కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచరింపవలెను.
కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను.
పులియని రొట్టెల పండుగ నాచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టిచేతులతో కనబడకూడదు.
ఆ నెల పదునయిదవ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును; ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను
పస్కా పండుగలో పొంగినదేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తుదేశములోనుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశములోనుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసికొనునట్లు, బాధను స్మరణకుతెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలెను.
నీ ప్రాంతములన్నిటిలో ఏడు దినములు పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేది సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయమువరకు మిగిలి యుండకూడదు.