ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము.
వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకొనుము.
సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.
వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను
అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును.
సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు?
ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని కొంచెముసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు
అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీయొద్దకు వచ్చును. ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును.
మరియు మీరు కాలము నెరిగి , నిద్ర మేలుకొను వేళ యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసుల మైనప్పటి కంటె ఇప్పుడు , రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.
అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు.
కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.
నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు.
మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.