Hits: 3399
Print
రచయిత: కె విద్యా సాగర్

27:1-4, 27:5-10, 27:11,12, 27:13,14, 27:15-17, 27:18-20, 27:21-25, 27:26-29, 27:30-33, 27:34-37, 27:38-40, 27:41, 27:42-45, 27:46

ఆదికాండము 27:1-4 ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా, అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితోననెను. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసికొని అడవికి పోయి నాకొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని చెప్పెను.

ఈ వచనాలలో ఇస్సాకు తను మరణసమయం దగ్గరపడిందని ఊహించి పెద్దకుమారుడైన ఏశావును ఆశీర్వదించే ప్రయత్నం చెయ్యడం మనం చూస్తాం. ఇక్కడ "నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు" అని పలికిన ఇస్సాకు యాకోబు పద్దనరాముకు పారిపోయి తిరిగివచ్చేవరకూ అనగా 20 సంవత్సరాలు పైనే బ్రతికియున్నాడు. కాబట్టి ఇస్సాకు ఇలా అనుకోవడంలో కూడా దేవునిసార్వభౌమ నిర్ణయం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అతను ఏశావుకు బదులు యాకోబును దీవించి అతను పద్దనరాములో అభివృద్ధి చెందాలంటే ఇప్పుడే ఆ దీవెన కుమ్మరించబడాలి. దానికి ఇస్సాకులో నేను చనిపోతానేమో అనే ఆలోచన పుట్టాలి.

సామెతలు 21:1 యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును.

ఆదికాండము 27:5-10 ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్లెను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచిఇదిగో నీ తండ్రి నీ అన్నయైన ఏశావుతో మృతి బొందకమునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నాకొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. నీవు మందకు వెళ్లి రెండు మంచి మేక పిల్లలను అక్కడ నుండి నాయొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసెదను. నీ తండ్రి మృతిబొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించునట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసికొనిపోవలెననెను.

ఈ వచనాలలో ఇస్సాకు ఏశావును ఆశీర్వదించబోతున్నాడని తెలుసుకున్న రిబ్కా దానిని యాకోబుకు చెందేలా చెయ్యడానికి మోసపూరితమైన ఆలోచనతో యాకోబును ప్రేరేపించడం మనం చూస్తాం. నిజానికి ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాలన్నదే దేవుని నిర్ణయం, అతను గర్భంలో ఉన్నప్పుడే ఆ సంగతి బయలుపరచబడింది (ఆదికాండము25:23). ఆ నెరవేర్పుగానే ఇదంతా జరుగుతుంది. అయినప్పటికీ ఆమె తలపెట్టిన ఈ కార్యం మోసపూరితం కాకుండా పోదు. ఎందుకంటే ఆమె‌ దేవుని ఏర్పాటును నెరవేర్చాలనే ఆలోచనతో ఇదంతా చెయ్యడం లేదు. ఇస్సాకు మొదటినుండీ ఏశావును ప్రేమించినట్టే (ఆదికాండము 25:27,28) రిబ్కా కూడా యాకోబును ప్రేమిస్తుంది, ఆ ప్రేమతోనే ఇలా చేస్తుంది. కాబట్టి ఆమె చేసే ఈ మోసపూరితమైన పనికి ఆమెనే బాధ్యురాలు. సర్వశక్తిమంతుడైన దేవుడు తన చిత్తాన్ని ఎలాగైనా నెరవేర్చుకుంటాడు. దానికోసం తమకు బోధించబడిన నైతిక బాధ్యతలను తప్పి ప్రవర్తించవలసిన అవసరం ఎవరికీ లేదు. అలా చేసినవారు ఆయన నిర్ణయాన్నే నెరవేర్చినప్పటికీ తమ ప్రవర్తనను బట్టి దోషులే ఔతారు, దానికి పర్యవసానం తప్పదు‌.

ఉదాహరణకు; ఇస్కరియోతు యూదా దేవుని నిర్ణయానుసారంగానే యేసుక్రీస్తును అప్పగించినప్పటికీ యుదులు కూడా ఆ నిర్ణయాన్ని బట్టే ఆయనను చంపించినప్పటికీ (అపో. కా 2:23, అపో.కార్యములు 4:27,28) దానివిషయమై వారు దోషులే అయ్యారు (1 థెస్సలోనిక 2:15). ఎందుకంటే వారు తమ వ్యక్తిగత కక్షలతోనూ దురాశలతోనే అలా చేసారు. యోసేపును కూడా అతని సోదరులు దేవుని ఉద్దేశప్రకారమే ఐగుప్తుకు అమ్మివేసినప్పటికీ (ఆదికాండము 50:20, కీర్తనలు 105:17) వారు అక్కసుతో అలా చేసారు కాబట్టి వారు దోషులే. ఈ అంశం గురించి ఇప్పటికే నేను వివరించాను (ఆదికాండము 3:1 వ్యాఖ్యానం చూడండి).

ఇలా మనిషి చేసే పాపపు క్రియలను బట్టి కూడా దేవుని సార్వభౌమత్వమే నెరవేరుతున్నప్పటికీ ఆ పాపానికి ఆయనెందుకు కర్త కాడో తెలుసుకునేందుకు ఈ వ్యాసం చదవండి.

దేవుణ్ణి పాపానికి కర్తగా చూపిస్తుంది ఎవరు?

అయితే ఇస్సాకుకు యాకోబును దీవించడమే దేవునినిర్ణయం అని తెలిసినప్పటికీ ఏశావును దీవించే సాహసం చేసాడా? కొందరు ఇలా కూడా బోధిస్తుంటారు కానీ దానికి తగిన లేఖన ఆధారం ఎక్కడా లేదు. అలాంటప్పుడు లేఖనం మోపని నిందను అతనిపై మనం మోపకూడదు. ఏశావు అతనికి పెద్దకుమారుడు అనగా జ్యేష్టత్వపు హక్కుదారుడు అందుకే అతన్ని దీవించాలనుకున్నాడు. ఒకవేళ "ఒక జనపదము కంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను" అనే మాటలు అతనికి తెలిసినప్పటికీ ఆ మాటలు తన ఆశీర్వాదంతో ముడిపడి నెరవేరేవని అతనికి తెలియకపోవచ్చు కదా!. అది వేరేలా నెరవేరుతుందని భావించాడేమో? (అసలు ఇస్సాకుకు ఆ సంగతి తెలుసోలేదో కూడా మనకు తెలీదు). కానీ ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు యాకోబు జ్యేష్టుడు కాకపోయినా అతన్ని పూర్తిగా ప్రక్కనపెట్టి ఏశావును మాత్రమే దీవించాలనుకోవడం మాత్రం సమంజసంగా లేదు. అదే యాకోబైతే తన కుమారులల్లో చాలామందిని దీవించడం తక్కినవారిని నిందించడం మనం చూస్తాం (ఆదికాండము 49). ఇస్సాకు మాత్రం ఏశావుపట్ల ఉన్న పక్షపాతంతో ఆ బాధ్యతను విస్మరించాడు. రిబ్కా విషయంలో వివరించినట్టు ఇది కూడా దేవునినిర్ణయ నెరవేర్పుకే. అందుకే యాకోబుకే మొత్తం ఆశీర్వాదం దక్కి ఏశావు తిరస్కరించబడ్డాడు.

ఆదికాండము 27:11,12 అందుకు యాకోబు నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్ననివాడను గదా. ఒకవేళ నాతండ్రి నన్ను తడవిచూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచినయెడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చు కొననని చెప్పెను.

ఈ వచనాలలో రిబ్కా సలహాకు యాకోబు అభ్యంతరం చెప్పడం మనం చూస్తాం. అతను తన తండ్రిని మోసగించకూడదనే ఉద్దేశంతో ఇలా మాట్లాడట్లేదు కానీ తనకు కీడు జరుగుతుందని మాత్రమే భయపడుతున్నాడు‌. దీనినిబట్టి అతని తల్లి చెబుతున్న మోసపూరితమైన ఆలోచన అతనికి కూడా అంగీకారమే.

ఆదికాండము 27:13,14 అయినను అతని తల్లి నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాటమాత్రము విని, పోయి వాటిని నాయొద్దకు తీసికొని రమ్మని చెప్పగా అతడు వెళ్లి వాటిని తన తల్లియొద్దకు తీసికొనివచ్చెను. అతని తల్లి అతని తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపఱచెను.

ఈ వచనాలలో రిబ్కా యాకోబును ధైర్యపరుస్తూ చివరికి నువ్వన్నట్టే జరిగితే ఆ శాపం నామీదకు వస్తుందని పలకడం మనం చూస్తాం. ఇక్కడ ఆమె ఏ మనుష్యుడూ పలుకకూడని మాట పలుకుతుంది. ఎందుకంటే ఎవరూ కూడా మరొకరి శాపాన్ని తమకు ఆపాదించుకోలేరు. యేసుక్రీస్తుకు మాత్రమే అది సాధ్యం. అందుకే దేవుడు మనపై ఉన్న శాపాన్ని ఆయనపై పెట్టి మనల్ని విమోచించాడు (గలతీ 3:13). కాబట్టి విశ్వాసులమైన మనం నెరవేర్చలేని విషయాలలో అవతలివారికి హామీలు ఇస్తూ వారిని ధైర్యపరచకూడదు.

ఆదికాండము 27:15-17 మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడమీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతి కియ్యగా-

ఈ వచనాలలో రిబ్కా యాకోబును ఏశావులా తయారు చేసి ఇస్సాకు వద్దకు పంపే ప్రయత్నం చెయ్యడం మనం చూస్తాం. ఈ ఆలోచన ఆమెకు ముందునుండీ ఉంది కాబట్టే ఇస్సాకు యాకోబును గుర్తించలేడనే నిశ్చయతతో అతడిని ఆవిధంగా ప్రేరేపించింది.

ఆదికాండము 27:18-20 అతడు తన తండ్రియొద్దకు వచ్చినా తండ్రీ, అని పిలువగా అతడుఏమి నా కుమారుడా, నీ వెవరవని అడిగెను అందుకు యాకోబునేను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడను, నీవు నాతో చెప్పినప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచికూర్చుండి, నేను వేటాడి తెచ్చినదానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీ కెట్లు దొరికెనని అడుగగా అతడునీ దేవుడైనయెహోవా నా యెదుటికి దాని రప్పించుట చేతనే అని చెప్పెను.

ఈ వచనాలలో యాకోబు ఇస్సాకు వద్దకు వెళ్ళి తనను ఏశావుగా కనపరచుకోవడం మనం చూస్తాం. ఆ క్రమంలో అతనిలోని పతన స్వభావం స్పష్టంగా బయటపడుతుంది. అతను తన తండ్రితో నేను ఏశావునని అబద్ధం చెప్పడమే కాదు, దానిని‌ నిశ్చయపరచుకోడానికి దేవుడైన యెహోవా పేరును కూడా ప్రస్తావిస్తున్నాడు. యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడమే పాపమైతే (నిర్గమకాండము 20:7). ఒక అబద్ధాన్ని స్థాపించడానికి దానిని ప్రస్తావించడం మరెంత ఘోరపాపమో ఆలోచించండి. ఇంతటి ఘోరపాపిని కూడా దేవుడు తన ఏర్పాటును బట్టి క్షమించి తన పిలుపుకు తగినట్టుగా మార్చాడు.

ఆదికాండము 27:21-25 అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచె దను దగ్గరకు రమ్మని చెప్పెను. యాకోబు తన తండ్రియైన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవిచూచిస్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయైన ఏశావు చేతులవలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గురుతు పట్టలేక అతనిని దీవించి ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను. అంతట అతడు అది నాయొద్దకు తెమ్ము. నేను నిన్ను దీవించునట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను. ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను.

ఈ వచనాలలో ఇస్సాకు యాకోబును ఏశావుగా భావించి అతను తీసుకువచ్చినవాటిని తిని త్రాగడం మనం చూస్తాం. అతనికి వృద్ధాప్యం వల్ల కళ్ళు కనిపించనప్పటికీ చెవులు సరిగ్గానే వినిపిస్తున్నాయి. అప్పటికే అతను తన కుమారుడు తొందరగా వేటను తీసుకురావడం, అతని స్వరం కూడా యాకోబు స్వరంలా‌ ఉండడం గమనించాడు. అలాంటి అనుమానం కలిగినప్పుడే కాస్త జాగ్రత్తను తీసుకుంటూ అతనితో ఎక్కువసేపు మాట్లాడినా లేక వెళ్ళి నీ తమ్ముడైన యాకోబును కూడా ఇక్కడికి తీసుకురమ్మని చెప్పినా ఇలా మోసపోయేవాడు కాదు. తన కుమారుడు వేటాడి తెచ్చిన సమయం విషయంలోనూ స్వరం విషయంలోనూ అనుమానం కలిగినప్పటికీ ఒంటిపై మేకచర్మపు వెంట్రుకలనూ వస్త్రాలనూ గుర్తించి తనకున్న అసలు అనుమానాలను పక్కనపెట్టేసాడు. ఈ విషయంలో ఇస్సాకు దేవుని సార్వభౌమ నిర్ణయం ప్రకారమే విఫలమైనప్పటికీ మనం మాత్రం తార్కికమైన అనుమానాలు కలిగినప్పుడు మోసపోకుండా వివేకంగా ప్రవర్తించాలి. ఈరోజు మనల్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్న అపవాది మోసానికి జనకుడని, వాడు మనల్ని మోసగించడానికి దేనినైనా ఎవర్నైనా తెలివిగా వాడుకోగలడని మరచిపోవద్దు.

ఆదికాండము 27:26-29 తరువాత అతని తండ్రియైన ఇస్సాకు నా కుమారుడా, దగ్గరకువచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి యిట్లనెను. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసనవలె నున్నది. ఆకాశపుమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించుగాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక-

ఈ వచనాలలో ఇస్సాకు యాకోబును ఏశావుగా భావించి అతడిని ఆశీర్వదించడం మనం చూస్తాం. ఈ క్రమంలో "నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు" అంటూ యాకోబు విషయంలో ముందే పలకబడిన "పెద్దవాడు చిన్నవానికి దాసుడగును" అనే మాటలు అతనికే చెందేలా దీవిస్తున్నాడు. అవి ప్రవచనాత్మకమైన దీవెనలు కాబట్టి (ఆదికాండము 49) దేవుడే అతని నోటితో ఇలా పలికించాడు. ఇలా యాకోబు విషయంలో దేవునిసార్వభౌమ నిర్ణయం ఇస్సాకు నోటివెంటే పలకబడింది. అందుకే ఆయన గురించి "నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను" (యెషయా 46:10) అనీ మరియు "నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని" (యోబు 42:2) అని కూడా రాయబడింది.

ఇక ఇస్సాకు యాకోబును దీవించిన వాటిలో భౌతికపరమైన, ఆధ్యాత్మికమైన ఇలా రెండు విధాలైనవి ఉన్నాయి. భౌతికపరమైన ఆశీర్వాదం ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెంది వాగ్దాన భూమిని అనగా కనానును స్వతంత్రించుకోవడంతో నెరవేరితే అధ్యాత్మికమైన ఆశీర్వాదం మెస్సీయ (యేసుక్రీస్తు) లో నెరవేరుతుంది.

ఆదికాండము 27:30-37 ఇస్సాకు యాకోబును దీవించుటయైన తరువాత యాకోబు తన తండ్రియైన ఇస్సాకు ఎదుటనుండి బయలు దేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రియొద్దకు తెచ్చినా తండ్రీ నన్ను దీవించునట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చినదాని తినుమని తన తండ్రితోననెను. అతని తండ్రియైన ఇస్సాకునీ వెవర వని అతనినడిగినప్పుడు అతడునేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడననగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణకుచు అట్లయితే వేటాడిన భోజ్య మును నాయొద్దకు తెచ్చినవారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవింపబడినవాడే యనెను. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్దకేక వేసి ఓ నా తండ్రీ, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను. అతడు నీ సహోదరుడు కపటోపాయ ముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసికొనిపోయెను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ రెండు మారులు మోస పుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసికొనెనని చెప్పినాకొరకు మరి యే దీవెనయు మిగిల్చి యుంచలేదా అని అడిగెను. అందుకు ఇస్సాకు ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరిని అతనికి దాసులుగా ఇచ్చితిని. ధాన్యమును ద్రాక్షారస మును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏసావుతో ప్రత్యుత్తరమియ్యగా-

ఈ వచనాలలో ఏశావు జరిగిన మోసం గ్రహించి దుఃఖించడం మనం చూస్తాం. వాస్తవానికి ఇతను ఒక పూటకూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినప్పుడే ఆ ఆశీర్వాదం విషయంలో హక్కును కూడా కోల్పోయాడు. అందుకే "ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు." (హెబ్రీ 12:16,17) అని రాయబడింది. ఇలాంటి పరిస్థితి విశ్వాసులకు రాకుండా జాగ్రత్తపడాలి. ఎప్పుడైతే దైవికమైనవాటిని చులకనగా చూస్తామో అప్పుడే దైవికమైన ఆశీర్వాదాలను కూడా కోల్పోతాం.

ఆదికాండము 27:38-40 ఏశావు నా తండ్రీ, నీయొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రీ, నన్ను, నన్ను కూడ దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి యేడ్వగా అతని తండ్రియైన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండిపడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు నీకత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడు చుండగా నీ మెడమీదనుండి అతనికాడి విరిచివేయుదువు అని అతని కుత్తరమిచ్చెను.

ఈ వచనాలలో ఏశావు నన్ను కూడా దీవించమని ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ఇస్సాకు ప్రతిస్పందన మనం చూస్తాం. ఇక్కడ "నీ నివాసం భూసారము లేకయూ మంచులేకయూ" ఉంటుందని తర్జుమా చెయ్యబడిన చోట హీబ్రూ బాషలో విభక్తిగా వాడిన ఒక పదాన్ని బట్టి అవి ఉంటాయని కూడా తర్జుమా చెయ్యవచ్చు. అందుకే కొన్ని ఇంగ్లీషు బైబిళ్ళలో అవి ఉంటాయని కూడా తర్జుమా చేసారు. దీనిఆధారంగా కొందరు ఏశావు కూడా భౌతికపరమైన దీవెనను పొందుకున్నాడని, ఆధ్యాత్మికమైన దీవెనలను మాత్రం కోల్పోయాడని ‌బోధిస్తారు. కానీ సందర్భానుసారంగా చదివితే మన తెలుగు బైబిల్ లో అవి ఉండవని చేసిన తర్జుమానే సరైందని అనిపిస్తుంది.

అదేవిధంగా ఏశావు సంతానం నివసించిన ఎదోము దేశం మృతసముద్రానికి దక్షిణంగా ఉంటుంది ఇది సారవంతమైన భూమికాదు. అందుకే తర్వాత మాటలో అతను కత్తిచేత (వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడకుండా) బ్రతుకుతాడని కనిపిస్తుంది. ఇది ఇశ్రాయేలీయులతోనూ మిగిలిన జాతులతోనూ అతని సంతానానికుండే వైరాన్ని కూడా సూచిస్తుంది. ఇక్కడ ఇస్సాకు చెప్పినట్టే ఏశావు సంతానం ఇశ్రాయేలీయులకు కొంతకాలం దాసులుగా జీవించి తరువాత స్వతంత్రులయ్యారు (2 రాజులు 8:20-22).

ఆదికాండము 27:41 తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతనిమీద పగపట్టెను. మరియు ఏశావునా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను.

ఈ వచనంలో ఏశావు యాకోబుపై పగబట్టి‌ తన తండ్రి చనిపోగానే అతడిని చంపాలనుకోవడం మనం చూస్తాం. ఇతను కయీనులా తన తమ్ముడిని హత్యచెయ్యాలనే ఆలోచనతో ఉన్నాడే తప్ప, గతంలో ఒకపూట భోజనం కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన పొరపాటును గుర్తించడం లేదు. నువ్వు కత్తితో బ్రతుకుతావనే తండ్రి మాటకు నెరవేర్పుగా ఆ కత్తిని మొదటి తన సోదరుడిపైనే ఉపయోగించాలని ఆలోచిస్తున్నాడు. 

అదేవిధంగా అతను యాకోబుపై ఎంత పగపట్టినప్పటికీ ఆ పగ తన తండ్రి చనిపోయాకే తీర్చుకుందామని వాయిదా వేసుకుంటున్నాడు. ఇలా కొన్నిసార్లు దేవుడు దుష్టులు చెయ్యదలచిన దుష్టత్వాన్ని వెంటనే జరిగించకుండా వారికున్న కారణాలతోనే నియంత్రిస్తాడు. ఆయన ఆవిధంగా నియంత్రించకుంటే ఈ ప్రపంచంలో చంపాలకున్న అందరూ చంపుకుంటూ పోయేవారు

ఆదికాండము 27:42-45 రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు మాటలనుగూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను ఇదిగో నీ అన్నయైన ఏశావు నిన్ను చంపె దనని చెప్పి నిన్ను గూర్చి తన్నుతాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్నకోపము చల్లారువరకు నీ అన్న కోపము నీమీదనుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచువరకు లాబానునొద్ద కొన్నాళ్లు ఉండుము. అప్పుడు నేను అక్కడనుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ యిద్దరిని నేను పోగొట్టుకొన నేల అనెను.

ఈ వచనంలో ఏశావు పగ గురించి తెలుసుకున్న రిబ్కా వివేకంగా ఆలోచిస్తూ యాకోబును తన సోదరుడి ఇంటికి పంపే ప్రయత్నం చెయ్యడం మనం చూస్తాం. బహుశా ఆమె ఏశావుకు సంబంధించిన వ్యక్తిద్వారా ఆ సమాచారం తెలుసుకునియుంటుంది. "ఒక్కనాడే మీ యిద్దరిని నేను పోగొట్టుకొన నేల" అంటే ఇస్సాకు యాకోబుల గురించి మాట్లాడుతుంది.

ఆదికాండము 27:46 మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసికొనిన యెడల నా బ్రదుకు వలన నాకేమి ప్రయోజనమనెను.

ఈ వచనాలలో రిబ్కా యాకోబును తన సహోదరుని వద్దకు పంపే ప్రణాళికలో ఇస్సాకు అనుమతి కోరుతూ దానికి కారణం చెప్పడం మనం చూస్తాం. ఆమె అబద్ధం చెప్పడం లేదు కానీ అక్కడున్న పరిస్థితిని బట్టి వేరే కారణాన్ని‌ చెబుతూ (అది కూడా నిజమే) జ్ఞానయుక్తంగా నడుచుకుంటుంది. సమూయేలు కూడా దావీదును రాజుగా అభిషేకించడానికి సౌలుకు భయపడి యెష్షయికి వేరే కారణం చెప్పి (బలి) తనదగ్గరకు పిలిపించుకున్నాడు (1 సమూయేలు 16:1-3). ఈవిధంగా చెయ్యమని దేవుడే అతనికి బోధించాడు. ఎందుకంటే అక్కడ బలి అర్పించబడుతుందనేది కూడా నిజమే. కాబట్టి ప్రాణహాని సంభవిస్తుందని కానీ ఇబ్బందులు పాలు ఔతామని కానీ గ్రహించినప్పుడు మనం చేసే పనులకు అన్ని కారణాలూ వివరించక్కర్లేదు. కొన్ని వివరించినా చాలు.