యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరునొద్ద బద్దలైపోయెను.
అహాబు కుమారుడైన అహజ్యానా సేవకులను నీ సేవకులతో కూడ ఓడలమీద పోనిమ్మని యెహోషాపాతు నడుగగా యెహోషాపాతు దానికి ఒప్పలేదు.
అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగియై మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా
యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో ఈలాగు సెలవిచ్చెను నీవులేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి యిట్లనుము ఇశ్రాయేలువారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయైన బయల్జెబూబునొద్ద మీరు విచారించబోవుచున్నారా ?
కాగా యెహోవా సెలవిచ్చునదేమనగా నీవెక్కిన మంచము మీదనుండి దిగి రాకుండ నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలీయా వారితో చెప్పి వెళ్లిపోయెను .
తరువాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి .మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారి నడుగగా
వారు ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజు నొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణచేయుటకు నీవు దూతలను పంపుచున్నావే ; నీవెక్కిన మంచముమీద నుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా
మిమ్మును ఎదుర్కొన వచ్చి యీ మాట చెప్పినవాడు ఏలాటి వాడని రాజు అడిగెను .
అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకొనినవాడని ప్రత్యుత్తరమియ్యగా ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలీయా అని అతడు చెప్పెను .
వెంటనే రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని యేబదిమందితో కూడ ఏలీయా యొద్దకు పంపెను . అతడు కొండ మీద కూర్బుని యుండగా అధిపతి యెక్కి అతని సమీపమునకు పోయి దైవ జనుడా , నీవు దిగిరావలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను .
అందుకు ఏలీయా నేను దైవ జనుడ నైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని యేబదిమందికి అధిపతియైన వానితో చెప్పగా , అగ్ని ఆకాశము నుండి దిగి వానిని వాని యేబదిమందిని దహించెను .
మరల రాజు ఏబది మందిమీద అధిపతియైన మరియొకనిని వాని యేబదిమందితోకూడ పంపగా వీడువచ్చి దైవ జనుడా ,త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను .
అందుకు ఏలీయా నేను దైవ జనుడ నైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని చెప్పగా , ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వానిని వాని యేబదిమందిని దహించెను .
ఇంకను రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని ఏబదిమందితో కూడ పంపగా ఏబదిమంది మీద అధిపతియైన ఆ మూడవవాడు వచ్చి ఏలీయా యెదుట మోకాళ్లూని దైవ జనుడా , దయచేసి నా ప్రాణమును నీదాసులైన యీ యేబదిమంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము.
చిత్తగించుము ; ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచ దశాధిపతులను ఇద్దరిని వానివాని యేబదిమందితో కూడ దహించెను ; అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా
యెహోవా దూత వానికి భయ పడక వానితోకూడ దిగిపొమ్మని ఏలీయాకు సెలవిచ్చెను గనుక అతడు లేచి వానితోకూడ రాజు నొద్దకు వచ్చెను .
అతడు వచ్చి రాజును చూచి విచారణచేయుటకు ఇశ్రాయేలు వారిమధ్య దేవుడన్న వాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణచేయుటకై దూతలను పంపితివే ; నీవెక్కిన మంచము మీదనుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పెను .