అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును
వాటి చుట్టునున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటుచేసి సిద్ధపరచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను.
మరియు యాజకులును లేవీయులును సేవచేయవలసిన వంతుల పట్టీయును, యెహోవా మందిరపు సేవనుగూర్చిన పట్టీయును, యెహోవా మందిరపు సేవోపకరణముల పట్టీయును దావీదు అతనికప్పగించెను.
మరియు ఆయా సేవాక్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటిని చేయుటకై యెత్తుప్రకారము బంగారమును, ఆయా సేవాక్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నిటిని చేయుటకై యెత్తు ప్రకారము వెండిని దావీదు అతని కప్పగించెను.
బంగారు దీపస్తంభములకును వాటి బంగారు ప్రమిదెలకును ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదెలకును కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి దీపస్తంభములలో ఒక్కొక దీపస్తంభమునకును, దాని దాని ప్రమిదెలకును కావలసినంత వెండిని యెత్తు ప్రకారముగాను,
సన్నిధిరొట్టెలు ఉంచు ఒక్కొక బల్లకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండిబల్లలకు కావలసినంత వెండిని,
ముండ్ల కొంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసినంత అచ్చ బంగారమును, బంగారు గిన్నెలలో ఒక్కొక గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను వెండి గిన్నెలలో ఒక్కొక గిన్నెకు కావలసినంత వెండిని యెత్తు ప్రకారముగాను,
ధూపపీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను, రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనముయొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతని కప్పగించెను.
ఇవియన్నియు అప్పగించి యెహోవా హస్తము నామీదికి వచ్చి యీ మచ్చుల పని యంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను.
రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము అరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై యుండెను.
పరిశుద్ధస్థలము ఎదుటనున్న ముఖమంటపము మందిరముయొక్క వెడల్పునుబట్టి యిరువది మూరల పొడవు,మందిరము ముందర అది పది మూరల వెడల్పు.