినము శుభవర్తమానముగల దినము, మనము ఊరకొననేల? తెల్లవారువరకు మనము ఇచ్చట నుండిన యెడల ఏదైన నొక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్లి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని
వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి మేము సిరియనుల దండుపేటకు పోతివిు. అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు. కట్టబడిన గుఱ్ఱములును కట్టబడిన గాడిదలును ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరును లేరని వానితో అనగా
వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటివారితో ఆ సమాచారము తెలియజెప్పగా
రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి సిరియనులు మనకు చేసినదానిని నేను మీకు చూపింతును; మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసియున్నది గనుక వారు పట్టణములోనుండి బయటకు వచ్చినయెడల మనము వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచనచేసి, పేట విడిచి పొలములోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను.
అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మనవిచేసెను ఇంతకుముందు ఇశ్రాయేలువారలలో బహుమంది మనుష్యులు లయమై పోయిరి గదా ఇక అయిదుగురు లయమై పోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన యెడల పట్టణమందు మిగిలియున్న రౌతులలొ అయిదుగురిని తీసికొని పోనిమ్ము; మనము వారిని పంపి చూచెదమని చెప్పెను.
వారు జోడు రథములను వాటి గుఱ్ఱములను తీసికొనగా సిరియనుల సైన్యమువెనుక పోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపెను.
కాబట్టి వారు వారివెనుక యొర్దాను నదివరకు పోయి, సిరియనులు తొందరగా పోవుచు, పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి, ఆ దూతలు తిరిగివచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా
జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల యవలును అమ్మబడెను.
ఎవని చేతిమీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవజనునియొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పినప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడుచేత అతడు మరణమాయెను.
మరియు రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును, రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్ననిపిండియు, రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను.
ఆ యధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు నీవు కన్నులార చూచెదవుగాని దానిని తినకపోదువని ఆ యధిపతితో చెప్పెను.
జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను.