Hits: 918
Print
రచయిత: కె విద్యా సాగర్

గ్ర‌ంథపరిచయం; 6:1, 6:2,3, 6:4, 6:5 , 6:6-8, 6:9, 6:10,11, 6:12, 6:13, 6:14-25, 6:26,27, 6:28-30

నిర్గమకాండము 6:1 అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోవు చున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు; బలమైన హస్తముచేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశములోనుండి వారిని తోలివేయునని మోషేతో అనెను.

గత అధ్యాయంలో మోషే చేసిన ప్రార్థనకు జవాబునే ఈ వచనంలో మనం చూస్తాం‌. "బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును" అన్నప్పుడు, ఆయన ఐగుప్తుపైకి రప్పించబోయే తెగుళ్ళ‌ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఐగుప్తీయుల తొలిచూలు పిల్లల వధ‌ తర్వాత ఇది నెరవేరింది (నిర్గమకాండము 12:31-33).

అదేవిధంగా గత అధ్యాయంలో మోషే అహరోనులు ఫరోతో మాట్లాడినప్పుడు అతడు ఇశ్రాయేలీయులపై మరింత భారంమోపి, వారికి శ్రమ కలిగేలా చేసాడు. ఆ వెంటనే ఇక్కడ దేవుడు ఐగుప్తీయులకు కలుగబోయే తీర్పునూ ఇశ్రాయేలీయులకు కలుగబోయే విడుదలను ప్రకటిస్తున్నాడు. దీనినిబట్టి తన పిల్లలకు శ్రమ అధికమైనప్పుడు దేవుడు దానిని అవకాశంగా తీసుకుని తన కార్యాన్ని నెరవేరుస్తాడని మనం విశ్వసించాలి. ఈ విధంగా సంఘానికి కలుగబోయే మహా శ్రమలు కూడా ఆయన రాకడ సమీపంగా ఉందని బోధిస్తున్నాయి.

నిర్గమకాండము 6:2,3 మరియు దేవుడు మోషేతో ఇట్లనెనునేనే యెహోవాను; నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు.

ఈ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ "నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదని" పలకడం మనం చూస్తాం. కానీ యెహోవా అనే నామం భక్తులకు ప్రారంభం నుండీ తెలిసినట్టు లేఖనాలు మనకు సాక్ష్యమిస్తున్నాయి (ఆదికాండము 4: 26, ఆదికాండము 12:8, ఆదికాండము 21: 33, ఆదికాండము 28: 16).

ఈ వాక్యభాగాలను పరిశీలించినప్పుడు బైబిల్ చరిత్ర ప్రారంభమైన ఎనోషను దగ్గర నుండి, అబ్రాహాము‌ యాకోబులకు సహా యెహోవా అనే నామం తెలిసినట్టు అర్థమౌతుంది. మరి దేవుడు‌ మోషేతో ఎందుకలా మాట్లాడుతున్నట్టు? ఎందుకంటే; బైబిల్ గ్రంథంలో మనం "యెహోవా నామము" అన్నప్పుడు, దానిని అన్ని సందర్భాల్లోనూ పేరు (sound) గా భావించకూడదు.

ఉదాహరణకు;
నిర్గమకాండము 34:5 మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను.

ఈ సందర్భంలో దేవుడు మేఘములో దిగి మోషేకు యెహోవా అనే తన నామాన్ని ప్రకటించినట్టు రాయబడింది. అయితే అప్పటికే మోషేకు యెహోవా అనే నామం తెలుసు. మరి తెలిసిన నామాన్నే ఆయన మరలా ఎందుకు ప్రకటిస్తున్నట్టు? అందుకే ఆ క్రింది వచనాలను మనం పరిశీలించినప్పుడు, ఆయన తన గుణలక్షణాలను అతనికి ప్రకటిస్తున్నట్టు రాయబడింది (నిర్గమకాండము 34:6,7).

మరో సందర్భాన్ని చూడండి;

యోహాను 17:26 నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసెదనని చెప్పెను.

ఈ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు దేవుని నామాన్ని తెలియచేసానని ప్రార్థిస్తున్నాడు, పైగా ఇంకా తెలియచేస్తాను అంటున్నాడు. యేసుక్రీస్తు గురించి బైబిల్ లో రాయబడినంతమట్టుకు ఆయన ఎక్కడా కూడా యెహోవా అనే పేరును ప్రకటించలేదు. ఎందుకంటే ఆయన కాలానికి యూదులు "యెహోవా అనే నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదన్న ఆజ్ఞను దృష్టిలో పెట్టుకుని" (ద్వితీయోపదేశకాండము 5:11) ఆ పేరును ఉపయోగించడం మానేసారు. దానికి బదులు వారు దేవుణ్ణి "ఏలోహీం, అదోనాయ్" (ప్రభువు) అని పిలిచేవారు. శిష్యులకు ఈ చరిత్ర గురించీ యెహోవా అనే పేరు గురించీ బాగా తెలుసు. మరి యేసుక్రీస్తు తన శిష్యులకు ప్రకటించిన తండ్రి నామం ఏంటి? ఆయన తన పరిచర్యలో తండ్రియొక్క గుణ లక్షణాలను తన శిష్యులకూ ప్రజలకూ నిర్విరామంగా ప్రకటించాడు. ఆ గుణలక్షణాలనే ఆయన తన ప్రార్థనలో తండ్రి నామంగా ప్రస్తావించాడు.

ఈ రెండు ఆధారాలను బట్టి, దేవుని నామము అన్నప్పుడు ఆయన గుణలక్షణాలను కూడా తెలియచేస్తుందని అర్థమౌతుంది. ఇప్పుడు దీనిని దృష్టిలో పెట్టుకుని, ఆయన మోషేతో నీ పితరులకు "యెహోవా అనే నా నామం తెలియబడలేదని" పలికిన మాటలను ఆలోచిస్తే యెహోవా అనే నామానికి ఉన్నవాడని మరియు మాట ఇచ్చి నెరవేర్చేవాడని అర్థం.

యిర్మీయా 33:2 మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించినవాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు .

ఆయన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైనప్పుడు సర్వశక్తిమంతుడిగా వారి సంతానానికి కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేసాడు. కానీ ఆ నెరవేర్పును (మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా) వారు చూడలేదు. దానిని కేవలం మోషే/అతని తరం వారు‌ మాత్రమే చూస్తున్నారు. దీని గురించే ఆయన మోషేతో యెహోవా అనే నా నామం (మాట ఇచ్చి నెరవేర్చువాడను) వారికి తెలియబడలేదని ఆ సందర్భంలో చెబుతున్నాడు.

నిర్గమకాండము 6:4 మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనానుదేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని.

ఈ వచనంలో దేవుడు అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు కనాను దేశం గురించి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. ఇక్కడ "వారికిచ్చుటకు" అన్నప్పుడు, వారి సంతానానికి స్వాధీనం చెయ్యబడడం గురించి చెప్పబడుతుంది. ఎందుకంటే ఇది జరిగే సమయానికి అబ్రాహాము ఇస్సాకు యాకోబులు జీవించిలేరు, వారి సంతానం మాత్రమే ఆ భూమిని స్వాధీనపరచుకుంది. ఇలా జరుగుతుందని దేవుడు అబ్రాహాముకు ముందే తెలియచేసాడు (ఆదికాండము 15:16). ఈ వివరణ ఎందుకు ఇస్తున్నానంటే లేఖన సారాంశంపై కానీ లేఖనాలలో వాడబడిన బాషపై కానీ అవగాహన లేని కొందరు, ఆయన అబ్రాహాముకు ఆ భూమిని స్వాస్థ్యంగా ఇస్తున్నట్టు రాయబడిన మాటలనూ (ఆదికాండము 17:8) మరలా వారు ఆ దేశంలో పరదేశులుగానే జీవించారని రాయబడినమాటలనూ (అపో. కార్యములు 7:5) ప్రస్తావించి ఇక్కడ వైరుధ్యముందని ఆరోపిస్తుంటారు. కానీ అబ్రాహాము యాకోబులకు కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తున్నానని ఆయన ప్రకటించిన అవే సందర్భాలలో అది వారికి కాదు కానీ అది వారి సంతానానికే స్వాధీనం చెయ్యబడుతుందని కూడా వివరించబడింది (ఆదికాండము 15:16). కాబట్టి ఇక్కడ అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను అన్నప్పుడు "అది ప్రమాణం చెయ్యడంగా", "వారి సంతానం ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్నప్పుడు ఆ ప్రమాణం నెరవేర్చడంగా" అర్థం చేసుకోవాలి. ఈ విషయం అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు అర్థమైంది‌ కాబట్టే కనాను దేశంలో పరదేశులుగా జీవించారు (హెబ్రీ 11:9,13). ఆ భూమిని తాము కాదు తమ సంతానం మాత్రమే స్వాధీనం చేసుకుంటుందని ఆలోచించారు (ఆదికాండము 28:3,4). అందుకే తమ భార్యలు చనిపోయినప్పుడు వారిని పాతిపెట్టడానికి కూడా ఆ భూమిని వెలపెట్టి కొనుక్కున్నారు (ఆదికాండము 23).

నిర్గమకాండము 6:5 ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకముచేసికొని యున్నాను.

ఈ వచనంలో దేవుడు ఇశ్రాయేలీయుల మూలుగును విని అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నానని పలకడం మనం చూస్తాం. 2వ అధ్యాయం‌ 24,25 వచనాలలో వివరించినట్టుగా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంటే అప్పటివరకూ మరచిపోయాడని కాదు కానీ ఇది వారి విడుదలకు నిర్ణయించిన సమయం కాబట్టి (ఆదికాండము 15:16) (ఆదికాండము 8:1 వ్యాఖ్యానం కూడా చూడండి).

నిర్గమకాండము 6:6-8 కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుమునేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి మిమ్మును విడిపించి, మిమ్మును నాకు ప్రజ లగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రిందనుండి మిమ్మును వెలుపలికి రప్పిం చిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసి కొందురు. నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చెదనని చెయ్యి యెత్తి ప్రమాణముచేసిన దేశము లోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను; నేను యెహోవానని చెప్పుమనగా-

ఈ వచనంలో దేవుడు అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధన ప్రకారం, ఇశ్రాయేలీయులకు కలగచెయ్యబోయే విడుదల గురించి వివరించడం మనం‌ చూస్తాం. ఇక్కడ ఆయన "నేనే యెహోవాను" అని ఎందుకు అంటున్నాడంటే రెండు మూడు వచనాలలో వివరించినట్టుగా ఆ పేరుకు ఉన్న గుణాన్ని (మాట ఇచ్చి నెరవేర్చువాడు) ఇప్పుడు ఇశ్రాయేలీయులు చూడబోతున్నారు. అందుకే ఆ పేరును నొక్కి చెబుతున్నాడు.

అదేవిధంగా ఆయన ఇక్కడ "మిమ్మును నాకు ప్రజలగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును" అని పలకడంలో ఇంతవరకూ ఆయన వారికి‌ అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధనను బట్టి దేవునిగా ఉన్నాడు‌ కానీ ఇప్పుడు వారు ఐగుప్తు నుండి విడిపించబడ్డాక (మిమ్మును విడిపించి) సీనాయి కొండపై ఆయన చెయ్యబోయే నిబంధనను (ధర్మశాస్త్రం) బట్టి దేవునిగా ఉంటానని అర్థం.

ద్వితీయోపదేశకాండము 5:2,3 మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధనచేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే యీ నిబంధన చేసెను.

కాబట్టి ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. విశ్వాసులైన మన తల్లితండ్రులను బట్టి మనకు లభించే ఆశీర్వాదంతోనే సరిపెట్టుకోకుండా వ్యక్తిగతంగా ఆయనను దేవునిగా అంగీకరించి, మరిన్ని ఆశీర్వాదాలను పొందుకోవాలి. ఆయనను దేవునిగా అంగీకరించడమంటే ఆయన ఆజ్ఞలను‌ గైకొంటూ విధేయులుగా జీవించడమని లేఖన సారాంశం మనకు సాక్ష్యమిస్తుంది.

నిర్గమకాండము 6:9 మోషే ఇశ్రాయేలీయులతో ఆలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమునుబట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి.

ఈ వచనంలో మోషే, దేవుడు తనకు సెలవిచ్చిన మాటలను‌ ఇశ్రాయేలీయులకు వివరించినప్పుడు వారు "మనోవ్యాకులమునుబట్టియు కఠిన దాసత్వమును బట్టియు" అతని‌ మాటలు వినకుండా ఉన్నట్టు మనం చూస్తాం. ఇక్కడ వీరి వైఖరి, యేసుక్రీస్తు చెప్పిన విత్తువాని ఉపమానంలో రాతి నేల‌వలే ఉంది (మత్తయి 13: 20,21). ఎందుకంటే ప్రారంభంలో‌ మోషే ఐగుప్తుకు‌ వచ్చి దేవుడు తనతో చెప్పిన‌ విడుదల గురించి ప్రకటించినప్పుడు ఈ ఇశ్రాయేలీయులంతా ఎంతో సంతోషపడి ఆయనకు నమస్కారం‌ చేసారు (నిర్గమకాండము 4:31). కానీ ఫరో వీరి భారాన్ని అధికం‌ చెయ్యగానే అదంతా మరచిపోయి, ఇక దేవునిమాటలు వినలేని‌ స్థితికి చేరుకున్నారు. ఇక్కడ దేవునిపట్ల వీరికున్న విశ్వాసం సరైనదిగా అనిపించడం లేదు, ఎందుకంటే నిజమైన విశ్వాసం శ్రమల్లో క్షీణించిపోదు కానీ శ్రమలకు నిలిచినదై మరింతగా వర్థిల్లుతుంది (1 పేతురు 1: 7).

కాబట్టి ఒక నిజమైన విశ్వాసి శ్రమలగుండా వెళ్తున్నప్పుడు దేవునిమాటలకు విముఖత చూపించడు కానీ ఆ దేవునిమాటలపై మరింత ఆపేక్ష కలిగి ఎదురుచూస్తాడు. అందుకే యోబుకు శ్రమకలిగినప్పుడు అతను దేవునిమాటల కోసం‌ ఎదురు చూసాడు, దావీదుకు శ్రమ‌కలిగినప్పుడు కీర్తనలు రాసాను. దీనిని బట్టి శ్రమల్లో మనం‌ ఎలాంటి స్థితిలో ఉంటున్నామో పరీక్షించుకోవాలి. హెబ్రీ సంఘానికి శ్రమకలిగినప్పుడు వారు కూడా తమ పితరులైన ఇశ్రాయేలీయులవలే దేవుని మాటలకు విముఖత చూపించారు, ఆ విషయంలో హెచ్చరిస్తూనే హెబ్రీ పత్రిక రాయబడింది.

హెబ్రీయులకు 3:12 సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి.

ఈమాటల ప్రకారం, శ్రమల్లో దేవునికి దూరమవ్వడం లేదా ఆయన మాటలకు విముఖత చూపించడం విశ్వాసం‌లేని దుష్టహృదయులు చేసేపనే తప్ప నిజ విశ్వాసులు చేసేపని కాదు.

నిర్గమకాండము 6:10,11 మరియు యెహోవా మోషేతోనీవు లోపలికి వెళ్లి, ఐగుప్తురాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశములోనుండి వెలుపలికి పోనియ్యవలెనని అతనితో చెప్పుమనెను.

ఈ వచనాలలో దేవుడు ఫరోతో మరలా మాట్లాడమని మోషేకు ఆజ్ఞాపించడం మనం చూస్తాం. అయితే ఈసారి గతంలో వలే అభ్యర్థనగా కాకుండా ఆదేశిస్తున్నట్టుగా ఫరోను హెచ్చరించమంటున్నాడు.

నిర్గమకాండము 6:12 అప్పుడు మోషేచిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు; మాటమాంద్యము గలవాడనగు నా మాట ఫరో యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.

ఈ వచనంలో మోషే, ఇశ్రాయేలీయులే తన‌మాటను వినకపోయేసరికి, దేవుడు ఇదివరకే తన నోటిమాంద్యానికి సూచించిన పరిష్కారాన్ని ప్రక్కనపెట్టి మరలా దానిగురించి ప్రస్తావించడం మనం‌ చూస్తాం. దీనిని బట్టి సేవకులమైన‌ మనమంతా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రకటిస్తున్న దేవునిమాటలను బట్టి, ప్రజలంతా మనకు (ప్రకటనకు) విధేయత చూపించాలని కోరుకుంటామో అప్పుడు ఏదో ఒక సమయంలో నిరుత్సాహపడి, చివరికి దేవుడు‌ మన సమస్యలకు సూచించిన పరిష్కారాలను కూడా మరిచిపోయినట్టుగా ప్రవర్తిస్తాం. ఎందుకంటే మనం‌ పలికే దేవునిమాటలు కేవలం దేవునిపిల్లలనే ఆకర్షిస్తాయి తప్ప, లోకంలో అందరి‌ మెప్పూ పొందుకోలేవు. ఎందుకంటే దేవునిమాటలు లోకానికీ దాని ఆశలకూ వ్యతిరేకంగా ఉంటాయి. అందుకే "మనము దేవుని సంబంధులము; దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు" (1 యోహాను 4:6) అని రాయబడింది.‌

నిర్గమకాండము 6:13 మరియు యెహోవా మోషే అహరోనులతో నిట్లనెను ఇశ్రా యేలీయులను ఐగుప్తు దేశములోనుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్ద కును ఫరో యొద్దకును వెళ్లవలెనని వారి కాజ్ఞాపించెను.

ఈ వచనంలో దేవుడు, మోషే ప్రస్తావించిన అభ్యంతరాలకు బదులేమీ ఇవ్వకుండా ఆయన ముందు చెప్పినట్టుగానే ఫరో దగ్గరకూ ఇశ్రాయేలీయుల దగ్గరకూ వెళ్ళమనడం మనం చూస్తాం. మోషే ప్రస్తావించిన అభ్యంతరాలకు ఆయన‌ గతంలోనే సమాధానం ఇచ్చాడు‌ కాబట్టి అయన మరలా ఏమీ మాట్లాడలేదు.

నిర్గమకాండము 6:14-25 వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులుహనోకు పల్లు హెస్రోను కర్మీ; వీరు రూబేను కుటుంబములు. షిమ్యోను కుమారులు యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావూలు; వీరు షిమ్యోను కుటుంబములు. లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమీ. కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను. మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు. అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను. ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రీ ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రీ. అహరోను అమ్మీమనాదాబు కుమార్తెయు నయస్సోను సహో దరియునైన ఎలీషెబను పెండ్లిచేసి కొనెను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను. కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబీయా సాపు; వీరు కోరహీయుల కుటుంబములు. అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెలలో ఒకతెను పెండ్లిచేసికొనెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను; వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూలపురుషులు.

ఈ వచనాలలో ఇశ్రాయేలీయుల జాతిలోని మూడు గోత్రాల‌ (రూబేను, షిమ్యోను, లేవి) మూలపురుషుల వివరాలు రాయబడడం మనం చూస్తాం. వీరినుండే ఆ మూడు గోత్రాలప్రజలూ విస్తరించారు. అందుకే వారిని ఆయా గోత్రాలకు మూలపురుషులని సంబోధించడం జరిగింది. అంతేతప్ప ఆ వంశావళిలో ప్రముఖుల పేర్లను తీసుకుని మిగిలినవారి పేర్లను విడిచిపెట్టారనే భావం ఇక్కడ లేదు. అయితే ఇక్కడ మోషే ఆ మూడు గోత్రాలవారిని మాత్రమే ఎందుకు ప్రస్తావించినట్టు? ఎందుకంటే ఆదికాండము 49:3-7 వచనాల ప్రకారం, రూబేను, షిమ్యోను, లేవి వీరు ముగ్గురూ యాకోబు చేత శపించబడ్డారు. దాని ఫలితం ఆ గోత్రాలలో నెరవేరుతున్నప్పటికీ దేవుడు వారిని పూర్తిగా విసర్జించలేదని చెప్పడానికే మోషే ఆ మూడు గోత్రాల గురించీ ఇక్కడ ప్రస్తావించాడు. అదేవిధంగా దేవుడు అబ్రాహాముతో చెప్పినట్టుగా అతని సంతానమైన నాలుగవతరం ఐగుప్తునుండి విడిపించబడి కనానును స్వాధీనం చేసుకోవడానికి వెళ్తున్నట్టుగా ఇక్కడ మనం చూడగలం. లేవీ-కహాతు-అమ్రాము-మోషే (ఆదికాండము 15:16). దీనిగురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ద్వారా సూచించబడిన వ్యాసం చదవండి.

ఇశ్రాయేలీయులు, ఐగుప్తులో ఎంతకాలం బానిసలుగా, నివసించారు? 430/400/215?

మరో విషయం ఏంటంటే లేవీకి కహాతు రెండవ కుమారుడు, అతని నుండే మోషే పుట్టి ఇశ్రాయేలీయులకు నాయకుడిగా నియమించబడ్డాడు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులకు రక్షకుడిగా లేవీ పెద్ద కుమారుడైన గెర్షోను సంతతిని ఎన్నుకోలేదు. దేవుని ఎన్నిక ఈవిధంగానే మానవ ఎన్నికకు విరుద్ధంగా ఉంటుంది. ఆయన పెద్దవాడైన ఏశావును ద్వేషించాడు, చిన్నవాడైన యాకోబును ప్రేమించాడు.

ఇక "అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను" అంటే అతను తన తండ్రి స్వంత సహోదరిని వివాహం చేసుకున్నాడని కాదు. అలా చేస్తే అది దేవుని దృష్టికి పాపం ఔతుంది (లేవీకాండము 18:12). మరి యోకెబెదు అమ్రాముకు మేనత్త ఔతుందని ఎందుకు రాయబడిందో ఇప్పటికే వివరించాను (నిర్గమకాండము 2:1 వ్యాఖ్యానం చూడండి)

నిర్గమకాండము 6:26,27 ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తుదేశములోనుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు. ఇశ్రాయేలీయలను ఐగుప్తులోనుండి వెలుపలికి రప్పించ వలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాటలాడిన వారు వీరు; ఆ మోషే అహరోనులు వీరే.

ఈ వచనాలలో మోషే అహరోనుల‌ గురించిన పరిచయం మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో చరిత్రను రాస్తున్న వ్యక్తులు తమను తాము మూడవ వ్యక్తిగా పరిచయం‌ చేసుకోవడం సాధారణంగానే కనిపిస్తుంది. ఎందుకంటే అది చరిత్ర. అందుకే ఆదికాండము నుండి, ద్వితీయోపదేశకాండము వరకూ (పంచకాండాలు) రాసింది మోషేయే అయినప్పటికీ ఇక్కడ తనను మూడవ వ్యక్తిగా పరిచయం చేస్తున్నాడు. సమూయేలు గ్రంథంలోనూ సువార్తలలోనూ కూడా మనం ఇలాంటి పద్ధతినే చూస్తుంటాం (మత్తయి 9:9). దీనిగురించి ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నానంటే చరిత్రకు సంబంధించిన బాషాశైలి కూడా తెలియని కొందరు, వీటిని ఆధారం చేసుకుని మత్తయి సువార్త రాసింది మత్తయి కాదు, నిర్గమకాండము రాసింది మోషే కాదని అజ్ఞానపు ఆరోపణలు చేస్తుంటారు.

నిర్గమకాండము 6:28-30 ఐగుప్తుదేశములో యెహోవా మోషేతో మాటలాడిన దినమున యెహోవానేను యెహోవాను; నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా మోషేచిత్తగించుము; నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.

ఈ వచనాలలో మోషే దేవునితో పలికినమాటలు మరలా జ్ఞాపకం చెయ్యబడడం మనం చూస్తాం. ఇక్కడ బైబిల్ రచయితల యధార్థత మనకు అర్థమౌతుంది. అదేవిధంగా వారివెనుకున్న పరిశుద్ధాత్ముని ప్రేరణ కూడా రుజువౌతుంది. ఎందుకంటే ఇక్కడ మోషే తన గురించి రాస్తున్నప్పుడు ఏమీ దాచకుండా అతను ఎలా దేవుడు వెళ్ళమన్నప్పటికీ అభ్యంతరాలు తెలిపాడో అవన్నీ బహిర్గతం‌ చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడి చేత నడిపించబడుతున్న ప్రతీ విశ్వాసిలోనూ తన లోపాలను ఒప్పుకునే‌ ఇలాంటి యధార్థతే మనం గమనిస్తాం. ఈ లక్షణం‌ లేనివారు పరిశుద్ధాత్ముడి కారణంగా తిరిగి జన్మించి, ఆయనచేత నడిపించబడుతున్నవారు కారు.