ఏడుదినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటిదినమున మీ యిండ్ల లోనుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని యేడవ దినము వరకు పులిసినదానిని తిను ప్రతిమనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును.
ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును; అదియు గాక మరి ఏ పనియు చేయకూడదు.
పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము నాచరింపవలెను; ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును.
మొదటి నెల పదునాలుగవదినము సాయంకాలము మొదలుకొని ఆ నెల యిరువది యొకటవదినము సాయంకాలమువరకు మీరు పులియనిరొట్టెలను తినవలెను.
ఏడు దినములు మీ యిండ్లలో పొంగినదేదియును ఉండకూడదు, పులిసినదానిని తినువాడు అన్యుడేగాని దేశములో పుట్టినవాడేగాని ఇశ్రాయేలీయుల సమాజములోనుండక కొట్టివేయబడును.
మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోను పులియనివాటినే తినవలెనని చెప్పుమనెను.
మీరు పొంగనివాటి పండుగ ఆచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగనివాటినే తినవలెను. ఏలయనగా ఆబీబు నెలలో ఐగుప్తులోనుండి మీరు బయలుదేరి వచ్చితిరి.
ఏడు దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. ఏడవ దినమున పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము.