మరియు రాజైన సొలొమోనునకున్న పానపాత్రలన్నియును బంగారపువై యుండెను; లెబానోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నియు బంగారముతో చేసినవి; హీరాముయొక్క పనివారితో కూడ రాజు ఓడలు తర్షీషుకు పోయి మూడు సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, యేనుగుదంతము, కోతులు, నెమళ్లు అను సరకులతో వచ్చుచుండెను గనుక
సొలొమోను దినములలో వెండి యెన్నికకు రానిదాయెను
రాజైన సొలొమోను భూరాజులందరికంటెను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను.
మరియు సుత్తెతో కొట్టిన బంగారముతో అతడు మూడువందల కేడెములను చేయించెను; కేడెము ఒకటింటికి మూడువందల బంగారపు తులములయెత్తు బంగారముండెను; వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందుంచెను.
మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను; దీని పొడుగు నూరు మూరలు, వెడల్పు ఏబది మూరలు, ఎత్తు ముప్పది మూరలు; నాలుగు వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను.