నా హృదయవేదనలు అతివిస్తారములు ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము.
నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము.
అంతట యేసు వారితోకూడ గెత్సేమనే అనబడిన చోటికి వచ్చినేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి
పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను.
అప్పుడు యేసుమరణమగు నంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండు డని వారితో చెప్పి
కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.
ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచిఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా?
మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి
మరల రెండవమారు వెళ్లినా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగి పోవుట సాధ్యముకానియెడల, నీ చిత్తమే సిద్ధించు గాక అని ప్రార్థించి
తిరిగి వచ్చి, వారు మరల నిద్రిం చుట చూచెను; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను.
ఆయన వారిని మరల విడిచి వెళ్లి, ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థనచేసెను.
రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు కీడుచేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.
ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందుదురుగాక
నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. నీ రక్షణను ప్రేమించువారందరు దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక.
నేను శ్రమలపాలై దీనుడనైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నారక్షణకర్తవు నీవే యెహోవా, ఆలస్యము చేయకుమీ.