
ఓగు రాజు దేశమైన బాషాను యావత్తును గిలాదులో మిగిలిన దానిని, అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంతటిని మనష్షే అర్ధగోత్రమున కిచ్చితిని.
మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయులయొక్కయు మాయాకాతీయు యొక్కయు సరిహద్దులవరకు అర్గోబు ప్రదేశమంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటివరకు ఆ పేర్లు వాటికున్నవి.
మాకీరీయులకు గిలాదు నిచ్చితిని.
మోషే మనష్షే అర్థగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశములచొప్పున మనష్షీయుల అర్థగోత్రమునకు స్వాస్థ్యము.
వారి సరిహద్దు మహనయీము మొదలుకొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వ రాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని అరువది పట్టణములును.
గిలాదులో సగమును, అష్తారోతు ఎద్రయియునను బాషానులో ఓగు రాజ్య పట్టణములును మనష్షే కుమారుడైన మాకీరు, అనగా మాకీరీయులలో సగముమందికి వారి వంశములచొప్పున కలిగినవి.
మనష్షే యోసేపు పెద్దకుమారుడు గనుక అతని గోత్రమునకు, అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్లవలన వంతువచ్చెను. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను.