Hits: 1057
Print
రచయిత: కె విద్యా సాగర్

గ్ర‌ంథపరిచయం; 7:1, 7:2,3, 7:4, 7:5, 7:6, 7:7, 7:8,9, 7:10-12, 7:13, 7:14-18, 7:19-21, 7:22,23, 7:24

 నిర్గమకాండము 7:1 కాగా యెహోవా మోషేతో ఇట్లనెను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని; నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును.

ముందటి అధ్యాయంలో దేవునికీ మోషేకు మధ్య జరుగుతున్న సంభాషణకు కొనసాగింపుగానే ఈ అధ్యాయం ప్రారంభమౌతుంది. ఈ వచనంలో ఆయన మోషేను ఫరోకు దేవునిగా నియమించినట్టు, అహరోను మోషేకు ప్రవక్తగా ఉండబోతున్నట్టు మనం చూస్తాం. దీనర్థం మోషే అప్పటినుండి దేవుడైపోయాడని కాదు కానీ అతను దేవుని ప్రతినిధిగా ఫరోతో వ్యవహరించి, దేవుడు చెప్పిన అద్భుతాలను చెయ్యబోతున్నాడు కాబట్టి ఆ విధంగా పోల్చబడ్డాడు. ఇక్కడినుండే ఇశ్రాయేలీయుల ప్రజల్లో దేవుని ప్రతినిధులుగా వ్యవహరించే న్యాయాధిపతులను దైవాలుగా సంబోధించే ఆనవాయితీ ప్రారంభమైంది (నిర్గమకాండము 4:16 వ్యాఖ్యానం చూడండి).

అదేవిధంగా అహరోను మోషే తరపున ప్రజలతో మాట్లాడతాడు కాబట్టి (నిర్గమకాండము 4:14:16) అతనికి ప్రవక్తగా పోల్చబడ్డాడు.

నిర్గమకాండము 7:2,3 నేను నీ కాజ్ఞాపించునది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్యవలెనని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి, ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదను.

ఈ వచనంలో దేవుడు మోషేతో అహరోను ఫరో ముందు ఏం చెప్పాలో ఆ మాటలు విన్నాక ఫరో హృదయం ఎలా కఠినపరచబడుతుందో దానికారణంగా ఐగుప్తులో ఆయన సూచక క్రియలు మహాత్కార్యాలు ఎలా విస్తరిస్తాయో వివరించడం మనం చూస్తాం. ఆయన ఫరో హృదయాన్ని కఠినపరచింది ఇశ్రాయేలీయుల పక్షంగా తీర్పు తీర్చడానికే అని అందులో ఎలాంటి అన్యాయం లేదని ఇప్పటికే నేను వివరించాను (నిర్గమకాండము 4:21 వ్యాఖ్యానం చూడండి). దానికారణంగా ఐగుప్తులో ఆయన సూచక క్రియలు, మహత్కార్యాలు కూడా విస్తరించాయి. కాబట్టి దేవుడు ఒక వ్యక్తి హృదయాన్ని కఠినపరిచేది, న్యాయబద్ధంగా అతనిపైకి రావలసిన తీర్పును రప్పించడానికేయని, దానివల్ల ఆ వ్యక్తితో పాటు ఇతరులు కూడా ఆయన ఉగ్రతను చూసి బుద్ధి తెచ్చుకుంటారని మనం గ్రహించాలి.

యెషయా 26: 9 నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.

నిర్గమకాండము 7:4 ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పులచేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెదను.

ఈ వచనంలో దేవుడు ఫరో మోషే అహరోనుల‌ మాటలను ఎలా తృణీకరించి ఇశ్రాయేలీయులను అడ్డగిస్తాడో చివరికి ఆయన తన తీర్పుల చేత వారిని ఐగుప్తునుండి ఎలా విడిపిస్తాడో మరోసారి జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. ఈమాటల కారణంగా మోషే అహరోనులతో పాటు ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా ఫరో వారిని అడ్డగించినప్పుడు నిరుత్సాహపడకుండా ధైర్యం తెచ్చుకుంటారు. ఎందుకంటే ఈమాటలను బట్టి వారిని ఐగుప్తునుండి బయటకు పంపించేది ఫరో కాదు, దేవుని తీర్పులే కాబట్టి, ఫరో వైఖరివల్ల వారు కలతచెందవలసిన అవసరం లేదు. దీనిప్రకారం విశ్వాసులమైన మనం కూడా మనుషులను బట్టి కలతచెందకుండా వాగ్దానం చేసిన దేవునిపై నమ్మకముంచాలి. అదేవిధంగా ఇక్కడ ఇశ్రాయేలీయుల సేనల గురించి చెప్పబడడం మనం చూస్తాం. సేనలు అనగా స్త్రీలు పిల్లలు వృద్ధులు కాకుండా యుద్ధం చెయ్యగలిగే పురుషులని అర్థం (నిర్గమకాండము 12:37,41).

నిర్గమకాండము 7:5 నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్యనుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.

ఈ వచనంలో దేవుడు తాను ఐగుప్తుపైకి రప్పించబోయే తీర్పులు ఐగుప్తీయులకు కూడా తనగురించి ఎలా సాక్ష్యంగా ఉండబోతున్నాయో తెలియచెయ్యడం మనం చూస్తాం. పైన జ్ఞాపకం చేసినట్టుగా ఆయన ఫరో హృదయాన్ని కఠినపరచి తన తీర్పులు కురిపించగానే అంతవరకూ ఆ ఫరో దుర్మార్గాన్ని సమర్థించిన ఐగుప్తీయులు కూడా ఆయన ఉగ్రతను చూడబోతున్నారు. ఈవిధంగా దేవుడు తన మహిమను, తన ప్రజలను విమోచించడం ద్వారా మరియు దుష్టులపైకి ఉగ్రతను కురిపించడం ద్వారా ప్రదర్శిస్తుంటాడు. సువార్త ప్రకటనలో కూడా ఇదే జరుగుతుంది. దానివల్ల రక్షణకు పాత్రులుగా నిర్ణయించబడినవారు ఆ రక్షణలోకి ప్రవేశించి ఆయన కృపను చూడబోతుంటే (అపో.కార్యములు 13:48) ఉగ్రతకు పాత్రులుగా నిర్ణయించబడినవారు ఆ సువార్తను తిరస్కరించి ఆయన న్యాయాన్ని చూడబోతున్నారు (2కొరింథీ 2:15,16). ఈ ఇరుపక్షాల ప్రజలూ ఒకరు దేవుని కృపను చూస్తుంటే మరొకరు ఆయన ఉగ్రతను చూస్తున్నారు. కాబట్టి తీర్పురోజున ఎవరూ కూడా ఆయనలో ఏదోఒక గుణలక్షణాన్ని రుచిచూడకుండా ఉండబోరు. దీనిని మనసులో పెట్టుకుని మనం సువార్త ప్రకటించినప్పుడు దానిని విన్నవారు అందరూ విశ్వసించేస్తారనే అపోహకు గురికాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఐగుప్తీయులు ఆయన చేసిన సూచకక్రియలను చూసి కూడా రక్షణలోకి రాలేదు కానీ ఉగ్రతకే గురయ్యారు.

నిర్గమకాండము 7:6 మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, ఆలాగుననే చేసిరి.

ఈవచనంలో మోషే అహరోనులు ఇప్పటివరకూ దేవుడు తమతో చెప్పినదాని ప్రకారంగా చేసినట్టు నొక్కిచెప్పడం మనం చూస్తాం. ఎందుకంటే ఈ సందర్భం తర్వాత వారు ఫరో వైఖరిని బట్టి గతంలో చేసినట్టు ఎలాంటి ఫిర్యాదులూ చెయ్యలేదు, ఆయనను ఎదిరించలేదు.

కీర్తనలు 105:26-28 ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను. వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను హాముదేశములో మహత్కార్యములను జరిగించిరి ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెను వారు ఆయన మాటను ఎదిరింపలేదు.

నిర్గమకాండము 7:7 వారు ఫరోతో మాటలాడినప్పుడు మోషేకు ఎనుబదియేండ్లు, అహరోనుకు ఎనుబది మూడు ఏండ్లు.

ఈ వచనంలో ఫరో అహరోనుల వయస్సును మనం చూస్తాం. దీనిప్రకారం మోషే అహరోనుకంటే మూడేళ్ళచిన్నవాడు. మిర్యాము (నిర్గమకాండము15:20) వీరిద్దరికంటే పెద్దది. అందుకే మోషే నదిలో విడిచిపెట్టబడినప్పుడు ఆమె కీలకమైన పాత్ర పోషించింది. ఇక్కడ మనం గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యోసేపు ఫరోముందు నిలబడినప్పుడు 30 సంవత్సరాల యువకుడు (ఆదికాండము 41:46) మోషే ఫరో ముందు నిలబడినప్పుడు 80 సంవత్సరాల ముసలివాడు. అయినప్పటికీ వయసుతో సంబంధం లేకుండా దేవుడు వీరిద్దరికీ ప్రాముఖ్యమైన బాధ్యతలు అప్పగించాడు. మోషే కూడా దేవుడు తనను ఐగుప్తుకు వెళ్ళమన్నప్పుడు తన వయస్సును అభ్యంతరంగా ప్రస్తావించలేదు. మనం కూడా దేవునిపనిలో వయస్సును‌ బట్టి వెనుకడుగు వెయ్యకుండా శక్తి ఉన్నంతవరకూ ముందుకు సాగాలి.

నిర్గమకాండము 7:8,9 మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెనుఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కఱ్ఱను పట్టుకొని ఫరో యెదుట దాని పడ వేయుమనుము; అది సర్పమగును.

ఈ వచనాలలో దేవుడు మోషే అహరోనులను ఫరో ఏవిధంగా ప్రశ్నిస్తాడో అప్పుడు వారు ఏం చెయ్యాలో వివరించడం మనం చూస్తాం. క్రింది వచనాలలో ఫరో అలా అడిగినట్టుగా మనకు కనిపించనప్పటికీ ఇక్కడ దేవుడు చెబుతున్నదాని ప్రకారం అతను అడిగాకనే మోషే అహరోనులు తమ కఱ్ఱను సర్పంగా మార్చారు. ఎందుకంటే మోషే అహరోనులు చెబుతున్నవి అబద్ధమని రుజువు చెయ్యడానికైనా ఫరో అలాంటి సూచనను అడుగుతాడు.

నిర్గమకాండము 7:10-12 కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమ కాజ్ఞా పించినట్లు చేసిరి. అహరోను ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పడవేయగానే అది సర్ప మాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రుకూడ తమ మంత్రములచేత ఆలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కఱ్ఱను పడవేసినప్పుడు అది సర్పమాయెనుగాని అహరోను కఱ్ఱ వారి కఱ్ఱలను మింగివేయగా-

ఈ వచనాలలో మోషే అహరోనులు దేవుడు తమకు ఆజ్ఞాపించినట్టుగా ఫరోముందు తమ కఱ్ఱను సర్పంగా మార్చడం, ఐగుప్తు మాంత్రికులు కూడా అలానే చేసినప్పుడు అహరోను కఱ్ఱ వారి కఱ్ఱలను మింగివెయ్యడం మనం చూస్తాం. జోనాథాన్ టార్గం ప్రకారం ఇక్కడ మోషే అహరోనులకు వ్యతిరేకంగా మంత్ర విద్యను ప్రదర్శించింది యన్నే యంబ్రే అనే పేరు గలవారు. పౌలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు (2 తిమోతికి 3: 8). వీరిద్దరూ ఐగుప్తు మాంత్రికులలో ప్రధానులై ఉంటారు.

అయితే ఇక్కడ వారి కఱ్ఱలను మోషే కఱ్ఱ మింగివెయ్యడం ద్వారా వారు మోషేముందు ఓడిపోయారు. ఎందుకంటే వారు మోషే చేసినట్టుగా తమ కఱ్ఱలను సర్పాలుగా మార్చినప్పటికీ అవి మోషే కఱ్ఱ ద్వారా మింగివెయ్యబడడాన్ని బట్టి వారు మోషే కంటే శక్తిహీనులని, వారు చేసిన అద్భుతం మోషేతో సమానమైనది కాదని రుజువౌతుంది. అందుకే పౌలు వారి గురించి "అయినను వారి అవివేకమేలాగు తేటపడెనో ఆలాగే వీరిది కూడ అందరికి తేటపడును గనుక వీరు ఇకముందుకు సాగరు" (2 తిమోతికి 3: 9) అని అంటున్నాడు.

జరిగిన ఈ సంఘటనలో మనం మరో ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. సృష్టికర్త దేవుడు మాత్రమే. నిర్జీవమైనదానినుంచి జీవాన్ని పుట్టించడం కేవలం ఆయనకు మాత్రమే సాధ్యమౌతుంది. సాతానుడు సృష్టిని వాడుకోగలడు కానీ కొత్త సృష్టిని సృష్టించలేడు. దీనిప్రకారం మోషే అహరోనులు తమ కఱ్ఱను నేలనపడవేసినప్పుడు అది దేవునిశక్తిని బట్టి నిజమైన సర్పంగానే (జీవంగలదిగా) మార్చబడింది. కానీ ఐగుప్తు మంత్రగాళ్ళు తమ కఱ్ఱలను నేలనపడవేసినప్పుడు వారు ఏ దురాత్మ (సాతాను) ద్వారా అయితే అద్భుతాలను చేస్తున్నారో ఆ దురాత్మ వారి కఱ్ఱలను తొలగించి, ఆ స్థానంలో అప్పటికే ఉనికిలో ఉన్న సర్పాలను ప్రత్యక్షం చేసింది. అంతేతప్ప వారి కఱ్ఱలు సర్పాలుగా మారిపోలేదు.

నిర్గమకాండము 7:13 యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయెను.

ఈ వచనంలో దేవుడు ముందే చెప్పినట్టుగా ఫరో హృదయం కఠినపరచబడి, తనదగ్గరున్న మంత్రగాళ్ళకంటే మోషే చేసిన అద్భుతం గొప్పదని గ్రహించకుండా వారిమాట వినకుండా ఉండడం మనం చూస్తాం. ఇది దేవుని ఉగ్రతకు లోనై, కఠినపరచబడినవారికి ఉండే లక్షణంగా మనం అర్థం చేసుకోవాలి. వీరు తమ‌ కళ్ళతో దేవుని అద్భుతాన్ని చూసినప్పటికీ ఆయనను విశ్వసించడానికి అవసరమైన ఆధారాలన్నీ లభ్యమైనప్పటికీ కూడా తమ పాపాలను విడిచి మారుమనస్సు పొందలేరు‌. ఎందుకంటే అప్పటికే దేవుడు వీరి లెక్కముగించి ఉగ్రతకు లోనయ్యేలా వదిలేసాడు. హేరోదు విషయంలో కూడా మనం ఇలాంటి కఠినత్వాన్నే చూస్తాం. అతను ప్రవచనాలను బట్టి మెస్సీయ ఎక్కడ పుడతాడో గ్రహించాడు కానీ‌ ఆయనను మెస్సీయగా అంగీకరించి పూజించలేకపోయాడు‌.

యెషయా 26: 10 దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మాహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు.

నిర్గమకాండము 7:14-18 తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనియ్యనొల్లడాయెను ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్లుము, ఇదిగో అతడు ఏటిదరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటియొడ్డున నిలిచి పాముగా చేయబడిన కఱ్ఱను చేతపట్టుకొని అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకుగాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇదివరకు వినకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీనిబట్టి నీవు తెలిసి కొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న యీ కఱ్ఱతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపుకొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను.

ఈ వచనాలలో దేవుడు మోషేతో ఏటి దగ్గరకు వెళ్ళిన ఫరో వద్దకు వెళ్ళి ఆ ఏటిని రక్తంగా మార్చబోతున్నట్టుగా ప్రకటించమనడం మనం చూస్తాం. ఇంగ్లీష్ బైబిల్ 25వ వచనంలో ఈ ఏటి (నది) పేరు నైలునదిగా గమనిస్తాం. ఐగుప్తులో ఉన్న నది అదే. అందుకే ఐగుప్తు నాగరికతను నైలునది‌ నాగరికత అంటారు. ఇక ఈ నైలునది గురించి మనం పరిశీలిస్తే ఇది మిగిలిన నదులతో పోలిస్తే చాలా మధురమైన నీరుగలదని చాలామంది అభిప్రాయపడతారు. ఐగుప్తీయులైతే ఈ నదిని చాలా పవిత్రమైనదిగా భావించి, "నైలస్" అనే దేవతను ఈ నదీ దేవతగా పూజించేవారు. అందుకే దేవుడు ఐగుప్తీయుల దేవతలపై తీర్పు తీర్చే క్రమంలో (నిర్గమకాండము 12:12, సంఖ్యాకాండము 33:4) మొదటిగా ఈ నైలునదిని రక్తంగా మార్చబోతున్నాడు. దీనివల్ల ఐగుప్తీయులు ఇంతకాలం తాము దేవతలుగా పూజించినవారిలో ఎలాంటి శక్తీ లేదని, ఒకవేళ ఉన్నప్పటికీ యెహోవా శక్తిముందు వారు ఏమీ చెయ్యలేరని బాగా గ్రహిస్తారు.

అదేవిధంగా ఇక్కడ దేవుడు నైలునదిని రక్తంగా మార్చడం ద్వారా ఫరో ఏ నదిలో ఐతే ఇశ్రాయేలీయుల మగపిల్లలను పడవేయించి క్రూరంగా చంపించాడో ఆ నది ద్వారానే ఐగుప్తీయులపై ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయుల మగపిల్లల వధను‌బట్టి జరుగుతున్న ప్రతీకారానికీ తన సేవకుల హత్యలను బట్టి రాకడలో జరగబోతున్న ప్రతీకారానికీ మనం పోలికను చూడవచ్చు.

ప్రకటన 16: 5 అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తముమ వారు కార్చినందుకు తీర్పుతీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి.

నిర్గమకాండము 7:19-21 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనుతో నీకఱ్ఱను పట్టుకొని ఐగుప్తు జలములమీద, అనగా వారి నదులమీదను వారి కాలువలమీదను, వారి చెరువుల మీదను, వారి నీటిగుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము; అవి రక్తమగును; ఐగుప్తు దేశమందంతటను మ్రానుపాత్రలలోను రాతిపాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పైకెత్తి ఏటినీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నియు రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపుకొట్టెను, ఐగుప్తీయులు ఏటినీళ్లు త్రాగలేక పోయిరి, ఐగుప్తుదేశమం దంతట రక్తము ఉండెను.

ఈ వచనాలలో దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మోషే అహరోనులు నైలునదితో పాటు, దాని శాఖలైన కాలువలనూ చెరువులనూ రక్తంగా మార్చడం, ఆ ప్రభావం ఐగుప్తీయులు అప్పటికే పాత్రలలో నిల్వ చేసుకున్న నీటిపై కూడా పడడం మనం చూస్తాం. అయితే ఇదంతా ఒకే సమయంలో జరిగిపోయినట్టుగా మనం‌ భావించకూడదు, మోషే అహరోనులు మొదటిగా ఫరో నిలిచియున్న నైలునదిని రక్తంగా మార్చారు, తర్వాత వారి కాలువలు, చెరువులు, పాత్రలలో నిల్వచెయ్యబడిన నీరు కూడా అహరోను చెయ్యిచాపగానే క్రమక్రమంగా రక్తంగా మారిపోయాయి.

అదేవిధంగా ఇక్కడ ఐగుప్తు నదులన్నీ రక్తంగా మార్చబడడం వల్ల, ఆ నదులలో ఉండే చేపలు కూడా చనిపోవడం మనం చూస్తాం. దీనివల్ల ఐగుప్తీయులు నీటిపరంగానే కాదు, ఆహారపరంగా కూడా చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఎందుకంటే ఐగుప్తీయులు ఎక్కువగా తినేవాటిలో చేపలు ఒకటి (సంఖ్యాకాండము 11:5). వారు నీటి సమస్యను ఎదుర్కోవడానికి క్రింది వచనాల ప్రకారం ఏటిపక్కల బావులను తవ్వుకున్నప్పటికీ తర్వాత ఆ నదులన్నీ మామూలు స్థితికి చేరినప్పటికీ చనిపోయిన చేపల లోటుమాత్రం వారికి అంత సులభంగా (తొందరగా) భర్తీ కానేరదు.

 నిర్గమకాండము 7:22,23 ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ‌మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన యింటికి వెళ్లెను.

ఈ వచనాలలో ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రాలచేత నీటిని రక్తంగా మార్చినట్టు, ఫరో ఇవేమీ పట్టించుకోకుండా తన ఇంటికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. ఇక్కడ మోషే అహరోనులు అప్పటికే ఐగుప్తులో ఉన్న నీటినంతా రక్తంగా మార్చేస్తే ఈ శకునగాండ్రు ఏ నీటిని రక్తంగా మార్చారు అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే పైన వివరించినట్టు మోషే అహరోనులు ఐగుప్తులో ఉన్న మొత్తం నదులను ఒకేసారి రక్తంగా మార్చలేదు. మొదట నైలునదిని మార్చాక మిగిలినవి కూడా అహరోను చెయ్యి చాపగా‌నే క్రమక్రమంగా రక్తంగా మారాయి. అందుకే ఇక్కడ ఐగుప్తు శకునగాండ్రు కూడా అప్పటికి తమకు అందుబాటులో ఉన్న మంచినీటిని రక్తంగా మార్చిచూపించారు.

అయితే వీరికి ఈ శక్తి ఎక్కడినుంచి వచ్చిందని మనం పరిశీలించినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఆ దేవుని నుంచి ప్రజలను వైదొలగించేలా అపవాదే ఇలాంటి అద్భుతాలను చేస్తాడని/తన సేవకుల ద్వారా చేయిస్తాడని మనకు స్పష్టమౌతుంది. ఇవి నాశనానికి నిర్ణయించబడినవారు అపవాదినే తమ దేవునిగా వెంబడించి, నిత్యనాశనానికి పోయేలా చెయ్యడమే కాకుండా దేవుని ప్రజలకు ఒక పరీక్షగా కూడా ఉంటుంటాయి. అందుకే దేవుడు; అపవాది అలాంటి క్రియలను చేసేలా అనుమతించాడు (ద్వితీయోపదేశకాండము 13:1-3, మత్తయి 24: 24, ప్రకటన 16:13,14, 2 థెస్సలొనీక 2:9-12).  

అదేవిధంగా ఫరో జరిగిందేదీ మనసులో పెట్టుకోకుండా నిశ్చింతగా తన ఇంటికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. పైన జ్ఞాపకం చేసినట్టు ఇది కఠినహృదయులకు ఉండే లక్షణం (కీర్తనలు 28: 5, యెషయా 26:11).

దీనిని మనస్సులో పెట్టుకుని, ఈరోజు దేవుని సువార్తకు, ఆయన మాటలకు విధేయులమైన మనమందరమూ ఆయనకు ఎంతగానో కృతజ్ఞతచూపేవారిగా ఉండాలి. ఒకవేళ ఆయన ఫరో హృదయాన్ని కఠినపరిచినట్టుగా మన పాపాలను బట్టి మనల్ని కూడా కఠినపరచియుంటే మనమూ ఫరోలానే ప్రవర్తించి నిత్యనాశనానికి పోయేవారం. అందుకే మన రక్షణకు కారణం కేవలం మన దేవుడు మాత్రమే. 

ఎఫెసీయులకు 2: 8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.
 
అయితే ఈరోజు కొందరు ఆయన ఫరో‌ హృదయాన్ని కఠినపరచకుంటే అతను కూడా మారేవాడుగా ఏశావును ద్వేషించకుంటే అతనూ మార్పుచెందేవాడుగా అంటూ దేవుని సార్వభౌమత్వానికి (చిత్తానుసారమైన నిర్ణయానికి ఎఫెసీ 1:12) విరుద్ధంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రశ్నలకు  ఇప్పటికే నేను వివరణ ఇచ్చాను. 

రక్షణ యెహోవాదే

నిర్గమకాండము 4:21 వ్యాఖ్యానం

కానీ ఇలా ప్రశ్నించేవారు నిజంగా విశ్వాసులైతే ఫరో సంగతి, ఏశావు సంగతి, ఇతర అవిశ్వాసుల సంగతిప్రక్కన పెట్టి తమను అలా వదిలెయ్యకుండా రక్షించుకున్న దేవుణ్ణి ఎంతగానో స్తుతించేవారు, ప్రేమించేవారు. ఎందుకంటే ఇక్కడ న్యాయబద్ధమైన ప్రశ్న వారినెందుకు విసర్జించావు, కఠినపరిచావు అని కాదు, నన్నెందుకు ఎన్నుకున్నావు, నన్నెందుకు రక్షించుకున్నావు అన్నదే. 
 
రోమీయులకు 9:15‌ అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును. 
 
కీర్తనలు 103:1,2,3 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.
 
ప్రకటన 7:9,10‌ అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్తృములు ధరించు కొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్లయెదుటను నిలువబడి. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును "మా రక్షణకై స్తోత్రమని" మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. 
 

నిర్గమకాండము 7:24 అయితే ఐగుప్తీయులందరు ఏటినీళ్లు త్రాగలేక త్రాగు నీళ్లకొరకు ఏటిప్రక్కలను త్రవ్విరి.

ఈ వచనంలో ఐగుప్తీయులందరూ రక్తంగా మార్చబడిన నైలునది నీరు త్రాగలేక ఆ నదిప్రక్కన (బావులను) త్రవ్వడం మనం చూస్తాం. ఈ వచనంలో దానిగురించి ప్రత్యేకంగా రాయబడడాన్ని బట్టి వారు ఆ నదిపక్కన తవ్వినప్పుడు మంచి నీటిని పొందుకున్నారని మనం భావించవచ్చు‌‌. అయితే ఏ నది అయినా కలుషితమైనప్పుడు దానిపక్కన తవ్వినా కూడా ఆ నీరే లభ్యమౌతుంది తప్ప మంచినీరు రాదు‌. ఎందుకంటే ఆ ఊట ఆ నదినుండే వస్తుంది. కానీ ఇక్కడ ఐగుప్తీయులకు రక్తంగా మార్చబడిన నైలునదిపక్కన మంచినీరు లభిస్తుంటే అది దేవుని కార్యంగానే మనం భావించాలి. ఐగుప్తీయులు చూడవలసిన దేవునితీర్పులు ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి వారు నీరులేక చావకుండా ఆయనే ఆ విధంగా కార్యం చేసాడు. కాబట్టి దుష్టులకు ఆయుష్షు పెరుగుతున్నప్పుడు వారు ఈలోకంలో ఇంకా అనుభవించవలసిన దేవుని తీర్పులను రుచిచూడడానికే అని మనం అర్థం చేసుకోవాలి.

తెలుగు బైబిల్ Appలో ఈ అధ్యాయపు 25వ వచనం అయితే "యెహోవా ఏటిని కొట్టి యేడు దినములైన" అంటూ అసంపూర్ణంగా ఉంది. BSI ప్రింటెడ్ బైబిల్ లో అయితే అసలు అది కూడా లేకుండా 24వ వచనంతోనే ముగిసిపోతుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్ లో చూసినప్పుడు "seven full days passed after The Lord had struck the Nile" అని ఉంటుంది. తెలుగు వాడుక బాష అనువాదంలో కూడా ఈ వచనాన్ని అలానే చూస్తాం. "యెహోవా నదిని కొట్టి ఏడు రోజులయ్యాయి" (నిర్గమకాండం 7:4, 25). BSI ప్రింటెడ్ బైబిల్ లో ఈమాటలు 8అధ్యాయం మొదటి వచనంలో ప్రారంభమౌతాయి. ఇలాంటి మార్పులకు కారణమేంటంటే దేవుడు తన పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిల్ గ్రంథాన్ని రాయించినప్పుడు అధ్యాయాలుగా వచనాలుగా విభజించబడలేదు. విషయం అంతా వరుసగా రాయబడింది. తర్వాత కాలంలో బైబిళ్ళు తర్జుమా/ప్రింట్ చెయ్యబడుతున్నప్పుడు మన సౌలభ్యం కోసం, అధ్యాయాలుగా వచనాలుగా విభజించారు. అప్పుడే ఇలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే విషయమైతే కోల్పోబడలేదని మనం గమనించాలి.